రాజ్‌‌ కోట ఎవరిదో!.. ఇవాళ్టి నుంచి ఇండియా, ఇంగ్లండ్ మూడో టెస్ట్

రాజ్‌‌ కోట ఎవరిదో!.. ఇవాళ్టి నుంచి ఇండియా, ఇంగ్లండ్ మూడో టెస్ట్

రాజ్‌‌కోట్‌‌ : తొలి టెస్టులో ఇండియాకు ఇంగ్లండ్ షాకిస్తే.. రెండో మ్యాచ్‌‌లో ప్రత్యర్థిని దెబ్బకొట్టిన రోహిత్‌‌సేన లెక్క సరిచేసింది.  ప్రస్తుతం 1–1తో సమంగా ఉండగా.. ఐదు టెస్టుల సిరీస్‌‌లో ఆధిక్యం దక్కించుకునేందుకు ఇరు జట్లూ రెడీ అయ్యాయి.  గురువారం రాజ్‌‌కోట్‌‌లో మొదలయ్యే మూడో టెస్టులో గెలిచి సిరీస్‌‌లో ముందంజ వేయాలని టీమిండియా ఆశిస్తోంది. 

పలువురు సీనియర్ల గైర్హాజరీలో యువ క్రికెటర్లపై నమ్మకం ఉంచి బరిలోకి దిగుతోంది.  మరోవైపు ఇంగ్లిష్ టీమ్ కూడా ఆధిక్యంపై గురి పెట్టింది. ఈ మ్యాచ్‌‌ ఇంగ్లండ్ కెప్టెన్‌‌ బెన్ స్టోక్స్‌‌కు వందో టెస్టు.  దాంతో ఈ పోరును ఎప్పటికీ గుర్తుండేలా చేసుకోవాలని స్టోక్స్‌‌తో పాటు ఇంగ్లిష్ ప్లేయర్లు కోరుకుంటున్నారు. 

కెప్టెన్‌‌ ఫామ్‌‌లోకి వచ్చేనా

యంగ్‌‌ స్టర్ యశస్వి జైస్వాల్ (321 రన్స్‌‌),  పేస్ లీడర్ జస్‌‌ప్రీత్ బుమ్రా (15 వికెట్లు) సూపర్ పెర్ఫామెన్స్‌‌తో టీమిండియా సిరీస్‌‌లో పుంజుకుంది. అయినా టీమ్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయి.ఇందులో ప్రధానమైనది మిడిలార్డర్‌‌‌‌ తడబాటు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌‌ కూడా ఇబ్బందిగా మారింది. విరాట్ కోహ్లీ సిరీస్‌‌ మొత్తానికి దూరంగా ఉండగా.. గాయం కారణంగా కేఎల్‌‌ రాహుల్ ఈ మ్యాచ్‌‌లో బరిలోకి దిగడం లేదు. శ్రేయస్ అయ్యర్‌‌‌‌ టీమ్‌‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో  సీనియర్‌‌‌‌గా, కెప్టెన్‌‌గా రోహిత్ టీమ్‌‌ను ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. 

గత ఏడాదిగా ఈ ఫార్మాట్‌‌లో దూకుడైన బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ భారీ స్కోర్లు సాధించలేకపోతున్నాడు.ఈ నేపథ్యంలో తను ఎక్కువ సమయం క్రీజులో ఉండి పరిస్థితికి తగ్గట్టు గేర్లు మారిస్తే ప్రయోజనం ఉండొచ్చు. రాహుల్ ప్లేస్‌‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్‌‌ ఖాన్‌‌ అరంగేట్రం చేయడం ఖాయమే.   డొమెస్టిక్ క్రికెట్‌‌లో దంచికొడుతున్న సర్ఫరాజ్ మరో యంగ్‌ స్టర్ రజత్ పటీదార్‌‌‌‌తో కలిసి మిడిలార్డర్ బాధ్యత తీసుకోనున్నాడు. వరుసగా ఫెయిల్ అవుతున్న కేఎస్‌‌ భరత్ స్థానంలోయూపీ చెందిన  23 ఏండ్ల ధ్రువ్ జురెల్‌‌ కూడా అరంగేట్రం చేసే చాన్సుంది.  

