- ఈ ఏడాది మొదటి 6 నెలల్లో లిస్టింగ్ ఉంటుందని గతంలో ప్రకటన
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఐపీఓపై త్వరలో ఓ క్లారిటీ రానుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ కిందటేడాది ఏజీఎంలో ప్రకటించిన టైమ్‌లైన్ ప్రకారం, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో జియో మార్కెట్‌లో లిస్ట్ కావాల్సి ఉంది.
ఆర్‌ఐఎల్ వార్షిక నివేదికలో దీనిని బలపరుస్తూ, వాటాదారుల భాగస్వామ్యాన్ని మరింత పెంచే వ్యూహాత్మక మార్గాలను వెతుకుతున్నామని అంబానీ పేర్కొన్నారు. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్ (జేపీఎల్) లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అత్యధికంగా 66.43 శాతం వాటా ఉంది.
మిగిలిన వాటాలో 17.71 శాతం మెటా, గూగుల్ దగ్గర ఉంది. జియో వాల్యుయేషన్ దాదాపు 130 బిలియన్ డాలర్ల నుంచి 180 బిలియన్ డాలర్ల (రూ. 12.48 లక్షల కోట్ల నుంచి 17.28 లక్షల కోట్ల) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. కంపెనీ ఐపీఓ సైజ్ రూ.58 వేల కోట్లు ఉండొచ్చు. ఇది భారతదేశంలోనే ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద పబ్లిక్ ఆఫర్‌గా నిలవనుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఫైనాన్షియల్‌గా చూస్తే కూడా జియో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జియో ప్లాట్‌ఫామ్స్ నికరలాభం 15 శాతం వృద్ధితో రూ.30,053 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.26,120 కోట్లుగా ఉంది.
