సీఈసీ రాజీనామా చేయాల్సిందే!..ఇండియా కూటమి ఆధ్వర్యంలో చలో లోక్ భవన్

సీఈసీ రాజీనామా చేయాల్సిందే!..ఇండియా కూటమి ఆధ్వర్యంలో చలో లోక్  భవన్
  •     నెక్లెస్ రోడ్​ నుంచి “సేవ్ డెమోక్రసీ ” ర్యాలీ

హైదరాబాద్, వెలుగు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు గురువారం హైదరాబాద్‌‌‌‌లో ‘చలో లోక్ భవన్’ చేపట్టారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో లోక్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. లోక్ భవన్ వద్ద బారికేడ్లు దాటి లోపలికి వెళ్లేందుకు నేతలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం, తోపులాట జరగగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, పలువురు మంత్రులు, పీసీసీ నేతలను పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించారు. 

దీంతో నేతలు స్టేషన్​లోనే ఆందోళన కొనసాగించి సీఈసీ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా.. లోక్‌‌‌‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్​గాంధీ పోరాటానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ర్యాలీలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సమాజ్‌‌‌‌వాది పార్టీకి చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహమ్మద్ అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పీసీసీ నేతలు పాల్గొన్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తదితరులు ర్యాలీలో ఉన్నారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ సీఈసీ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా నినాదాలు చేశారు. 

బారికేడ్ల వద్ద ఉద్రిక్తత

లోక్ భవన్ వద్ద పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని దాటి లోపలికి వెళ్లేందుకు మహేశ్ గౌడ్, సచిన్ సావంత్, పలువురు మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మహేశ్ గౌడ్‌‌‌‌తో పాటు పలువురు మంత్రులు, పీసీసీ నేతలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌‌‌‌లోనూ నేతలు ఆందోళన కొనసాగించారు. మోదీకి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీకి అనుకూలంగా నినాదాలు చేశారు. సాయంత్రం వారందరినీ సొంత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు. ర్యాలీ కారణంగా ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముందు జాగ్రత్తగా నెక్లెస్ రోడ్డు నుంచి లోక్ భవన్ వరకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.

ఓటుహక్కును కాపాడాలి: పొన్నం

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌‌‌‌పై ఉందన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలా కేంద్ర ప్రభుత్వం, ఈసీ పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడం అక్రమం, అప్రజాస్వామికమని ఖండించారు.

దొడ్డిదారిన గెలిచే కుట్ర: జూపల్లి

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన ఎన్నికల్లో గెలిచేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కాలరాసేందుకు కుట్రలు చేస్తున్నదన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండేలా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కోరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న రాహుల్, ప్రియాంక గాంధీలపై ఢిల్లీ పోలీసులు, కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని విమర్శించారు. 

మోదీది ఫాసిస్టు పాలన: మహేశ్ గౌడ్
అంతకుముందు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ప్రధాని మోదీ ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నారని, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించి బీజేపీకి లబ్ధి చేకూర్చే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఓట్ల తొలగింపు రాజ్యాంగానికి విఘాతం కలిగించే ప్రక్రియ అని అన్నారు. 

ఓట్ల తొలగింపుతోనే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోయిందని ఆరోపించారు. ఫామ్-7 ద్వారా తెలంగాణలో కోటి ఓట్లు తొలగించే కుట్ర జరుగుతున్నదన్నారు. జ్ఞానేశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని విమర్శించారు. ఇంతటి వ్యతిరేకత ఎదురవుతున్నా జ్ఞానేశ్ కుమార్ పదవిలో కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ మాట్లాడుతూ.. ఓట్ చోరీపై రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేస్తున్న పోరాటానికి ప్రజల మద్దతు లభించిందన్నారు. తెలంగాణ సమాజం కూడా ఆయన పోరాటానికి పూర్తి అండగా నిలిచిందని చెప్పారు. ఓట్ చోరీతో మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు.