IND vs ENG 2025: నిలబెట్టిన జడేజా, సుందర్: టీమిండియాకు ఆధిక్యం.. డ్రా దిశగా మాంచెస్టర్ టెస్ట్

IND vs ENG 2025: నిలబెట్టిన జడేజా, సుందర్: టీమిండియాకు ఆధిక్యం.. డ్రా దిశగా మాంచెస్టర్ టెస్ట్

ఇంగ్లాండ్ తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా డ్రా కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఐదో రోజు రెండో సెషన్ లో వాషింగ్ టన్ సుందర్, జడేజా అద్భుత పోరాటంతో ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ రెండో సెషన్ లో దాదాపు 30 ఓవర్ల పాటు ఆడి ఇంగ్లాండ్ కు వికెట్ దక్కకుండా చేశారు. దీంతో చివరి రోజు టీ విరామ సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. జడేజా (53), సుందర్ (58) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో మరో 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ రెండు.. స్టోక్స్, ఆర్చర్ తలో వికెట్ తీసుకున్నారు. 

చివరి సెషన్ లలో ఇండియా 35 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ డ్రా అవుతుంది. మరోవైపు ఇంగ్లాండ్ కు 6 వికెట్లు తీస్తే మ్యాచ్ తో పాటు సిరీస్ గెలుచుకుంటుంది. దీంతో ఐదో రోజు చివరి సెషన్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. జడేజా, సుందర్ తొలి గంట బ్యాటింగ్ చేస్తే ఈ మ్యాచ్ ను టీమిండియా డ్రా చేసుకోవచ్చు. 4 వికెట్ల నష్టానికి 222 పరుగులతో చివరి రోజు రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియా ఈ సెషన్ లో వికెట్ కోల్పోకుండా 100 పరుగులు చేసింది. జడేజా, సుందర్ మరీ డిఫెన్స్ కే పరిమితం కాకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ టీ విరామానికి ముందు తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.  

►ALSO READ | IND vs ENG 2025: డెడికేషన్ అంటే నీదే: ఊతకర్రల సాయంతో స్టేడియానికి చేరుకున్న పంత్

2 వికెట్ల నష్టానికి 174 పరుగులతో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తొలి అరగంట జాగ్రత్తగానే ఆడింది. నాలుగో రోజు మాదిరి ఐదో రోజు కూడా గిల్, రాహుల్ డిఫెన్స్ కే పరిమితమయ్యారు.  70 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ జోడీని ఎట్టకేలకు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ విడగొట్టాడు. రాహుల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ వేసిన ఒక ఇన్ స్వింగ్ డెలివరీ అనూహ్యంగా లోపలికి దూసుకొచ్చింది. దీంతో రాహుల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరగడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. లంచ్ కు ముందు జోఫ్రా ఆర్చర్ సెంచరీ చేసిన గిల్(103) ను ఔట్ చేసి ఇండియాకు షాక్ ఇచ్చాడు.