సెమీ ఫైనల్ కి దూసుకెళ్లిన టీమిండియా

సెమీ ఫైనల్ కి దూసుకెళ్లిన టీమిండియా
  • 28 రన్స్ తేడాతో బంగ్లా పై గెలుపు
  • ‘హిట్​మ్యాన్’​ నాల్గవ సెంచరీ
  • రాణించిన రాహుల్, రిషబ్

ప్రపంచకప్​లో అజేయంగా దూసుకెళ్లిన టీమిండియా.. అనూహ్యంగా ఓడినా.. తొందరగానే తేరుకుంది..!  ఇతర సమీకరణాలతో అవసరం లేకుండా సెమీస్ బెర్త్​ను ఖాయం చేసుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్​లో విరాట్​సేన సూపర్​హిట్‌ అయ్యింది. అక్కడక్కడ బలహీనతలు వెంటాడినా.. ‘హిట్​మ్యాన్’​ రోహిత్​ శర్మ (92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో  104) బంగ్లా బౌలర్లకు సెంచరీ షో చూపెట్టాడు. రికార్డుల మోత మోగిస్తూ.. ఇండియాను నాకౌట్​లో నిలబెట్టాడు. మరోవైపు  సంచలనాన్ని నమ్ముకున్న బంగ్లా టైగర్లు కాసేపు ఆశలు రేకెత్తించినా.. ఫలితం దక్కకపోవడంతో సెమీస్ బెర్త్​కు దూరమయ్యారు.

బర్మింగ్​హామ్:  వరల్డ్​కప్​లో టీమిండియా సెమీస్​ బెర్త్​ను ఖాయం చేసుకోగా, బంగ్లాదేశ్​ ఇంటిముఖం పట్టింది. ఈ రెండు జట్ల మధ్య మంగళవారం జరిగిన కీలక పోరులో విరాట్​సేన 28 రన్స్ తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. ముందుగా ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. రోహిత్​తో పాటు రాహుల్​ (92 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్​తో 77), రిషబ్​ పంత్​ (41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 48) రాణించారు. తర్వాత బంగ్లా 48 ఓవర్లలో 286 రన్స్​కే ఆలౌటై ఓడింది. షకీబల్​ (74 బంతుల్లో 6 ఫోర్లతో 66), సైఫుద్దీన్​ (51 నాటౌట్)  ఫర్వాలేదనిపించారు. రోహిత్​కు ‘మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​’ లభించింది. ​

ఇద్దరు మాత్రమే..

