థామస్ కప్ లో తొలిసారి ఫైనల్ కు ఇండియా

థామస్ కప్ లో తొలిసారి ఫైనల్ కు ఇండియా

బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  ఇండియా మెన్స్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌ టీమ్‌‌‌‌ అద్భుతం చేసింది. ప్రతిష్టాత్మక థామస్‌‌‌‌ కప్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో పెద్దగా అంచనాలే లేకుండా బరిలోకి దిగి మరో సంచలనం సృష్టించింది.  తెలుగు షట్లర్లు కిడాంబి శ్రీకాంత్‌‌‌‌, సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌తో పాటు సీనియర్‌‌‌‌ ప్లేయర్​ హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రణయ్‌‌‌‌ అసాధారణ పోరాటం చూపిన వేళ టోర్నీలో తొలిసారి ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది. సెమీస్‌‌‌‌ చేరడంతోనే చరిత్ర సృష్టించిన శ్రీకాంత్‌‌‌‌ నేతృత్వంలోని జట్టు ఇప్పుడు సిల్వర్‌‌‌‌ ఖాయం చేసుకోవడంతో పాటు గోల్డెన్‌‌‌‌ హిస్టరీ క్రియేట్‌‌‌‌ చేసేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఇండియా 3–2తో వరల్డ్‌‌‌‌ టాప్‌‌‌‌ ప్లేయర్లతో కూడిన 2016 ఎడిషన్‌‌‌‌ విన్నర్‌‌‌‌ డెన్మార్క్‌‌‌‌పై విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో  14 సార్లు విజేత ఇండోనేసియాతో పోటీ పడనుంది.  మరో సెమీస్‌‌‌‌లో ఇండోనేసియా  3–2తో జపాన్‌‌‌‌ను ఓడించి 21వ సారి ఫైనల్‌‌‌‌ చేరింది. 

ఔరా ప్రణయ్​..

సెమీస్‌‌‌‌ కూడా క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌నే  తలపించింది. ఆ పోరు మాదిరిగానే  ఆఖరి మ్యాచ్​లో హెచ్​ ప్రణయ్​ సూపర్​ పెర్ఫామెన్స్​తో టీమ్​ను గెలిపించాడు.  తొలి సింగిల్స్‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌ 13–21, 13–21తో  వరల్డ్‌‌‌‌ నం.1 విక్టర్‌‌‌‌ అక్సెల్సెన్‌‌‌‌ చేతిలో ఓడిపోయినా.. డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ జంట 21–18, 21–23, 22–20తో అస్ట్రుప్‌‌‌‌–మథియస్‌‌‌‌పై ఉత్కంఠ విజయం సాధించి స్కోరు సమం చేసింది. ఆపై, రెండో సింగిల్స్‌‌‌‌లో శ్రీకాంత్‌‌‌‌ 21–18, 12–21, 21–15తో మూడో ర్యాంకర్‌‌‌‌ ఆండ్రెస్‌‌‌‌ ఆంటోన్సెన్‌‌‌‌పై అద్భుత విజయంతో ఇండియాను 2–1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.  కానీ, రెండో డబుల్స్‌‌‌‌లో కృష్ణ ప్రసాద్‌‌‌‌–విష్ణువర్దన్‌‌‌‌ 14–21, 13–21తో స్కారుప్‌‌‌‌–సొగార్డ్‌‌‌‌ చేతిలో ఓడింది. దాంతో స్కోరు 2–2తో మరోసారి సమమైంది. విజేతను తేల్చేందుకు చివరిదైన మూడో సింగిల్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌పై ఉత్కంఠ రేగింది. ఇందులో తన అనుభవాన్ని రంగరించి ఆడిన ప్రణయ్‌‌‌‌ 13–21, 21–9, 21–12తో 13వ ర్యాంకర్‌‌‌‌ రాస్మస్‌‌‌‌ గెమ్కేను ఓడించాడు. తొలి గేమ్‌‌‌‌ కోల్పోయిన ప్రణయ్‌‌‌‌ రెండో గేమ్​లో తనదైన శైలిలో పుంజుకున్నాడు. ఓ షాట్‌‌‌‌ను రిటర్న్‌‌‌‌ చేస్తూ జారిపడి చీలమండకు గాయమైనా పోరాటం వదల్లేదు. నొప్పితో బాధపడుతున్నప్పటికీ తన షాట్లలో పవర్‌‌‌‌ చూపెడుతూ  వరుసగా ఏడు పాయింట్లతో  11–1తో లీడ్‌‌‌‌ సాధించాడు. అదే జోరుతో గేమ్‌‌‌‌ గెలిచి మ్యాచ్‌‌‌‌లో నిలిచాడు.  మూడో గేమ్‌‌‌‌లోనూ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గిన తను బ్రేక్‌‌‌‌ టైమ్‌‌‌‌కు 11–4తో నిలిచాడు. తర్వాత రాస్మస్‌‌‌‌ పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసినా.. ప్రణయ్‌‌‌‌ పదునైన స్మాష్‌‌‌‌తో 20–11తో తొమ్మిది మ్యాచ్‌‌‌‌ పాయింట్లపై నిలిచాడు. రెండో గేమ్‌‌‌‌ పాయింట్‌‌‌‌లో మ్యాచ్​ నెగ్గడంతో ఇండియా ప్లేయర్ల సంబరాలు షురూ అయ్యాయి.