‘సర్’పై అక్టోబర్ 6న కలెక్టరేట్ల నిర్బంధం..అక్టోబర్ 8న లోక్ భవన్ ముట్టడి, నవంబర్1న చలో ఢిల్లీ

 ‘సర్’పై అక్టోబర్ 6న కలెక్టరేట్ల నిర్బంధం..అక్టోబర్ 8న లోక్ భవన్ ముట్టడి, నవంబర్1న చలో ఢిల్లీ
  •     ఇండియా కూటమి ప్రతినిధులతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ భేటీ 

హైదరాబాద్, వెలుగు: ‘సర్’ కు వ్యతిరేకంగా ఈ నెల 6న కలెక్టరేట్ల నిర్బంధం, 8న లోక్​భవన్​ముట్టడి చేపట్టాలని ఇండియా కూటమి​నిర్ణయించింది.  ఆయా నిరసన కార్యక్రమాలు, వాటి విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై శనివారం గాంధీ భవన్ లో ఇండియా కూటమి నేతలతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సమావేశమయ్యారు. 6న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి, కలెక్టర్లను నిర్బంధించాలని,  8న కూటమి పార్టీల ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడించాలని నిర్ణయించారు.

నవంబర్ 1న చలో ఢిల్లీపై సమావేశంలో చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘం అక్రమాలపై దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిర్వహించ తలపెట్టిన ఆందోళనలపై ఢిల్లీలో ఈ నెల 5న ఏఐసీసీ నిర్వహించే మీటింగ్ కు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హాజరుకానున్నారు. మహేశ్ గౌడ్ తో భేటీ అయిన ఇండియా కూటమి నేతల్లో సీపీఐ నుంచి నరసింహా, పస్య పద్మ, సీపీఎం నుంచి జాన్ వెస్లీ, ఎండీ అబ్బాస్, సమాజ్ వాది పార్టీ నుంచి సింహాద్రి, తెలంగాణ జన సమితి నుంచి ఎం.నరసయ్య, ఆశప్, బీసీ జనసమితి నుంచి జశ్వంత్ కుమార్, సలీం పాషా, ఆర్జేడీ నుంచి శోభా యాదవ్ పాల్గొన్నారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరును ఇండియా కూటమిలోని పార్టీలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయని చెప్పారు. జ్ఞానేశ్ కుమార్ ను సీఈసీ పదవి నుంచి తొలగించడమే కాదని, ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీఈసీని బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు.  జాన్ వెస్లీ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సర్ పేరుతో 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. తొలగించిన ఓట్లలో అర్హులైన వారి ఓట్లను తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఏం చెపితే, సీఈసీ అదే చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర నేత ఈటీ నర్సింహులు ఆరోపించారు. దీనిపై దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.