ఇక,  గాయం కారణంగా వైజాగ్‌‌ టెస్టుకు దూరంగా ఉన్న  ఆల్‌‌రౌండర రవీంద్ర జడేజా ఫుల్ ఫిట్‌‌నెస్‌‌తో టీమ్‌‌లోకి తిరిగి రావడంతో మిడిలార్డర్ కు కొంత బలం చేకూరింది. తన సొంతగడ్డ రాజ్‌‌కోట్‌‌లో సత్తా చాటేందుకు జడ్డూ సిద్ధంగా ఉన్నాడు.   ఇక రాజ్ కోట్‌‌ వికెట్‌‌ సంప్రదాయంగా బ్యాటర్లకు అనుకూలిస్తుంది.  ఈ మ్యాచ్‌ కోసం ఫ్లాట్ వికెట్ రెడీ చేశారు.  ఈ నేపథ్యంలో చైనామన్‌‌ కుల్దీప్ యాదవ్

 అక్షర్ పటేల్‌‌లో ఒక్కరే తుది జట్టులో ఉంటారు. ఆల్‌‌రౌండర్ అయిన అక్షర్‌‌‌‌కే మొగ్గుంది. స్పిన్ వికెట్లపై సైతం చెలరేగిపోతున్న పేస్  లీడర్‌‌ బుమ్రా అదే జోరు కొనసాగిస్తే టీమ్‌‌కు తిరుగుండదు. రెండో టెస్టుకు రెస్ట్ తీసుకున్న సిరాజ్ తిరిగి రావడంతో పేస్ బౌలింగ్ కూడా మరింత బలంగా మారనుంది. 

ఇంగ్లండ్ ఫ్రెష్‌‌గా...

ఈ సిరీస్‌‌లో ఇంగ్లండ్ టీమ్ తమ బలం కంటే ఇండియా బలహీనతలను గుర్తించి దెబ్బకొట్టడంలో సక్సెస్ అయింది. అంతగా అనుభవం లేని ఆతిథ్య మిడిలార్డర్‌‌‌‌ను టార్గెట్‌‌ చేసి హైదరాబాద్‌‌ టెస్టులో గెలిచింది. రెండో టెస్టులోనూ ప్రతికూల పరిస్థితుల్లో గట్టి పోటీనే ఇచ్చింది. రాజ్‌‌ కోట్‌‌లోనూ తమ బజ్‌‌బాల్ గేమ్‌‌ను కొనసాగించాలని చూస్తోంది. ఆ టీమ్ స్పిన్నర్‌‌‌‌ టామ్ హార్ట్‌‌లీ సిరీస్‌లో సూపర్ పెర్ఫామెన్స్‌‌ చేస్తున్నాడు. హైదరాబాద్‌‌లో కెరీర్‌‌‌‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌‌ ఆడిన ఒలీ పోప్‌‌ వైజాగ్‌‌లో రెండు ఇన్నింగ్స్‌‌ల్లో ఫెయిలవడం ఆ టీమ్‌‌ను కాస్త ఇబ్బంది పెట్టే అంశం. 

రెండో మ్యాచ్‌‌ తర్వాత ఇంగ్లండ్ ప్లేయర్లంతా గ్రౌండ్‌‌కు దూరంగా ఉండి అబుదాబి వెళ్లి రిలాక్స్ అయ్యారు. ఈ మ్యాచ్‌‌ను ఫ్రెష్‌‌గా స్టార్ట్ చేస్తున్నారు. ఇండియా మాదిరిగా ఇంగ్లిష్‌ టీమ్‌లోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి.  సీనియర్ బ్యాటర్ జో రూట్‌‌ బ్యాటింగ్‌లో కంటే  స్పిన్‌‌ బౌలింగ్‌‌తో సత్తా చాటుతున్నాడు. గాయంతో స్పిన్నర్ జాక్‌‌ లీచ్‌‌ దూరం అవ్వడంతో ఇంగ్లిష్ టీమ్ అతనిపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే

 గత నాలుగు ఇన్నింగ్స్‌‌ల్లోనూ బ్యాట్‌తో ఫెయిలైన రూట్‌‌ ఈసారి మెరుగవ్వాలని జట్టు కోరుకుంటోంది. మరో  సీనియర్ జానీ బెయిర్‌‌‌‌స్టో కూడా ఫామ్‌‌లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇక వందో టెస్టు ఆడుతున్న కెప్టెన్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌పై అందరి ఫోకస్ ఉంది. చివరగా 2016లో రాజ్‌‌కోట్‌‌లో ఆడిన టెస్టులో స్టోక్స్‌‌ సెంచరీతో సత్తా చాటాడు. ఈసారి ఏం చేస్తాడో చూడాలి.

తుది జట్లు

ఇండియా (అంచనా) :  రోహిత్ (కెప్టెన్), యశస్వి గిల్, రజత్, సర్ఫరాజ్, జడేజా, జురెల్/భరత్ (కీపర్), అశ్విన్, అక్షర్​/కుల్దీప్,  బుమ్రా, సిరాజ్

ఇంగ్లండ్ :  క్రాలీ, డకెట్, ఒలీ పోప్, రూట్, బెయిర్‌‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (కీపర్), రెహాన్, టామ్ హార్ట్‌‌లీ, మార్క్ వుడ్, అండర్సన్.