V6 News

బరిలోకి దిగే ఆ 11 మంది ఎవరు?

బరిలోకి దిగే ఆ 11 మంది ఎవరు?
  • ఓపెనర్లు, కీపర్‌‌, థర్డ్​ పేసర్‌‌పై వీడని సస్పెన్స్‌‌
  • గురువారం నుంచి ఇండియా, ఆస్ట్రేలియా ఫస్ట్‌‌ టెస్ట్‌‌

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్‌‌ సమరం మరో రెండు రోజుల్లో మొదలుకానుంది. పింక్‌‌ బాల్ మ్యాచ్‌‌తో ఈ మెగా సిరీస్‌‌ షురూ అవుతుంది. విరాట్‌‌సేన ఫారిన్​లో ఆడే తొలి  డే అండ్‌‌ నైట్‌‌ మ్యాచ్‌‌ ఇదే అవ్వడం విశేషం. పైగా ప్రత్యర్థి ఆసీస్‌‌ కావడంతో ఈ పింక్‌‌ బాల్‌‌ సమరం 2020కే  బిగ్‌‌ మ్యాచ్‌‌గా నిలవనుందనే  అంచనాలున్నాయి.  అలాంటి హైఓల్టేజ్‌‌ పోరుకు సమయం దగ్గరపడుతున్నా.. తుది జట్టు ఎంపిక విషయంలో ఇండియా మేనేజ్‌‌మెంట్‌‌ను ఇంకా పలు చిక్కు ప్రశ్నలు వేధిస్తున్నాయి.  ప్రతీ బెర్తు కోసం ప్లేయర్ల మధ్య పోటీ ఉండగా.. అనేక ఆప్షన్లు కెప్టెన్‌‌ కోహ్లీ, కోచ్‌‌ రవిశాస్త్రి ముందున్నాయి. వీళ్లు ఎలాంటి కాంబినేషన్‌‌తో ముందుకెళ్తారు..అడిలైడ్‌‌ డే నైట్‌‌లో బరిలోకి దిగే 11 మంది ఎవరన్న దానిపై  ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

(వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌)

బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీని డిఫెండ్‌‌ చేసుకోవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా సిసలైన పోరాటానికి సిద్ధమవుతోంది. నాలుగు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య గురువారం తొలి టెస్ట్‌‌ ప్రారంభం కానుంది. అడిలైడ్‌‌ వేదికగా ఫ్లడ్‌‌లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్‌‌లో జరగనుంది. పింక్‌‌ బాల్‌‌ టెస్ట్‌‌కు డ్రెస్‌‌ రిహార్సల్‌‌గా సిడ్నీలో ఆస్ట్రేలియా–ఎతో  జరిగిన  వామప్‌‌ మ్యాచ్‌‌ను ఇండియా  డ్రా చేసుకుంది.  తొలి టెస్టు ప్రారంభానికి ఇంకా రెండ్రోజులే ఉండగా, తుది జట్టు ఎంపికపై ఇండియా మేనేజ్‌‌మెంట్‌‌ ఇంకా కన్ఫ్యూజన్‌‌లోనే ఉంది. వన్‌‌డౌన్‌‌లో వచ్చే చతేశ్వర్‌‌ పుజారాతో పాటు  మిడిలార్డర్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ, అజింక్య రహానె, హనుమ విహారి, పేసర్లు మహ్మద్‌‌ షమీ, జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా బరిలోకి దిగడం ఖాయం. ఇక, మిగిలిన ఐదు స్థానాలను ఎవరితో భర్తీ చేయాలనేది తేల్చాల్సి ఉంది.  ఓపెనింగ్‌‌ కాంబినేషన్‌‌, మూడో పేసర్‌‌, వికెట్‌‌కీపర్‌‌ ప్లేస్‌‌పై అందరి దృష్టి ఉంది.  ప్రతీ పొజిషన్‌‌ కోసం మేనేజ్‌‌మెంట్‌‌ ముందు పలు ఆప్షన్స్‌‌ ఉన్నాయి. అయితే, రేసులో ఉన్న  ఏ ఒక్కరిని తక్కువ చేయడానికి వీల్లేకపోవడం మేనేజ్‌‌మెంట్‌‌కు ఇబ్బందిగా మారింది. దీంతో తుది జట్టు కూర్పు విషయంలో మేనేజ్‌‌మెంట్‌‌, కోచ్‌‌, కెప్టెన్‌‌  ఆచితూచి అడుగు వేయాల్సి ఉంది.

ఓపెనర్లపైనే బెంగ..

గత సిరీస్‌‌ల ప్రకారం మయాంక్‌‌ అగర్వాల్‌‌, పృథ్వీ షా ప్రస్తుతానికి ఇండియా ఓపెనర్లు. అయితే, న్యూజిలాండ్‌‌లో జరిగిన సిరీస్‌‌లో మయాంక్‌‌–పృథ్వీ జోడీ అట్టర్‌‌ఫ్లాప్‌‌ అయ్యింది. దాంతో, కాంబినేషన్‌‌ మార్పు అనివార్యమే అనిపిస్తోంది. ఎక్స్‌‌ పీరియన్స్‌‌తో పాటు ఫామ్‌‌ దృష్ట్యా మయాంక్‌‌ ఓ ఓపెనర్‌‌గా రావడం ఖాయమే. మరో స్లాట్‌‌ కోసం పృథ్వీ షాకు శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ నుంచి గట్టిపోటీ ఉంది. గిల్‌‌ తుది జట్టులో వస్తే టెస్టుల్లో అతను ఇండియాకు అరంగేట్రం చేయనున్నాడు. పైగా ఆసీస్‌‌లో జరిగిన రెండు వామప్‌‌ మ్యాచ్‌‌ల్లో  మయాంక్‌‌తో పాటు  గిల్‌‌ మంచి మార్కులే కొట్టేశాడు. పైగా, పింక్‌‌ వామప్‌‌లో మయాంక్‌‌–గిల్‌‌ జోడీ కీలక పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ కూడా బిల్డ్‌‌ చేసింది. అదే టైమ్‌‌లో నాలుగు ఇన్నింగ్స్‌‌లో బరిలోకి దిగిన పృథ్వీ మాత్రం ఒక్కసారి మాత్రమే మెప్పించాడు. దీంతో అతను బెంచ్‌‌కు పరిమితం అయ్యే చాన్స్‌‌లు ఎక్కువగా ఉన్నాయి. మరో పక్క వికెట్‌‌కీపర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌తో ఓపెనింగ్‌‌ చేయించే అవకాశాన్ని కూడా మేనేజ్‌‌మెంట్‌‌పరిశీలిస్తోంది.  ఫస్ట్‌‌ టెస్ట్‌‌ తర్వాత విరాట్‌‌ కోహ్లీ స్వదేశానికి  వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో మిగిలిన సిరీస్‌‌ను దృష్టిలో పెట్టుకుని పింక్‌‌బాల్‌‌ మ్యాచ్‌‌లో రాహుల్‌‌ను ఆడించే చాన్సుంది.  అదే జరిగితే అతను ఓపెనర్‌‌గా బరిలోకి దిగవచ్చు. అప్పుడు పృథ్వీ, గిల్‌‌ ఇద్దరూ బెంచ్‌‌కే పరిమితం అవుతారు.

రెండు ప్లేస్‌‌లు ఎవరికి..

