దేశంలో ఏనుగుల స్థితి.. సంరక్షణ కారిడార్ల పరిస్థితి

దేశంలో ఏనుగుల స్థితి.. సంరక్షణ కారిడార్ల పరిస్థితి

భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక ఆసియా ఏనుగుల జనాభా ఉన్నది. ఏనుగును భారతదేశ జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించారు. ఏనుగులు, వాటి ఆవాసాలు, వాటి కారిడార్లను రక్షించడం కోసం భారత ప్రభుత్వం 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పేరిట కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు ఏనుగుల జనాభాను రక్షించడం, మానవ– ఏనుగుల మధ్య సంఘర్షణలను తగ్గించడం, పెంపుడు ఏనుగుల సంక్షేమాన్ని పర్యవేక్షించడం.

ఏనుగుల జనాభా

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వశాఖ ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 30,711 ఏనుగులు ఉన్నాయి. దేశంలో అత్యధిక ఏనుగులు ఉన్న రాష్ట్రాలు వరుసగా కర్ణాటక(6,395), అసోం(5,828), కేరళ(3,054). 

ఎలిఫెంట్ రిజర్వులు 

ఎలిఫెంట్ రిజర్వులు అనేవి భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్షిత ప్రాంతాలు. ఇవి ఏనుగుల సంరక్షణకు, వాటి ఆవాసాల పరిరక్షణకు, వాటి సురక్షితమైన కదలికకు తోడ్పడతాయి. దేశంలో 33 ఎలిఫెంట్ రిజర్వులు ఉన్నాయి.   

ముఖ్యమైన కొన్ని రిజర్వులు 

మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్ (కర్ణాటక):  దేశంలోనే అతిపెద్ద ఏనుగుల రిజర్వ్. 
పెరియార్ ఎలిఫెంట్ రిజర్వ్ (కేరళ): ఇది పెరియార్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్నది. 
నీలగిరి ఎలిఫెంట్ రిజర్వ్ (తమిళనాడు): ఇక్కడ ఏనుగుల జనాభా చాలా ఎక్కువ. 
మయూర్ భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్ (ఒడిశా): ఇది పెద్ద ఏనుగుల సమూహాలకు నిలయం. 
కామెంగ్ ఎలిఫెంట్ రిజర్వ్ (అరుణాచల్​ప్రదేశ్): ఈశాన్య భారతదేశంలో ముఖ్యమైన రిజర్వ్. 

ఏనుగుల కారిడార్లు 

ఏనుగుల కారిడార్లు అంటే ఏనుగులు ఒక అటవీ ప్రాంతం నుంచి మరో అటవీ ప్రాంతానికి వెళ్లడానికి ఉపయోగించే సంప్రదాయ మార్గాలు. ఇవి జీవవైవిధ్యాన్ని కాపాడటానికి, ఏనుగుల జనాభా ఆరోగ్యాన్ని, వాటి జన్యువైవిధ్యాన్ని నిలబెట్టడానికి చాలా ముఖ్యమైనవి. 

ఏనుగుల కారిడార్ల ప్రాముఖ్యత

మానవ–ఏనుగుల సంఘర్షణ తగ్గింపు: కారిడార్లు సురక్షితంగా ఉన్నప్పుడు ఏనుగులు మానవ ఆవాసాల్లోకి రాకుండా, పంట పొలాలను ధ్వంసం చేయకుండా నివారించవచ్చు. 

జనాభా ఆరోగ్యం: ఏనుగులు ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్లడం వల్ల వాటి మధ్య జన్యువైవిధ్యం పెరుగుతుంది. ఇది వాటి మనుగడకు కీలకం. 

ప్రయాణ మార్గం: ఆహారం, నీరు లభించే ప్రాంతాల కోసం ఏనుగులు చేసే వలసలకు ఈ కారిడార్లు దారులుగా పనిచేస్తాయి.

దేశంలో ఏనుగుల కారిడార్ల పరిస్థితి

దేశంలో మొత్తం 150కిపైగా ఏనుగుల కారిడార్లు గుర్తించారు. ఈ కారిడార్లలో చాలావరకు మానవ ఆవాసాలు, రైల్వేలైన్లు, రహదారుల నిర్మాణాల వల్ల ముప్పు ఎదుర్కొంటున్నాయి. వీటిని రక్షించడం, అడ్డు లేకుండా చూసుకోవడం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ముఖ్య లక్ష్యాల్లో ఒకటి. 2023లో ప్రచురించిన రైట్స్ ఆఫ్ పాసెజ్: ఎలిఫెంట్ కారిడార్స్ ఆఫ్ ఇండియా నివేదిక కారిడార్ల ప్రాముఖ్యత, వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంది. 

ఏనుగుల దినోత్సవం 

ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏనుగుల సంరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ వాటికి ఎదురవుతున్న సవాళ్లపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2012లో కెనడాకు చెందిన ఇద్దరు సినీ నిర్మాతలు, థాయిలాండ్ లోని ఎలిఫెంట్ రీ ఇంట్రడక్షన్ ఫౌండేషన్ దీనిని ప్రారంభించాయి. 

ప్రధాన లక్ష్యాలు: ఏనుగుల అక్రమ వేటను అరికట్టడం, వాటి ఆవాసాలను కాపాడటం, మానవ– ఏనుగుల మధ్య సంఘర్షణలను తగ్గించడం, బందీలుగా ఉన్న ఏనుగులకు విముక్తి కల్పించడం. 

థీమ్: 2025 సంవత్సరానికి ప్రపంచ ఏనుగుల దినోత్సవం థీమ్  Matriarchs & Memories (మాతృ ఏనుగులు, జ్ఞాపకాలు).