న్యూఢిల్లీ: ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా దాడిచేసే ప్రమాదం ఉన్నందున వెంటనే ఇరాన్ ను వీడివెళ్లాలని ఆ దేశంలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. కమర్షియల్ ఫ్లైట్లతోపాటు అందుబాటులో ఉన్న విమానాలు ఎక్కి ఇరాన్ ను వీడివెళ్లాలని ఇరాన్ లోని ఇండియా ఎంబసీ సూచించింది. ఇరాన్ లో ఉన్న ఇండియా స్టూడెంట్లు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, టూరిస్టులు ఇలా ప్రతిఒక్కరికీ ఆ అడ్వైజరీ వర్తిస్తుందని ఎంబసీ తెలిపింది.
‘‘గత నెల 14న జారీచేసిన అడ్వైజరీనే మళ్లీ జారీ చేస్తున్నాం. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ పై యూఎస్ ఎప్పుడు దాడి చేస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ లోని భారతీయ పౌరులు, భారత సంతతి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాం. అలాగే ఇరాన్ ప్రభుత్వంపై ఆ దేశ పౌరులు గత కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండండి’’ అని అడ్వైజరీలో తెలిపారు. ఇరాన్ లోని ఇండియన్ ఎంబసీతో ఎప్పటికపుడు కాంటాక్ట్ లో ఉండాలని, స్థానిక పరిణామాలను గమనిస్తూ ఉండాలని సూచించారు.