పేసర్లు బుమ్రా, షమీ ఫైనల్‌‌ ఎలెవెన్‌‌లో ఉండటంఖాయమవ్వగా.. బౌలింగ్‌‌ కోటాలో ఇంకా రెండు ప్లేస్‌‌లు ఉన్నాయి. ఇందులో ఒకటి స్పిన్నర్‌‌కు మరొకటి పేసర్‌‌కు దక్కే చాన్స్‌‌ ఉంది. స్పిన్‌‌ కోటాలో రవిచంద్రన్‌‌ అశ్విన్‌‌ ఫేవరెట్‌‌గా ఉన్నాడు. ఆసియా అవతల ఇండియా ఆడిన గత మూడు టెస్ట్‌‌ సిరీస్‌‌ల్లో అశ్విన్‌‌కు అవకాశమిచ్చారు. బ్యాట్స్‌‌మన్‌‌గా కూడా రాణిస్తుండటం అశ్విన్‌‌కు అడ్వాంటేజ్‌‌. అయితే, అసలు స్పిన్నరే లేకుండా ఇండియా బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు.  రికార్డుల ప్రకారం ఆస్ట్రేలియాలో జరిగిన డే అండ్‌‌ నైట్‌‌ టెస్టుల్లో స్పిన్నర్లు సగటున ప్రతి 49 రన్స్‌‌కు ఒక వికెట్‌‌ సాధిస్తున్నారు. కానీ ఆసీస్‌‌ ప్రధాన స్పిన్నర్‌‌ లైయన్ యావరేజ్‌‌ మాత్రం 25గా ఉంది. అందువల్ల స్పిన్నర్‌‌ లేకుండా బరిలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పైగా, అడిలైడ్‌‌లో గ్రీన్‌‌ వికెట్‌‌ ఉంది. కానీ స్పిన్నర్‌‌ను కొనసాగిస్తే.. గాయం వల్ల జడేజా రేస్‌‌ నుంచి తప్పుకోగా..  అశ్విన్‌‌కు కుల్దీప్‌‌ యాదవ్‌‌ నుంచి పోటీ ఉంది. గత ఆసీస్‌‌ టూర్‌‌లో అదరగొట్టడం, పింక్‌‌ బాల్‌‌తో ఎక్కువ ఎక్స్‌‌పీరియన్స్‌‌ కుల్దీప్‌‌కు కలిసొచ్చే అంశం. ఇక, పేసర్ల విషయానికొస్తే ఇషాంత్‌‌ శర్మ లేకపోవడంతో ఓ స్థానం ఖాళీ అయ్యింది. ఈ ప్లేస్‌‌ కోసం ముగ్గురు పోటీలో ఉండగా సీనియర్‌‌ ఉమేశ్‌‌ యాదవ్‌‌ రేసులో ముందున్నాడు.  అనుభవంతోపాటు ఫస్ట్‌‌ వామప్‌‌ మ్యాచ్‌‌లో రాణించడం ఉమేశ్‌‌కు కలిసొచ్చే అంశాలు. కానీ, నవదీప్‌‌ సైనీ, మహ్మద్‌‌ సిరాజ్‌‌ నుంచి ఈ సీనియర్‌‌కు పోటీ ఉంది. టెస్టు అరంగేట్రం కోసం చూస్తున్న వీరిద్దరూ ఇటీవల మంచి పెర్ఫామెన్స్‌‌లు చేశారు. అందువల్ల మేనేజ్‌‌మెంట్‌‌ ఎవరికి చాన్స్‌‌ ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇక, నలుగురు పేసర్లతో దిగినా.. కొత్త పేసర్​తో ఆసీస్​కు చెక్​ పెట్టాలని ప్లాన్​ వేసినా.. సైనీ, సిరాజ్‌‌లో ఒకరు అరంగేట్రం చేయడం ఖాయం.

