బర్మింగ్ హామ్‌‌లో బ్రహ్మాండ విజయం.. 336 రన్స్‌‌ తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ

బర్మింగ్ హామ్‌‌లో బ్రహ్మాండ విజయం.. 336 రన్స్‌‌ తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ
  • ఆకాశ్ దీప్‌సూపర్ బౌలింగ్‌‌
  • రన్స్ పరంగా విదేశాల్లో అతి పెద్ద విజయం
  • ఎడ్జ్‌‌బాస్టన్‌‌ గ్రౌండ్‌‌లో తొలి విక్టరీ సొంతం
  • రెండో టెస్టులో ఇంగ్లండ్‌‌ చిత్తు 
  • ప్లేయర్‌‌ ఆఫ్​ ద మ్యాచ్‌గా గిల్‌

బర్మింగ్‌‌హామ్‌‌:  తొలి టెస్టులో ఓటమికి భారీ ప్రతీకారం తీర్చుకుంటూ ఇంగ్లండ్ గడ్డపై  టీమిండియా చరిత్ర సృష్టించింది. 58 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత బర్మింగ్‌‌హామ్‌‌లోని ఎడ్జ్‌‌బాస్టన్ గ్రౌండ్‌‌లో తొలి విజయం సాధించింది. విదేశీ గడ్డపై టెస్టుల్లో రన్స్ పరంగా అతి పెద్ద విజయం సొంతం చేసుకొని ఔరా అనిపించింది. కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్ అత్యద్భుత బ్యాటింగ్‌‌కు తోడు ఆకాశ్ దీప్ (10/187) రెండు ఇన్నింగ్స్‌‌ల్లో కలిపి పది వికెట్లతో కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో విజృంభించడంతో ఐదో రోజు, ఆదివారం ముగిసిన రెండో టెస్టులో 336 రన్స్‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌పై అఖండ విజయం అందుకుంది. 

కెప్టెన్‌‌గా గిల్‌‌ విజయాల ఖాతా తెరిచాడు. ఇండియా ఇచ్చిన 608 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌‌లో ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 72/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లిష్ టీమ్ 68.1  ఓవర్లలో 271 కే కుప్పకూలి చిత్తుగా ఓడింది.  దాంతో ఇండియా ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 1–1తో సమం చేసింది. భారీ ఛేజింగ్‌‌లో జేమీ స్మిత్ (88) ఒక్కడే ప్రతిఘటించాడు. తొలి ఇన్నింగ్స్‌‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఆకాశ్‌‌ దీప్ (6/99) ఈసారి ఆరు వికెట్లు తీసి హీరో అయ్యాడు. సిరాజ్, ప్రసిధ్‌‌, జడేజా, సుందర్ తలో వికెట్‌‌ తీశారు. కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్‌‌కు ప్లేయర్‌‌‌‌ ఆఫ్​ ద మ్యాచ్అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు లార్డ్స్‌‌ గ్రౌండ్‌‌లో గురువారం 
మొదలవుతుంది. 

ఆకాశ్ అదుర్స్‌‌

ఉదయం వర్షం కారణంగా ఆట గంటా 40 నిమిషాలు ఆలస్యమైంది. దాంతో ఇంగ్లండ్‌‌ను ఆలౌట్ చేయడానికి ఇండియాకు 80 ఓవర్లు మాత్రమే మిగిలాయి. ఆట లేటైనా.. పేసర్ ఆకాష్ దీప్ అద్భుత  బౌలింగ్‌‌తో హోమ్‌‌టీమ్‌‌ను దెబ్బకొట్టిన ఇండియా రెండు సెషన్లలో స్టోక్స్‌‌సేన పని పట్టింది. ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి  బౌలింగ్ ప్రారంభించిన ఆకాశ్‌‌ ఫస్ట్ సెషన్‌‌లో పదునైన బాల్స్‌‌ వేశాడు. బాల్‌‌ను అద్భుతంగా  సీమ్ చేశాడు. తన ఏడో బాల్‌‌కే  ఓవర్‌‌‌‌నైట్ బ్యాటర్ ఒలీ పోన్‌‌ (24)ను ఔట్‌‌ చేసి బ్రేక్ ఇచ్చాడు.  అనూహ్యంగా బౌన్స్ అయిన బాల్‌‌ను పోప్ డిఫెండ్ చేయబోగా అది ఎడ్జ్ తీసుకొని నేలకు తగిలి స్టంప్స్‌‌ను తాకింది.  

తన తర్వాతి ఓవర్లోనే  డేంజర్‌‌ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (23)ను ఎల్బీ చేసిన ఆకాశ్‌‌ ఇంగ్లండ్ నడ్డివిరిచాడు. దాంతో ఇంగ్లిష్ టీమ్ 83/5తో నిలిచి తొందర్లోనే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ టైమ్‌‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌‌ (33), జేమీ స్మిత్ ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. తొలి గంట తర్వాత బౌలింగ్‌‌కు వచ్చిన జడేజా బాల్‌‌ను టర్న్‌‌ చేస్తూ ఈ ఇద్దరికీ విసిరాడు. తొలి టెస్టుకు భిన్నంగా తన డెలివరీల వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు. అయితే, క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత కెప్టెన్ స్టోక్స్ ఎదురుదాడి మొదలు పెట్టాడు. సిరాజ్ బౌలింగ్‌‌లో పుల్,  ఎక్స్‌‌ట్రా కవర్ డ్రైవ్‌‌తో సహా నాలుగు బౌండరీలు కొట్టాడు. 

