ఇవాళ ( జులై 24 ) దేశవ్యాప్తంగా నిరసనలు.. విద్యార్థులు, మద్దతుదారులకు సీజేపీ పిలుపు..

ఇవాళ ( జులై 24 ) దేశవ్యాప్తంగా నిరసనలు.. విద్యార్థులు, మద్దతుదారులకు సీజేపీ పిలుపు..
  • నడ్డా ఇల్లు, ఆఫీసులో చర్చలకు నో.. తటస్థ వేదికపైనే చర్చలకు సిద్ధమని ప్రకటన  
  • సీజేపీకి బాలీవుడ్ స్టార్‌‌‌‌‌‌‌‌ల మద్దతు 
  • జంతర్‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌లో రాళ్లదాడి బీజేపీ పనే: దీప్కే 

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా శుక్రవారం నిరసనలు తెలపాలని విద్యార్థులు, మద్దతుదారులకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. ప్రతి జిల్లాలోనూ శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించాలని కోరింది. పేపర్ లీకులపై చర్యలకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన ప్రకటన బాధ్యత వహించేలా లేదని..  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ ప్రధాన డిమాండ్‌‌‌‌ను కూడా పరిష్కరించలేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. అలాగే, మరో దఫా చర్చల కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను సీజేపీ తిరస్కరించింది. 

కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆఫీస్‌‌‌‌ లేదా ఆయన నివాసంలో కాకుండా జంతర్ మంతర్‌‌‌‌లో లేదా తటస్థ వేదికపై మాత్రమే తాము చర్చలకు వస్తామని సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్‌‌‌‌ దాస్‌‌‌‌ స్పష్టం చేశారు. గురువారం జంతర్ మంతర్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న తమ వద్దకే మంత్రులు రావాలని డిమాండ్‌‌‌‌ చేశారు. భద్రతా కారణాల వల్ల జంతర్ మంతర్‌‌‌‌లో సమావేశం సాధ్యం కాకపోతే సమీపంలోని ఏదైనా వేదికను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

నిరసనల్లో పాల్గొన్న వారిపై కేసులు పెట్టబోమని, ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న సీజేపీ కార్యకర్తలకు పలువురు బాలీవుడ్ స్టార్‌‌‌‌‌‌‌‌లు సంఘీభావం తెలిపారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌‌‌‌ ఘటనను ఖండించారు. బాలీవుడ్ స్టార్‌‌‌‌‌‌‌‌లు సల్మాన్ ఖాన్, అలియా భట్, కరీనా కపూర్, కమల్ హాసన్, నసీరుద్దీన్ షా సహా అనేకమంది విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. 

పలువురు నటులు విద్యార్థులతో కలిసి రోడ్డెక్కారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నటి షబానా అజ్మీ, హుమా ఖురేషి మద్దతు తెలిపారు. దిల్జీత్ దొసాంజ్, విజయ్ సేతుపతి, టొవినో థామస్, హాలీవుడ్ నటుడు జాన్ కుసాక్ సహా పలువురు నటులు సోషల్ మీడియాలో మద్దతు తెలిపారు. 

నిరసనను దారి మళ్లించేందుకు కుట్ర.. 

జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఆందోళనకారులపై రాళ్లు రువ్వి, వారి ప్రతిష్టను దిగజార్చేందుకు బయటి వ్యక్తులను రంగంలోకి దించుతోందని మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు.‘‘నెల రోజులుగా ప్రశాంతంగా నిరసన తెలుపుతున్నాం. ఇంతవరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. 

విద్యార్థుల ఆందోళనకు ప్రజా మద్దతు పెరుగుతుండటంతో తట్టుకోలేక, జనాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ గూండాలను పంపుతోంది’’ అని విమర్శించారు. పోలీసులు రాళ్ల లారీలను ఇక్కడికి తీసుకొస్తుంటే, బీజేపీ గూండాలు ఆ రాళ్లను రువ్వి సీజేపీకి చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఆందోళకారులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్ చాలా దారుణంగా, క్రూరంగా ఉంది. ఆ పోలీసులను కోర్టుకు ఈడుస్తాం’’  అని హెచ్చరించారు. తాము చేపట్టిన నిరసన 34వ రోజుకు, విద్యావేత్త సోనమ్ వాంగ్‌‌‌‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 26వ రోజుకు చేరుకుందని దీప్కే తెలిపారు. వాంగ్‌‌‌‌చుక్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు.

జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌లో ఇంటర్నెట్ బంద్

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ చుట్టూ 1.5 కిలోమీటర్ల పరిధిలో పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను (అన్ని టెక్నాలజీలు) తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర హోం శాఖ గురువారం ఆదేశించింది. ఈ ఆంక్షలు సాయంత్రం 4:00 గంటల నుంచి రాత్రి 12:00 గంటల వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రజా భద్రత, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలకు ప్రేరేపించే చర్యలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.