భారీ టార్గెట్​ను ఛేజ్​ చేసే క్రమంలో బంగ్లాకు సరైన ఆరంభం దక్కలేదు. తమీమ్ (22) తక్కువ స్కోరుకే ఔట్ కాగా, సౌమ్య (33), షకీబల్ బాగా పోరాడారు. 39 రన్స్​కే తొలి వికెట్​కోల్పోయిన బంగ్లా తొలి 10 ఓవర్లలో 40/1 స్కోరు చేసింది. ఈ ఇద్దరు భారీ షాట్లకు పోకుండా మెల్లగా ఆడుతూ అవసరమైనప్పుడు ఫోర్లు కొడుతూ రన్​రేట్​ను పెంచే ప్రయత్నం చేశారు. మ్యాచ్​ మధ్యలో చహల్, పాండ్యా (3/60) రన్స్​కట్టడి చేయడంతో ఆందోళనకు గురైన సౌమ్య రెండో వికెట్​కు 35 రన్స్​ జత చేసి వెనుదిరిగాడు. ముష్ఫికర్​ (24) వేగంగా ఆడినా వికెట్​ను కాపాడుకోలేకపోయాడు. 58 బంతుల్లో హాఫ్​ సెంచరీ చేసిన షకీబల్ ఓ ఎండ్​లో స్థిరంగా ఆడినా.. రెండో ఎండ్​లో సహకారం కరువైంది. వరుస విరామాల్లో లిటన్​ దాస్​ (22), మొసాద్దెక్​ (3) ఔట్​కావడంతో షకీబల్​పై ఒత్తిడి పెరిగింది. చివరకు పాండ్యా బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించి ఎక్స్​ట్రా కవర్​లో కార్తీక్​ చేతికి చిక్కాడు. 10 బంతుల్లో రెండు వికెట్లు పడటంతో బంగ్లా 35 ఓవర్లు ముగిసేసరికి 182/6 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. షబ్బీర్​ (36), సైఫుద్దీన్ స్ర్టయిక్​ రొటేట్​ చేస్తూ క్రీజులో కుదురుకున్నారు.  షమీ వేసిన 38వ ఓవర్​లో నాలుగు ఫోర్లు కొట్టిన ఈ ఇద్దరు బాదడం షురూ చేశారు. 5 ఓవర్లలో 47 రన్స్​ రావడంతో బంగ్లాకు చివరి 10 ఓవర్లలో 90 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో బుమ్రా (4/55), భువీ (1/51)…  షబ్బీర్, మోర్తజా (8)ను ఔట్​ చేశాడు. చివరి 18 బంతుల్లో 36 రన్స్​ చేయాల్సిన దశలో బుమ్రా వరుస బంతుల్లో రూబెల్​(9), ముస్తాఫిజుర్​ (0)ను ఔట్ చేసి ఇండియాకు విజయాన్ని అందించాడు.

రోహిట్​..

టాస్​ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ఇండియాకు ఓపెనర్లు బలమైన పునాది వేసినా.. చివర్లో సూపర్​ ఫినిషింగ్​ దక్కలేదు. దీంతో 350 ప్లస్​స్కోరు అనుకున్నా.. ముస్తాఫిజుర్​ (5/59) అద్భుత బౌలింగ్​ ముందు టీమిండియా మిడిల్​, లోయర్​ ఆర్డర్​ చేతులెత్తేసింది. ఫలితంగా బిలోపార్​ స్కోరుకే పరిమితమైంది. బంగ్లాదేశ్​ అంటేనే భయంకరంగా చెలరేగే రోహిత్​ మరోసారి తన ఫామ్​ను చూపెట్టాడు.  9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డీప్​ మిడ్​వికెట్​ వద్ద తమీమ్​ క్యాచ్ జారవిడవడంతో గట్టెక్కిన హిట్​మ్యాన్​.. ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. సైఫుద్దీన్​, ముస్తాఫిజుర్​ బౌలింగ్​లో  కొట్టిన కవర్​డ్రైవ్​, స్ట్రయిట్​ సిక్సర్లు మ్యాచ్​కే హైలెట్​. షకీబల్,  మొసాద్దెక్​ ఓవర్లలో మరో  రెండు సిక్సర్లు సంధించాడు.  రెండో ఎండ్​లో రాహుల్​ కూడా నిలకడ చూపడంతో తొలి 10 ఓవర్లలో  69 రన్స్ చేసిన టీమిండియా 17.2 ఓవర్లలో 100 పరుగులకు చేరింది. రెండు ఎండ్​ల నుంచి ఈ ఇద్దరు దంచికొట్టడంతో ఓ దశలో  బంగ్లా బౌలర్లు చేష్టలుడిగిపోయారు.  ఈ క్రమంలో  రాహుల్​ 57 బంతుల్లో హాఫ్​ సెంచరీ చేస్తే, రోహిత్​90 బంతుల్లో  కెరీర్​లో 26వ సెంచరీ బాదేశాడు. ఇక డబుల్​ సెంచరీ చర్చ మొదలైన తరుణంలో 30వ ఓవర్​లో సౌమ్య గట్టి షాకిచ్చాడు. గుడ్​ లెంగ్త్​తో సంధించిన ఆఫ్​కట్టర్​ రోహిత్​ బ్యాట్ ను తాకుతూ లిటన్ దాస్​ చేతుల్లోకి వెళ్లింది. తొలి వికెట్​180 రన్స్​ జోడించిన ఈ ముంబైకర్ ఇండియాను పటిష్ట స్థితిలో నిలిపి వెనుదిరిగాడు.

