IND Vs SL: రిలాక్స్ అవ్వడానికి లేదు.. శ్రీలంకతో చివరి మ్యాచ్‌లో టీమిండియా దృష్టి పెట్టాల్సిన మూడు అంశాలివే!

IND Vs SL: రిలాక్స్ అవ్వడానికి లేదు.. శ్రీలంకతో చివరి మ్యాచ్‌లో టీమిండియా దృష్టి పెట్టాల్సిన మూడు అంశాలివే!

ఆసియా కప్ లో శుక్రవారం (సెప్టెంబర్ 26) సూపర్-4 మ్యాచ్ లు ముగియనున్నాయి. ఇండియా, శ్రీలంక మధ్య నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ టోర్నీలో ఓటమి లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. చివరి మ్యాచ్ లోనూ లంకను చిత్తు చేసి ఫైనల్ కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని చూస్తుంది. మరోవైపు ఇప్పటివరకు సూపర్-4లో ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన శ్రీలంక చివరి మ్యాచ్ లో ఇండియాకు షాక్ ఇవ్వాలని చూస్తుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా దృష్టి పెట్టాల్సిన మూడు విషయాలు ఏంటో ఇప్పడు చూద్దాం.. 

ఫీల్డింగ్ తప్పిదాలు:

ప్రపంచ నెంబర్ వన్ టీ20 జట్టుగా ఆధిపత్యం చూపిస్తున్న టీమిండియా ఫీల్డింగ్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ టోర్నీలో అన్ని జట్లతో పోలిస్తే ఇండియానే ఎక్కువ క్యాచ్ లు మిస్ చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు ఈ ఆసియా కప్ లో భారత జట్టు ఏకంగా 12 క్యాచ్ లు జారవిడిచింది. సూపర్-4 లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ లపై టీమిండియా చెత్త ఫీల్డింగ్ తో అనేక అవకాశాలను చేజార్చుకుంది. ఫైనల్లో ఇండియాను ఓడించడానికి పాక్ ఎదురు చూపులు చూస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీలంలకపై నేడు జరగనున్న మ్యాచ్ లో ఫీల్డింగ్ మెరుగు పర్చుకోవాల్సి ఉంది.

సూర్య ఫామ్ పై ఆందోళన:

టీమిండియా వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్నా సూర్య ఫామ్ ఆందోళనకు గురి చేస్తుంది. కెప్టెన్సీ చేప్పట్టిన దగ్గర నుంచి సూర్య పేలవ ఫామ్ లో ఉన్నాడు. ఎప్పుడో ఒకటి రెండు ఇన్నింగ్స్ ల్లో మెరుస్తున్నా తనలోని పూర్తి స్థాయి ఆటను బయట పెట్టడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఆదివారం (సెప్టెంబర్ 28) పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ కు ముందు నేడు శ్రీలంకతో సూర్య ఫామ్ లోకి రావడం టీమీడియాకు చాలా కీలకం. ఒక్కసారి సూర్య ఫామ్ లోకి వస్తే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడగలడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాలు వద్దు:

ఈ టోర్నీలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో పిచ్చి ప్రయోగాలు చేస్తుంది. లీగ్ మ్యాచ్ దగ్గర నుంచి సూపర్-4 మ్యాచ్ ల వరకు బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ పై జరిగిన సూపర్-4 మ్యాచ్ లో మూడో స్థానంలో అనూహ్యంగా దూబేను పంపారు. కానీ దూబే 2 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ కంటే ముందుగా హార్దిక్ పాండ్య బ్యాటింగ్ కు రావడం మరో షాకింగ్. హార్దిక్ పర్వాలేదనిపించగా.. తిలక్ విఫలమయ్యాడు. ఏడో స్థానంలో అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కు పంపారు. అయితే మన జట్టులో ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ ఉన్నాడనే సంగతే టీమిండియా యాజమాన్యం మర్చిపోయినట్టున్నారు.

ఐదో స్థానంలో బ్యాటింగ్ కు రావాల్సిన సంజు శాంసన్ 5 వికెట్లు పడినా 7 స్థానంలో కూడా బ్యాటింగ్ కు రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు శాంసన్ ను జట్టులో ఎందుకు ఉంచారో అర్ధం కాలేదు. పోనీ శాంసన్ కంటే ముందొచ్చిన ఆకాశర్ పటేల్ ఏమైనా  బ్యాటింగ్ ఆడాడా అంటే అది కూడా లేదు. 15 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. అక్షర్ ఇన్నింగ్స్ లో ఒక్క బౌండరీ కూడా లేదు. మొత్తానికి కీలక మ్యాచ్ లో అనవసర ప్రయోగాలతో టీమిండియా బ్యాటింగ్ లో రాణించలేకపోయింది. నేడు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాలు చేయకుండా ఉంటే సరిపోతుంది.