సాహాపంత్‌‌

వికెట్‌‌ కీపర్‌‌ బెర్త్ కోసం సీనియర్‌‌ వృద్ధిమాన్‌‌ సాహా, యంగ్‌‌స్టర్‌‌ రిషబ్‌‌పంత్‌‌ మధ్య పోటీ ఉం ది.  కొన్నాళ్లుగా ఫారిన్​ టూర్లలో మేనేజ్‌‌మెంట్‌‌ పంత్‌‌ను కీపర్‌‌గా తీసుకుంటోంది. స్వదేశంలో మాత్రం సాహాకే ఓటేస్తోంది.  ఇంగ్లండ్‌‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌ టూర్లలో పంత్‌‌కే బాధ్యతలు అప్పజెప్పారు.  అయితే, అంచనాలు అందుకోవడంలో విఫలమవుతు న్నప్పటికీ  పాత పద్ధతి కొనసాగితే అడిలైడ్‌‌లో పంత్‌‌ బరిలోకి దిగడం ఖాయం. కానీ మేనేజ్‌‌మెంట్‌‌ ఇటీవల పెర్ఫామెన్స్‌‌లను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం సాహాకే చాన్స్‌‌ ఉంటుంది. ఆస్ట్రేలియా–ఎతో తొలి వామప్‌‌ మ్యాచ్‌‌లో సాహా హాఫ్‌‌ సెంచరీ చేశాడు. కానీ, ఆదివారం ముగిసిన పింక్‌‌బాల్ వామప్‌‌ మ్యాచ్‌‌లో పంత్‌‌ మెరుపు సెంచరీ బాదాడు. రన్స్ పరంగా పంత్‌‌ ఎక్కువ స్కోర్‌‌ చేసినా సాహా ఇన్నింగ్స్‌‌ మాస్టర్‌‌ క్లాస్‌‌ అనే చెప్పొచ్చు. ఇండియా 143/9తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో యువ ప్లేయర్‌‌ కార్తీక్‌‌ త్యాగి అండతో సాహా విలువైన ఇన్నింగ్స్‌‌ ఆడాడు. ప్యాటిన్సన్‌‌, నెసర్‌‌, కామెరూన్‌‌ గ్రీన్‌‌ వంటి టాప్‌‌ బౌలర్లను ఎదుర్కొని హాఫ్‌‌ సెంచరీ చేయడంతోపాటు జట్టును ఓటమి నుంచి తప్పించాడు. ఇక, సెకండ్​ వామప్‌‌లో పంత్‌‌ తన మార్కు టీ20 స్టయిల్లో ఎలాంటి టెన్షన్‌‌ లేకుండా ఆడాడు. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, మయాంక్‌‌, హనుమ విహారి తమ బ్యాటింగ్‌‌తో  బలమైన పునాది వేసిన తర్వాత అతను చెలరేగాడు. మైకేల్‌‌ స్వెప్సన్‌‌, నిక్‌‌ మాడిసన్‌‌ వంటి స్పిన్నర్లును పంత్‌‌ ఎక్కువగా ఫేస్‌‌ చేశాడు. పైగా, ఆస్ట్రేలియా–ఎ బౌలర్లు ఓ దశలో పోరాటాన్ని వదిలేశారు. మరోపక్క మిడిలార్డర్‌‌ స్థానాలు ఫిక్స్‌‌ అయిపోవడంతో వికెట్‌‌ కీపర్‌‌ ఎవరైనా సరే ఏడో స్థానంలో బ్యాటింగ్‌‌ చేయాల్సి ఉంటుంది. అంటే బౌలర్లతో కలిసి ఇన్నింగ్స్‌‌ నిర్మించాలి. ఇందులో పంత్​ను నమ్మే పరిస్థితి లేదు.  ఈ నేపథ్యంలో మేనేజ్‌‌మెంట్‌‌ సాహా అనుభవానికి ఓటేసే చాన్స్‌‌ కనిపిస్తోంది. ఫస్ట్‌‌ టెస్ట్‌‌లో సాహా ప్లేస్‌‌ దక్కించుకున్నప్పటికీ ఫెయిలైతే మాత్రం మిగిలిన సిరీస్‌‌లో పంత్‌‌కు లైన్‌‌ క్లియర్​ అవుతుంది. మరి మేనేజ్‌‌మెంట్‌‌ ఎవరికి ఓటేస్తుందో చూడాలి.