గ్వాంగ్‌డాంగ్ (చైనా): వరల్డ్ టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో ఇండియా జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా 3–1 ఫ్రేమ్‌ల తేడాతో హాంకాంగ్ చైనాపై గెలిచింది.
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ల్లో స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ 74–1తో చెంగ్ కా వాయ్‌పై గెలవగా, ఆదిత్య మెహతా 67–9తో వాంగ్ యు చెన్‌ను ఓడించాడు. డబుల్స్‌లో అద్వానీ–మెహతా జోడీ 59–68తో యుచెన్–వాన్ నాన్సెన్ సిన్ చేతిలో ఓడారు. కానీ నాలుగో ఫ్రేమ్‌లో పంకజ్ చెలరేగిపోయాడు.
74 పాయింట్ల క్లీన్ బ్రేక్‌తో ఈ ఫ్రేమ్‌ను 88–0తో ముగించి ఇండియాకు ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేశాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో ఇండియా 3–2తో చైనా–బి జట్టును ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఏడేళ్ల క్రితం మయన్మార్‌లో జరిగిన టోర్నీలో ఇండియా చాంపియన్‌గా నిలిచింది.