తడబ్యాట్ ..

180/1 స్కోరు వద్ద వచ్చిన విరాట్ (26) ఫామ్ కొనసాగించలేకపోయాడు. 20 ఓవర్ల మ్యాచ్ మిగిలిఉండటంతో భారీ స్కోరు చేస్తాడనుకున్నా.. బంగ్లా బౌలర్ల క్రమశిక్షణ ముందు నిలువలేకపోయాడు. దీంతోఈ టోర్నీలో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలకు బ్రేక్ పడింది. అప్పటివరకు మెరుగ్గా ఆడిన రాహుల్ కూడా20 బంతుల తర్వాత వికెట్ సమర్పించుకున్నాడు. విరాట్ తో జతకలిసిన రిషబ్ పవర్ హిట్టింగ్ షాట్లతోరెచ్చిపోయినా.. 39వ ఓవర్ లో ముస్ తాఫిజుర్ డబుల్ ఝలక్ ఇచ్చాడు. మూడు బంతుల తేడాలో కోహ్లీ,పాండ్యా (0)ను ఔట్ చేసి భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశాడు. రిషబ్ , కోహ్లీ మూడో వికెట్ కు 42రన్స్ జత చేశారు.

ఒకే ఒక్కడు షకీబ్‌‌

మెగా టోర్నీలో బంగ్లాదేశ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ షకీబల్‌‌ హసన్‌‌ హవా నడుస్తోంది. అటు బ్యాటుతో ఇటు బంతితో చెలరేగి ఆడుతున్న షకీబ్‌‌  వరల్డ్‌‌కప్‌‌లో 500 ప్లస్‌‌ రన్స్‌‌ చేసి, పది పైచిలుకు వికెట్లు పడగొట్టిన తొలి క్రికెటర్‌‌గా రికార్డు సృష్టించాడు.  ఏడు ఇన్నింగ్స్‌‌లో 542 రన్స్‌‌ చేసిన బంగ్లా స్టార్‌‌ బ్యాటింగ్‌‌ లిస్ట్‌‌లో రోహిత్‌‌ శర్మ (544) తర్వాత సెకండ్‌‌ ప్లేస్‌‌లో ఉన్నాడు.  అతని ఖాతాలో 11 వికెట్లు ఉన్నాయి.

ఒకే జట్టులో నలుగురు కీపర్లు

ఈ మ్యాచ్‌‌లో ఇండియా ఏకంగా నలుగురు కీపర్లతో బరిలోకి దిగింది. మాజీ కెప్టెన్‌‌ ధోనీ, రిషబ్‌‌ పంత్‌‌, దినేశ్‌‌ కార్తీక్‌‌తో పాటు లోకేశ్‌‌ రాహుల్‌‌ కూడా వికెట్‌‌ కీపర్‌‌ బ్యాట్స్‌‌మనే.  కార్తీక్‌‌ మినహా  ముగ్గురు బ్యాటింగ్‌‌లో సత్తా చాటడం విశేషం. ఇక, బంగ్లా ఇన్నింగ్స్‌‌ ఆరంభంలో పంత్‌‌ కొద్దిసేపు కీపింగ్‌‌ కూడా చేశాడు. అదే టైమ్‌‌లో షమీ వేసిన 12వ ఓవర్లో సౌమ్య సర్కార్‌‌ ఎల్బీ కోసం ఇండియా డీఆర్‌‌ఎస్‌‌ కోరి ఫెయిలైంది. అప్పుడు ధోనీ మైదానంలో కూడా లేడు. కానీ, కొద్దిసేపటికే మహీ ఫీల్డ్‌‌లోకి వచ్చి కీపింగ్‌‌ బాధ్యతలు తీసుకున్నాడు.