జడేజా బౌలింగ్‌‌లో స్వీప్ చేస్తూ రన్స్ రాబట్టాడు. కానీ, లంచ్‌‌కు ముందు సుందర్.. స్టోక్స్‌‌ను ఎల్బీ చేయడంతో 153/6తో ఇంగ్లండ్ కష్టాలు మరింత పెరిగాయి. స్టోక్స్‌‌, స్మిత్ ఆరో వికెట్‌‌కు 70 రన్స్ జోడించారు. అప్పటికే క్రీజులో కుదురుకున్న స్మిత్ బ్రేక్ తర్వాత  క్రిస్ వోక్స్‌‌ (7)తో కలిసి పోరాటం కొనసాగించాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత సుందర్ బౌలింగ్‌‌లో 6, 4, 6తో మరింత స్పీడు పెంచాడు. అయితే, మళ్లీ బౌలింగ్‌‌కు వచ్చిన ప్రసిధ్‌‌.. వేసిన షార్ట్‌‌ బాల్‌‌కు సిరాజ్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చిన వోక్స్‌‌ ఏడో వికెట్‌‌గా వెనుదిరిగాడు. అయినా వెనక్కుతగ్గని స్మిత్.. ఆకాశ్‌‌ బౌలింగ్‌‌లో వరుసగా రెండు షార్ట్ బాల్స్‌‌ను స్టాండ్స్‌‌కు చేర్చాడు. 

ఆకాశ్ వేగం తగ్గించి వేసిన  మరో షార్ట్ బాల్‌కు స్మిత్ బ్యాక్‌‌వర్డ్ స్క్వేర్ లెగ్‌‌లో సుందర్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు.  కొద్దిసేపటికే  జడ్డూ బౌలింగ్‌‌లో మిడ్‌‌ వికెట్‌‌లో సిరాజ్ డైవింగ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌‌ క్యాచ్‌‌కు జోష్ టంగ్ (2) తొమ్మిదో వికెట్‌‌గా  పెవిలియన్‌‌ చేరాడు.  దాంతో ఇంగ్లండ్‌‌ ఓటమి ఖాయం అవ్వగా.. చివరి బ్యాటర్‌‌‌‌గా వచ్చిన షోయబ్ బషీర్‌‌‌‌ (12 నాటౌట్‌‌), బ్రైడన్ కార్స్ (38) గుడ్డిగా షాట్లు కొట్టారు. చివరకు ఆకాశ్ బౌలింగ్‌‌లో షాట్‌‌కు ప్రయత్నించిన కార్స్.. కెప్టెన్‌‌ గిల్‌‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇండియా విజయ సంబరాలు మొదలయ్యాయి.  

 సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌: 587 ఆలౌట్‌‌;  ఇంగ్లండ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌: 407 ఆలౌట్‌‌; ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌:  427/6 డిక్లేర్డ్‌‌ ; ఇంగ్లండ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌ (టార్గెట్‌‌ 608): 68.1 ఓవర్లలో 271 ఆలౌట్‌‌ (జేమీ స్మిత్‌‌ 88, కార్స్ 38, ఆకాశ్ దీప్‌ 6/99).

తొలి ఆసియా జట్టుగా..

బర్మింగ్‌‌హామ్‌‌లో 58 ఏండ్లుగా ఆడుతున్న ఇండియాకు ఇదే తొలి గెలుపు. ఈ వేదికపై తొలిసారి టెస్టు మ్యాచ్‌‌ గెలిచిన ఆసియా జట్టుగానూ టీమిండియా రికార్డు సృష్టించింది. ఈ గ్రౌండ్‌‌లో ఇండియా ఇది వరకు ఆడిన 8  మ్యాచ్‌‌ల్లో ఏడింటిలో ఓడి, ఒకదాన్ని డ్రా చేసుకుంది. ఎట్టకేలకు తొమ్మిదో టెస్టులో విజయం అందుకుంది. పాకిస్తాన్ 8 టెస్టులు, శ్రీలంక 2 మ్యాచ్‌‌లు ఆడి ఒక్కటి కూడా గెలవలేకపోయాయి.

1ఈ మ్యాచ్‌‌లో ఇంగ్లండ్‌‌పై 336 రన్స్‌‌ తేడాతో గెలిచిన ఇండియాకు  విదేశీ గడ్డపై ఇదే అతి పెద్ద టెస్టు విజయం. 2016లో అంటిగ్వా టెస్టులో వెస్టిండీస్‌‌పై 318 రన్స్ తేడాతో గెలిచిన రికార్డు బ్రేక్ అయింది. 

10/187  ఈ మ్యాచ్‌‌లో ఆకాశ్​ దీప్ పెర్ఫామెన్స్‌‌ ఇంగ్లండ్ గడ్డపై ఇండియా బౌలర్‌‌‌‌కు బెస్ట్‌‌. 1986లో ఇదే బర్మింగ్‌‌హామ్‌‌లో చేతన్ శర్మ 10/188తో నెలకొల్పిన రికార్డును బ్రేక్‌‌ చేశాడు. ఒక టెస్టు మ్యాచ్‌‌లో ఆకాశ్ పది వికెట్లు తీయడం కూడా ఇదే తొలిసారి.

1692 నాలుగు ఇన్నింగ్స్‌‌ల్లో కలిపి ఈ మ్యాచ్‌‌లో వచ్చిన మొత్తం రన్స్‌‌. ఇండియా–ఇంగ్లండ్ మధ్య ఓ టెస్టు మ్యాచ్‌‌లో అత్యధికం. ఇరు జట్ల మధ్య తొలి టెస్టులో నమోదైన 1673 రన్స్ రికార్డు బ్రేక్ అయింది.