మోడీ సర్కార్ పై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం 

మోడీ సర్కార్ పై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం 

న్యూయార్క్: కేంద్ర ప్రభుత్వం 2017లోనే ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ వో గ్రూపు నుంచి పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని శుక్రవారం న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనం వెలువరించింది. దేశవ్యాప్తంగా ప్రముఖ పొలిటీషియన్లు, జర్నలిస్టులు, యాక్టివిస్టుల ఫోన్​లపై పెగాసస్ స్పైవేర్ తో కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందంటూ నిరుడు ఇంటర్నేషనల్ కన్సార్షియం ప్రకటించడంతో పెను దుమారం రేగింది. పెగాసస్​తో నిఘా విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించగా, దీనిపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు ముగ్గురు నిపుణులతో ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనంతో మళ్లీ దుమారం రేగింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు కూడా అబద్ధం చెప్పిందంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. న్యూయార్క్ టైమ్స్ కథనంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని పీటీఐ వెల్లడించింది. అయితే.. ఆ కథనం నిరాధారమని కేంద్రంలోని ఉన్నతస్థాయి వర్గాలు చెప్పాయంటూ పలు మీడియా సంస్థలు తెలిపాయి. 

రూ. 15 వేల కోట్ల డీల్ లో భాగంగా.. 
ప్రధాని నరేంద్ర మోడీ 2017 జులైలో ఇజ్రాయెల్ లో పర్యటించిన సందర్భంగా రూ. 15 వేల కోట్ల విలువైన డిఫెన్స్ డీల్ కుదిరిందని, ఇందులో ఒక మిసైల్ సిస్టం, పెగాసస్ స్పైవేర్ కూడా ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఏడాదిపాటు తాము జరిపిన ఇన్వెస్టిగేషన్​లో ఆధారాలు దొరికాయని తెలిపింది. పెగాసస్​​ను ఎఫ్​బీఐ కూడా కొన్నప్పటికీ, దాని వాడకాన్ని మాత్రం నిలిపివేసినట్లు పేర్కొంది. 

మోడీ సర్కార్ ది దేశద్రోహం: రాహుల్ గాంధీ 
ఇండియా పెగాసస్​ను కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించడంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మోడీ సర్కారు అక్రమంగా పౌరులు, ప్రజాస్వామ్య సంస్థలు, పొలిటీషియన్లపై నిఘా పెట్టిందని, ఇది దేశద్రోహమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.