బామ్మ అభిమానానికి ఫిదా

ఈ  మ్యాచ్‌‌కు హాజరైన టీమిండియా అభిమాని, 87 ఏళ్ల చారులత పటేల్‌‌ అందరి దృష్టిని ఆకర్షించారు. వయోభారంతో నడవలేకపోతున్నా కూడా చక్రాల కుర్చీలో కూర్చొని మరీ స్టేడియానికి వచ్చింది. జాతీయ జెండాను ఊపుతూ, వూవుజెలా ఊదుతూ ఉత్సాహంగా కనిపించింది. బౌండ్రీ కొట్టినప్పుడు, వికెట్‌‌ పడ్డప్పుడు చిన్నపిల్లలా కేరింతలు కొట్టింది. స్టాండ్స్‌‌లో ఉన్న మిగతా ఫ్యాన్స్‌‌తో  హుషారుగా స్టెప్పులు కూడా వేసింది. ఆమెతో  ఫొటోలు దిగేందుకు మిగతా వారు పోటీ పడ్డారు. మ్యాచ్‌‌ ముగిసిన తర్వాత కెప్టెన్‌‌ కోహ్లీ, రోహిత్‌‌ శర్మ ఈ బామ్మ దగ్గరకు వచ్చి అప్యాయంగా పలకరించడం విశేషం. 1983లో ఇండియా తొలి వరల్డ్‌‌కప్‌‌ నెగ్గినప్పుడు కూడా తాను టోర్నీకి హాజరయ్యానని చారులత చెప్పారు. ఇండియా ఈసారి కచ్చితంగా వరల్డ్‌‌కప్‌‌  గెలుస్తుందన్నారు. జట్టు విజయం కోసం తాను వినాయకుడిని వేడుకుంటానని చెప్పారు.

ధోనీ.. అదే తీరు..

పాండ్యా ఔట్​తో క్రీజులోకి వచ్చిన ధోనీ (35) మళ్లీ స్లో బ్యాటింగ్​తో నిరాశపర్చాడు. ఇన్నింగ్స్​ చివరి ఓవర్​ వరకు ఉన్నా.. తన సూపర్​ ఫినిషింగ్​ సత్తాను చూపెట్టలేకపోయాడు. 40 ఓవర్​లో వరుసగా మూడు ఫోర్లు బాదిన  పంత్​.. నాలుగు ఓవర్ల తర్వాత ఔటయ్యాడు. దీంతో ఐదో వికెట్40 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత ముస్తాఫిజుర్​ ప్రతి బంతికి వేరియేషన్​ రాబడుతూ 11 బంతుల తేడాలో  4 వికెట్లు తీసి మ్యాచ్​ను మలుపు తిప్పాడు. కార్తీక్​ (8) నిరాశపర్చగా, చివరి ఓవర్​లో తొలి రెండు బంతులకు సింగిల్స్​ నిరాకరించిన ధోనీ.. మూడో బాల్​ను గాలిలోకి లేపాడు. వైడ్​గా వేసిన ఆరో బంతికి భువనేశ్వర్​ (2) రనౌట్​కాగా, ఆఖరి బాల్​కు షమీ (1) బౌల్డ్​ అయ్యాడు. దీంతో చివరి 10 ఓవర్లలో కేవలం 63 రన్స్​ మాత్రమే వచ్చాయి.

ఎన్నాళ్లో వేచిన వరల్డ్‌‌కప్‌‌

వరల్డ్‌‌కప్‌‌లో ఆడాలన్న టీమిండియా సీనియర్‌‌ క్రికెటర్‌‌ దినేశ్‌‌ కార్తీక్‌‌ కల ఎట్టకేలకు నెరవేరింది. వన్డే అరంగేట్రం చేసిన 15 ఏళ్ల తర్వాత అతను ప్రపంచకప్‌‌ మ్యాచ్‌‌లో బరిలోకి దిగాడు. 2007 వరల్డ్‌‌కప్‌‌లో కూడా కార్తీక్‌‌ టీమ్‌‌లో ఉన్నా అతనికి మ్యాచ్‌‌ ఆడే చాన్స్‌‌ రాలేదు. బ్యాకప్‌‌ కీపర్‌‌గా తాజా టోర్నీకి ఎంపికైన వెటరన్‌‌ ప్లేయర్‌‌ తొలి ఏడు మ్యాచ్‌‌ల్లో బెంచ్‌‌కు పరిమితం అయ్యాడు. చివరకు ఈ మ్యాచ్‌‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఎన్నాళ్లో వేచిన సమయం రానే వచ్చినా.. సింగిల్‌‌ డిజిట్‌‌కే ఔటై తీవ్రంగా నిరాశ పరిచాడు.

స్కోర్​బోర్డు

ఇండియా: రాహుల్​ (సి) ముష్ఫికర్​ (బి) రూబెల్ 77, రోహిత్​ (సి) లిటన్​ దాస్​ (బి) సౌమ్య 104, కోహ్లీ (సి) రూబెల్​ (బి) ముస్తాఫిజుర్​ 26, రిషబ్​ (సి) మొసాద్దెక్​ (బి) షకీబల్​ 48, హార్దిక్​ (సి) సౌమ్య (బి) ముస్తాఫిజుర్​ 0, ధోనీ (సి) షకీబల్​ (బి) ముస్తాఫిజుర్​ 35, కార్తీక్​ (సి) మొసాద్దెక్​ (బి) ముస్తాఫిజుర్ 8, భువనేశ్వర్​ రనౌట్​ 2, షమీ (బి) ముస్తాఫిజుర్​ 1, బుమ్రా (నాటౌట్​) 0, ఎక్స్​ట్రాలు: 13, మొత్తం: 50 ఓవర్లలో 314/9.

వికెట్లపతనం: 1‌‌–180, 2–195, 3–237, 4–237, 5–277, 6–298, 7–311, 8–314, 9–314.

బౌలింగ్​: మోర్తజా 5–0–36–0, సైఫుద్దీన్​7–0–59–0, ముస్తాఫిజుర్​ 10–1–59–5, షకీబల్​ 10–0–41–1, మొసాద్దెక్​ 4–0–32–0, రూబెల్​ 8–0–48–1, సౌమ్య సర్కార్​ 6–0–33–1.

బంగ్లాదేశ్: తమీమ్​ (బి) షమీ 22, సౌమ్య (సి) కోహ్లీ (బి) పాండ్యా 33, షకీబల్​ (సి) కార్తీక్​ (బి) పాండ్యా 66, ముష్ఫికర్​ (సి) షమీ (బి) చహల్​ 24, లిటన్​ దాస్​ (సి) కార్తీక్​ (బి) పాండ్యా 22, మొసాద్దెక్​ (బి) బుమ్రా 3, షబ్బీర్ (బి) బుమ్రా 36, సైఫుద్దీన్ (నాటౌట్) 51, మోర్తజా (సి) ధోనీ (బి) భువనేశ్వర్​ 8, రూబెల్​(బి) బుమ్రా 9, ముస్తాఫిజుర్ (బి) బుమ్రా 0, ఎక్స్​ట్రాలు: 12, మొత్తం: 48 ఓవర్లలో 286 ఆలౌట్.

వికెట్లపతనం: 1–39, 2‌‌–74, 3–121, 4–162, 5–173, 6–179, 7–245, 8–257, 9–286, 10–286. బౌలింగ్: భువనేశ్వర్ 9–0–51–1​, బుమ్రా 10–1–55–4, షమీ 9–0–68–1, చహల్​10–0–50–1, పాండ్యా 10–0–60–3.