వీడని పేదరికం, వివక్ష, అసమానతలు.. ప్రమాదంలో భారత స్వావలంబన

వీడని పేదరికం, వివక్ష, అసమానతలు..  ప్రమాదంలో భారత స్వావలంబన

భారతదేశం ఒక స్వాతంత్య్ర దేశం అనడానికి ఒకే కొలమానం తమ నిర్ణయాలు తామే చేసుకోగలగడం.  ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగంతో కూడిన నిర్ణయాధికారం ప్రజల సార్వభౌమత్వంగా కూడా భావిస్తున్నాం. రాచరిక పాలన కాకుండా  ప్రజల పాలన ఉండాలని రాజ్యాంగం ద్వారా సంస్థలు, పాలనా వ్యవస్థలు ఏర్పరుచుకున్నాం.  ఈ మొత్తం వ్యవస్థ అనేకమార్లు ఒత్తిడికి లోనయ్యింది.  ఇప్పటికీ వివిధ సందర్భాలలో ప్రజాస్వామ్యం ఉన్నదా అని అనుమానం కలుగుతుంది. పేదరికం, వివక్ష, అసమానతలు  కొనసాగుతున్న దశలో నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందా అని ప్రశ్నిస్తూనే ఉన్నారు.  

అయితే, ప్రజాస్వామ్యం, ఎన్నికలు, రాజ్యాంగం, పార్లమెంట్ తదితర సంస్థలున్నాయి. వాక్ స్వతంత్రం ఉన్నది కాబట్టి మనం ‘స్వతంత్రులమే’ అని భావించేవారు ఉన్నారు. అయితే, కొన్ని విపరిణామాల నేపథ్యంలో ‘స్వాతంత్రం’ ప్రమాదంలో పడింది అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి.  స్వావలంబన, ప్రజల సార్వభౌమత్వం ప్రమాదంలో పడింది.  కాబట్టి మన స్వతంత్ర పరిస్థితిని ఒకసారి అవలోకనం చేసుకోవడం 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చాలా ముఖ్యం.

గత 78 ఏండ్లలో వివిధ సందర్భాలలో  ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. 1995లో  అప్పటి ప్రభుత్వం పార్లమెంటును విశ్వసించకుండా, కనీసం ఒప్పందం ప్రతి ప్రజలకు అందించకుండా, ముందస్తు సంప్రదింపుల ఊసే లేకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ  ఏర్పాటుకు జరిగిన తొలి ఒప్పందాలపై సంతకం పెట్టింది. ఈ ఒప్పంద ప్రతి ప్రజలకు చేరడానికి దాదాపు దశాబ్దం పట్టింది. అంతకుముందు, ఆ తరువాత కూడా ఆర్థిక సరళీకరణ విధానాలు స్వదేశీ ఉత్పత్తి, ఆర్థికరంగాన్ని బలహీనపరుస్తున్నా ఆధునికత అందిపుచ్చుకోవాలనే ఆత్రంలో అమలులోకి తేవడం చూశాం. 

ఒక ముప్ఫై ఏండ్ల నుంచి అదే పాట పాలకులు పాడుతున్నారు. ఆధునిక ఆర్థిక సరళీకరణ విధానాలకు ఆద్యుడిగా భావించే డా. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా రెండోసారి ఏలినప్పుడు విధానాలకు ‘మానవ కోణం’ జోడించాలి అనే అవసరాన్ని గుర్తు చేశారు. మానవ కోణం అంటే ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన పౌరులకు ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇవ్వాలి. మార్కెట్ విధానాలకు తలొగ్గిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడులు కేవలం కంటితుడుపు చర్యగా పరిగణిస్తూ  సుస్థిర అభివృద్ధి విధానాలకు తిలోదకాలు ఇచ్చేశారు. 

ప్రభుత్వ విధానాల్లో తీవ్ర మార్పు

ప్రపంచ వాణిజ్య సంస్థ వల్ల వాణిజ్యం పెరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, దేశం ఆధునికతను అంది పుచ్చుకుంటుంది, వినియోగం పెరుగుతుంది, తక్కువ ధరకు విదేశీ వస్తువులు, సేవలు అందుబాటులోకి వస్తాయి అని అనేక ప్రయోజనాలు  ప్రజల ముందు పెట్టారు. అవేవీ జరగలేదు. అయినా కూడా ఎగుమతులు, -దిగుమతుల క్రీడ ఆడడం మానలేదు. ప్రపంచీకరణ వల్ల అనేక అలనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ తరహా కంపెనీలు దేశంలో తిష్ట వేశాయి. ప్రభుత్వాలను శాసిస్తున్నాయి. వాటి ప్రాబల్యం, పరపతి ఎంతగా పెరిగింది అంటే ఇదివరకు ప్రజా ప్రతినిధులు ప్రైవేటు కంపెనీ సమావేశాలకు వెళ్లాలంటే  భయపడేవారు. 

ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్లలో  సమావేశానికి వెళ్లామని సగర్వంగా  ప్రకటించుకుంటున్నారు.  అదే పౌర సమాజం పిలిస్తే రారు, పలకరు, మాట్లాడరు. రాజకీయ నిర్ణేతలలో పెరిగిన ఈ రకం విపరీత ధోరణి వల్ల సాంఘిక, ఆర్థిక అసమానతలు పెరిగాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో భారతదేశం అందులో సభ్యత్వం తీసుకున్ననాటి నుంచి ప్రభుత్వ విధానాలలో తీవ్ర మార్పు కనపడింది.  అభివృద్ధి ప్రణాళికల రచనకు ఉన్న విధి విధానాలు అన్నీ క్రమంగా మరుగునపడ్డాయి.  ప్రతి ఏటా మన దేశం నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు, విధాన నిర్ణేతలు విదేశాలకు వెళ్లి అక్కడి విధానాల పట్ల ఆకర్షితులై హేతుబద్ధ ఆలోచన చేయడం మానేశారు.  

ఒప్పందాల్లో కొరవడిన పారదర్శకత

గత 3 దశాబ్దాలలో అనేక అంతర్జాతీయ ఒప్పందాలు వచ్చాయి. అనేకం చర్చలలో ఉన్నాయి. గత ఐదేండ్ల నుంచి అంతర్జాతీయ ఒప్పందాలలో భాగంగా ప్రతి దేశం తన విధానాలు, పాలనలో మార్పులు తీసుకురావాల్సి వస్తున్నది. మన దేశంలో భిన్నంగా ఏమి లేదు.  ప్రతి సభ్య దేశం ఖచ్చితంగా అమలు చేయాల్సిన అంశాలు,  ఉత్తర్వులు ఈ ఒప్పందాల నుంచి వస్తున్నాయి. కొన్ని దేశాలు ఆ ఒప్పందాలను తమ శాసనకర్తల ముందు చర్చించి ఆమోదించి తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. భారత్​లో అది జరగడం లేదు.  

కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ప్రజలను ఆ చర్చలలో భాగస్వాములను చేయాలని భావించడం లేదు.  క్రమంగా ఈ ఒప్పందాలలో అంశాలను, నిర్ణయాలను నిర్దేశించటం ద్వారా కొన్ని దేశాలు దాదాపు అన్ని దేశాలను నియంత్రించే స్థాయికి చేరాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాలలో భాగంగా అనేక ‘విదేశీ’ నిర్ణయాలను, విదేశీ ప్రయోజనాలకు అనుకూలంగా విధానాలను తీసుకువస్తున్నది. ఈ క్రమంలో విధానాల తయారీ ప్రక్రియ కూడా పార్లమెంటును దాటిపోయింది. 

స్వతంత్ర నిర్ణయాలకు ఆటంకం

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఉక్రెయిన్, -రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్​కు ఆయుధాలు కావాలంటే ఆ దేశంలో ఖనిజాలు తమకు ఇవ్వాలని కోరి, ఒప్పందం చేసుకోవడం దేశాల మధ్య దోపిడీ ఏ స్థాయికి చేరిందో తెలియజెప్పే ఒక ఉదాహరణ.  భారత్ కూడా రష్యాతో వాణిజ్యం తగ్గించుకుంటే సుంకాల మీద ఆలోచిస్తామని ట్రంప్​ చెప్పడం కూడా మనం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి ఒక ఆటంకంగా పరిగణించాలి.  ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ  విధానాలు మన దేశ స్వావలంబన మీద చూపెడుతున్న దుష్ప్రభావాన్ని బేరీజు వేసేందుకు పరిశోధన సంస్థలు,  ప్రజాప్రతినిధులు సిద్ధంగా లేరు.  

