
- లార్డ్స్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిలైన ఓపెనర్ జైస్వాల్
- నిర్లక్ష్యమైన షాట్లకు ఔటవడంతో యంగ్‌స్టర్‌పై విమర్శల దాడి
- నాలుగో టెస్టులో కీలకం కానున్న యశస్వి ఓపెనింగ్
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)
లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో చేతుల్లోకి వచ్చిన విజయాన్ని టీమిండియా వదులుకుంది. ఫలితంగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1–2తో వెనుకంజతో శుభ్‌మన్ గిల్ సేన ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో బుధవారం మొదలయ్యే నాలుగో టెస్టులో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో నిలిచింది. మూడో టెస్టులో జట్టు ఓటమికి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించకపోవడం.. ఛేజింగ్‌లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడం ప్రధాన కారణాలు. లార్డ్స్‌లో మరో అంశం కూడా టీమిండియాను దెబ్బ కొట్టింది. అదే ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫెయిల్యూర్. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 13, 0 స్కోర్లతో జైస్వాల్ నిరాశపరిచాడు. తన ఫెయిల్యూర్ కంటే ఔటైన విధానమే చర్చనీయాంశమైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఇంగ్లండ్ రీఎంట్రీ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ముఖ్యంగా ఛేజింగ్‌లో నిర్లక్ష్యమైన షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. నాలుగో టెస్టు జట్టుకు అత్యంత కీలకమైన నేపథ్యంలో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో అతని బ్యాటింగ్ స్టయిల్‌లో మార్పులు అనివార్యమని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో బెకెన్‌హామ్ కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన తొలి నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ బౌలింగ్‌ను జైస్వాల్ ఎదుర్కొన్నాడు. దీన్ని బట్టి లార్డ్స్‌లో తనను రెండుసార్లు ఔట్ చేసిన జోఫ్రా ఆర్చర్‌కు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
దంచికొట్టి.. డీలా పడి
వాస్తవానికి అండర్సన్–-టెండూల్కర్ ట్రోఫీ తొలి రెండు మ్యాచ్‌ల్లో జైస్వాల్ సత్తా చాటాడు. లీడ్స్‌లో సెంచరీతో కదం తొక్కిన అతను బర్మింగ్‌హామ్‌లో 87 రన్స్‌తో అద్భుత ఆరంభం అందించాడు. కానీ లార్డ్స్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అతని షాట్ సెలెక్షన్ అందరినీ నిరాశపరిచింది.
జట్టుకు ప్రతి పరుగు
కీలకమైన సమయంలో జైస్వాల్ క్రీజులో నిలవాల్సింది. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ అదే పని చేస్తున్నాడు. కానీ ఆర్చర్ బౌలింగ్‌లో అనవసరంగా పుల్ షాట్ ఆడి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు ఓవర్లో క్రిస్ వోక్స్ ఇబ్బంది పెట్టడంతో అప్సెట్ అయినందువల్ల ఈ ఎటాకింగ్ షాట్ ఆడినట్లు కనిపించింది. కానీ, దీనిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్, కామెంటరీ బాక్సుల్లో మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. జైస్వాల్ చాలా చెత్త షాట్ ఆడి ఔటయ్యాడని ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అన్నాడు. ఇలాంటి చెత్త షాట్ ఆడి జైస్వాల్ వికెట్ కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఔట్ సైడ్ ఆఫ్ -స్టంప్‌బాల్‌తో ఊరించగా.. తను కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో జోష్ టంగ్ బౌలింగ్‌లో డ్రైవ్‌కు ప్రయత్నిస్తూ ఎల్బీ అయ్యాడు.
ఓపిక చూపెడితేనే ఫలితం
ఈ సిరీస్‌లో జైస్వాల్ చేసిన 233 రన్స్‌లో 77 డ్రైవ్స్ ద్వారా.. 51 రన్స్ కట్స్ ద్వారా వచ్చాయి. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 49 బాల్స్‌ను మాత్రమే వదిలేశాడు. బ్యాక్‌ఫుట్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించి రెండుసార్లు, డ్రైవ్ చేయడానికి ట్రై చేసిమరో రెండుసార్లు ఔటయ్యాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉన్నందున జైస్వాల్ వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాల్సిన అవసరం ఉంది. మొదట్లోనే దాడికి దిగకుండా క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ.. మంచి భాగస్వామ్యాలను నిర్మించడంపై దృష్టి పెట్టాలి.
బౌలర్, పిచ్ స్వభావం, మ్యాచ్ పరిస్థితిని బట్టి షాట్లను ఎంపిక చేసుకోవడమే టెస్టు బ్యాటర్ నైపుణ్యాన్ని నిర్థారిస్తుంది. తాను అనుకున్న షాట్లు కనెక్ట్ అవ్వడం లేదన్న నిరాశతో గుడ్డిగా ఎటాక్ చేస్తే లార్డ్స్ లాంటి ఫలితమే వస్తుంది. ఇంగ్లండ్ బౌలర్లు నాలుగో టెస్టులోనూ ఔట్ సైడ్ ఆఫ్ -స్టంప్ బాల్స్‌తో అతడిని పరీక్షించే అవకాశం లేకపోలేదు. కాబట్టి జైస్వాల్ మంచి డిఫెన్సివ్ టెక్నిక్ చూపెడుతూ.. ఓపిగ్గా ఆడటం అలవాటు చేసుకుంటే మరింత సక్సెస్ అవుతాడు. ఏదేమైనా ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జైస్వాల్ బ్యాటింగ్ పెర్ఫామెన్స్ సిరీస్‌లో ఇండియా భవిష్యత్తుకు కీలకం కానుంది.