పేటీఎంకు ఎర్త్ పెట్టిన ఇండియా-చైనా గొడవ

పేటీఎంకు ఎర్త్ పెట్టిన ఇండియా-చైనా గొడవ

వాటా అమ్మాలనుకుంటున్న యాంట్ గ్రూప్

ఇండియన్ టెక్ స్టార్టప్‌‌లలో దండీగా పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతోన్న చైనీస్ కంపెనీలు వెనక్కి వెళ్లడం ప్రారంభమైంది. పేటీఎంకు అతిపెద్ద ఇన్వెస్టర్లలో ఒకరైన జాక్‌‌మా యాంట్ గ్రూప్ తన వాటాను అమ్మాలనుకుంటోంది. సరిహద్దులో నెలకొన్న గొడవలతో చైనీస్ కంపెనీలకు ఇండియా గట్టిగానే షాకిస్తోంది. పెట్టుబడులపై కఠినమైన ఆంక్షలు తెస్తోంది. దీంతో చైనీస్ టెక్ కంపెనీలు వెనక్కి తగ్గుతున్నాయి. యాంట్‌‌తో పాటు మరెన్ని కంపెనీలు ఇండియా నుంచి తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటాయో చూడాల్సి ఉందని ఎక్స్‌‌పర్ట్స్ అంటున్నారు.

న్యూఢిల్లీ : గల్వాన్ సరిహద్దుల్లో ఇండియా–చైనాకు మధ్య నెలకొన్న ప్రతికూల పరిస్థితులు పేటీఎంకు ఎసరు పెట్టాయి. పేటీఎంకు చెందిన అతిపెద్ద ఇన్వెస్టర్లలో ఒకరైన చైనీస్ ఫిన్‌‌టెక్ కంపెనీ యాంట్ గ్రూప్ తన 30 శాతం వాటాను అమ్మాలని చూస్తున్నట్టు తాజా రిపోర్ట్‌‌లు చెప్పాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో దేశ సమగ్రతకు భంగం కలిగించే పలు చైనా యాప్స్‌‌ను ఇప్పటికే ఇండియా బ్యాన్ చేసింది. చైనా నుంచి వచ్చే ఇన్వెస్ట్‌‌మెంట్లపై కూడా ఆంక్షలు విధించింది. పేటీఎంలో ఉన్న వాటాను యాంట్ గ్రూప్ ఎంత మొత్తానికి అమ్ముతుందో ఫైనాన్షియల్ వివరాలు బయటికి రాలేదు. ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎలాంటి సేల్ ప్రాసెస్‌‌ను యాంట్ గ్రూప్ ప్రారంభించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సాఫ్ట్‌‌బ్యాంక్ గ్రూప్, ఇతర సంస్థలు పేటీఎంకు ఫండింగ్ అందిస్తున్నాయి. పేటీఎం వాల్యు కిందటేడాది ప్రైవేట్ ఫండ్ రైజింగ్ అప్పుడు 16 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ వాల్యుయేషన్‌‌ ప్రకారం పేటీఎంలో యాంట్ వాటా విలువ 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే వాటాల అమ్మకంపై వస్తోన్న వార్తలను యాంట్ గ్రూప్, పేటీఎం ఖండిస్తున్నాయి. తమ మేజర్ షేర్‌‌‌‌హోల్డర్స్ ఎవరూ వాటాల అమ్మకం గురించి చర్చలు జరపలేదని పేటీఎం అధికార ప్రతినిధి చెప్పారు. వాటాల అమ్మకంపై ఎలాంటి ప్లాన్స్ లేవన్నారు. ఒకవేళ పేటీఎం నుంచి యాంట్ గ్రూప్ ఎగ్జిట్ అయితే.. ఇది ఈ చైనీస్ కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బ కానుంది. గత నెలలోనే స్టాక్ మార్కెట్‌‌లో లిస్ట్ కావాలనుకున్న యాంట్ గ్రూప్‌‌ ప్లాన్స్ పట్టాలెక్కలేదు. యాంట్ గ్రూప్ షేర్లు స్టాక్ మార్కెట్‌‌లో లిస్ట్ కాకుండా షాంఘై, హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలు నిషేధం విధించాయి.

షేర్లు లిస్ట్‌ అయ్యుంటే 3,700  కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా యాంట్ గ్రూప్ నిలిచేది. విదేశీ ఈ–వాలెట్ సంస్థలకు ఇస్తోన్న ఫైనాన్షియల్ సపోర్ట్‌‌ను యాంట్ గ్రూప్ చాలా వరకు వెనక్కి తీసుకుంటోంది. యాంట్ గ్రూప్ పేటీఎంలో వాటాలు అమ్మేందుకు ప్రధాన కారణం ఇండియా, చైనాల మధ్య గత కొన్ని నెలలుగా నెలకొన్న టెన్షన్లేనని ఈ విషయం తెలిసిన ఒకరు చెప్పారు. అంతేకాక కంపెనీలో వాటాను పెంచుకునేందుకు కూడా యాంట్ మేనేజ్‌‌మెంట్ సిద్ధంగా లేదని పేర్కొన్నారు.

ఇండియన్ స్టార్టప్‌‌లకు చైనీస్ పెట్టుబడి..

ఇండియన్ స్టార్టప్‌‌లకు ఎక్కువగా చైనీస్ ఇన్వెస్టర్లు అలీబాబా, టెన్సెంట్ వంటివి ఫండింగ్ ఇస్తున్నాయి. అలీబాబా ఇప్పటి వరకు ఇండియాలో 4 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. 2021 కల్లా 5 బిలియన్ డాలర్ల వరకు తన ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ను పెంచాలనుకుంది. కానీ ఇండియా, చైనాల మధ్య నెలకొన్న టెన్షన్లతో ఈ ప్లాన్స్‌‌ను హోల్డ్‌‌లో పెట్టింది. యాంట్ గ్రూప్ 2015లో పేటీఎంలో తొలిసారి ఇన్వెస్ట్ చేసింది. పేరెంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ ద్వారా పేటీఎంలో 30 శాతం వాటాను యాంట్ గ్రూప్ దక్కించుకుంది. యాంట్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ప్రాస్పెక్టస్‌‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. చైనీస్ కంపెనీల నుంచి వస్తోన్న ఇన్వెస్ట్‌‌మెంట్లకు ఇండియాలో రూల్స్ చాలా కఠినంగా మార్చడంతో… యాంట్ మెల్లమెల్లగా తన ఆధిపత్యాన్ని కోల్పోతుంది.