దాదాపు 56 వేల అంతర్జాతీయ, బహుళజాతి ఒప్పందాలు ఉన్నాయి. భారతదేశం అనేక ఒప్పందాలలో భాగస్వామి. ఎన్ని అనేది ప్రజలకు తెలియదు. ప్రభుత్వం చెప్పడం లేదు. అయితే ఇటీవలి కొన్ని ఒప్పందాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక కొత్త ‘మహమ్మారి’ ఒప్పందం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నది. మహమ్మారి నివారణకు, వచ్చిన తరువాత దాని యాజమాన్యానికి అవసరమైన చికిత్స విధానాలు ఈ అంతర్జాతీయ సంస్థ పరిధిలోకి వచ్చి జాతీయ ప్రభుత్వాల పాత్ర నామమాత్రం కానున్నది. ఫార్మా కంపెనీలకు అనుగుణంగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. భారత్ మాత్రం ఇందులో కీలకపాత్ర పోషించేందుకు ఉత్సాహపడుతున్నది. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడితే అభివృద్ధి

మన దేశం అమెరికా నుంచి వివిధ జన్యుమార్పిడి పంట ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి ఉన్నది. ఇవి దిగుమతి అయితే రైతులు గిట్టుబాటు ధర కోల్పోవడంతోపాటు మన విత్తన రకాలు కలుషితం అవుతాయి. ప్రజల ఆరోగ్యం పాడవుతుంది. ఈ ఒత్తిడి మన స్వాతంత్ర్యం మీద, స్వావలంబన మీద దాడిగా పరిగణించాలి.  ప్రపంచ వాతావరణ సదస్సులో అనేక విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి. పెరుగుతున్న పుడమి వేడిని తగ్గించడానికి, పచ్చదనం విస్తరణకు ప్రతి దేశం తీవ్ర మార్పులు చేపట్టాలి అని ఏకాభిప్రాయం వచ్చింది. 

అయితే, ఈ విషయంలో కూడా మనం స్వావలంబన కోల్పోకుండా, జీవనోపాధులను ధ్వంసం చేయకుండా, జీవన ప్రమాణాలు పడిపోకుండా నిర్ణయాలు తీసుకోవాలి.  ఆహారం, ఎనర్జీ  ఇతరత్రా ఇతర దేశాల మీద ఆధారపడకుండా, స్వతంత్రంగా, స్వావలంబనను కొనసాగించే ఉత్పత్తి, సేవల వ్యవస్థను నిర్మించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.

విదేశీ వ్యవస్థకు అనుకూలంగా స్వదేశీ శక్తులు

ప్రపంచీకరణ, ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్దేశిత వాణిజ్య అనుకూల అభివృద్ధి దేశీయ విధానాలు 1995–-2005 మధ్యలో అస్పష్టంగా ఉన్నప్పటికీ తరువాతి దశాబ్దాలలో ఊపు అందుకున్నాయి. ఈ విధానాల వల్లే  పాలన గాడి తప్పి, అవినీతి పెరిగి, రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు పెరిగి, కేంద్రంలో, రాష్ట్రాలలో అధికార మార్పిడి వేగంగా జరిగింది. ఈ విదేశీ వ్యవస్థకు అనుకూలంగా ఉన్న స్వదేశీ శక్తులు రాజకీయ అధికారాన్ని కూడా నిర్దేశించే దశకు భారత రాజకీయాలు చేరాయి.  

భారతదేశం అన్ని రకాల పంటలలో స్వయంప్రతిపత్తి కలిగిన దశ నుంచి కొన్ని పంటలలో దిగుమతుల మీద ఆధారపదే దుస్థితికి చేరడం ఈ రకమైన నిర్ణయాల వల్లనే జరుగుతున్నది. 9 రకాల నూనె పంటలు పండించే మన దేశం ఇప్పుడు ఒక్క రకం నూనె (పామాయిల్) దిగుమతులు లేకుండా ఆర్థిక రంగం కుదేలు అయ్యే పరిస్థితికి చేరింది. పౌరులు తమకు ఇష్టమైన నూనెను వాడలేని దుర్దశకు చేరినాం. ప్రపంచంలో అతి పెద్ద ఉత్పత్తిదారుగా వేలఏండ్ల నుంచి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులలో ఉన్న  మనం స్వావలంబన కోల్పోయినాం. విదేశీ దిగుమతుల మీద ఆధారపడుతున్నాం.

- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​