దేశం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయింది: సూక్ష్మ జీవ శాస్త్రవేత్త శివాజీ సిసింతి మృతిపై సంతాపం

దేశం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయింది: సూక్ష్మ జీవ శాస్త్రవేత్త శివాజీ సిసింతి మృతిపై సంతాపం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రముఖ జీవ శాస్త్రవేత్త, సూక్ష్మజీవ శాస్త్ర నిపుణుడు డాక్టర్ శివాజీ సిసింతి మరణంతో మన దేశం ప్రతిభావంతమైన శాస్త్రవేత్తను కోల్పోయిందని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్​  చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావు సంతాపం వ్యక్తం చేశారు. 

శివాజీ 375 పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించారని, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాలకు శాస్త్రీయ యాత్రల్లో పాల్గొన్న మొదటి భారతీయ జీవ శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందారన్నారు. హిమాలయాలు, భూమి ధృవ ప్రాంతాలు, వాయు మండలంలో ఎత్తైన ప్రాంతాల్లో నివసించే సూక్ష్మజీవ సమూహాలపై పరిశోధనలు చేశారన్నారు.

అక్కడ మాత్రమే కనిపించే మూడు కొత్త బ్యాక్టీరియా సమూహాలను గుర్తించారన్నారు. జీవవిజ్ఞానంలో ఆయన చేసిన కృషికి ఎన్నో అవార్డులు వరించాయన్నారు. 1980లో హైదరాబాద్‌లోని సీసీఎంబీలో మైక్రోబయాలజిస్ట్‌గా చేరారని, ఇండియాలోని ఎల్సెవియర్/స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తల లిస్టులో రెండో స్థానంలో ఉన్న మైక్రోబయాలజిస్టులలో ఆయన ఒకరన్నారు.

సెంట్రల్ ఇండియాలోని అడవి పిల్లులు, ఏనుగులు, పులులు వంటి సంక్షోభంలో ఉన్న జాతులపై కూడా అధ్యయనం చేశారన్నారు. ఎల్వీ ప్రసాద్​హాస్పిటల్స్​లో రీసెర్చ్ ఎమిరిటస్ డైరెక్టర్‌‌గా ఎన్నో పరిశోధనలు చేశారన్నారు.