సౌతాఫ్రికా-ఏ తో జరిగిన రెండో అనధికారికా టెస్ట్ లో ఇండియా-ఏ బ్యాటింగ్ లో తడబడుతోంది. మొదటి రోజు ఆటలో భాగంగా మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-ఏ టాపార్డర్, మిడిల్ ఆర్డర్ విఫలమైంది. గురువారం (నవంబర్ 6) బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ప్రస్తుతం ఇండియా-ఏ 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజ్ లో వికెట్ కీపర్ ధృవ్ జురెల్ (36), ఆకాష్ దీప్ (0) ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో టియాన్ వాన్ వురెన్ మూడు.. షెపో మోరెకి రెండు.. ప్రేనేలన్ సుబ్రాయెన్ లకు ఒక వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా-ఏ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఇండియా-ఏ కి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. అభిమన్యు ఈశ్వరన్ పరుగుల ఖాతా తెరవకుండానే డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ క్రీజ్ లో కుదురుకోవడానికి సమయం తీసుకున్నారు. వీరిద్దరూ వికెట్ల పతనాన్ని కాసేపు ఆపినా పరుగులు చేయడంలో తడబడ్డారు. రెండో వికెట్ కు 35 పరుగులు జోడించిన తర్వాత రాహుల్ 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. కాసేపటికే సాయి సుదర్శన్ పెవిలియన్ కు చేరాడు. నిరూపించుకోవడానికి మంచి ఆవకాశం వచ్చినా దేవదత్ పడిక్కల్ విఫలమయ్యాడు.
5 పరుగులే చేసి నిరాశపరిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్ మూడు ఫోర్లు కొట్టి మంచి టచ్ లో కనిపించినా 24 పరుగులకే ఔటయ్యాడు. దీంతో ఇండియా-ఏ జట్టు 86 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. హర్ష దూబే కూడా 14 పరుగులకే ఔట్ కావడంతో 119 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. జురెల్ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు.
