
హామిల్టన్ లో జరిగిన నాలుగో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని ఫ్లాప్ షో చూపించింది. ఐదు వన్డేల సిరీస్ ను ఇప్పటికే గెల్చుకున్న ఇండియా.. నాలుగోవన్డేలో 8వికెట్ల తేడాతో కివీస్ చేతిలో ఓడిపోయింది. ఈ సిరీస్ లో ఇది లోకల్ జట్టుకు తొలి గెలుపు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజీలాండ్. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ రెస్ట్ తీసుకోవడంతో… రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియా బ్యాటింగ్ కు దిగింది. న్యూజీలాండ్ సీమర్లు ట్రెంట్ అలెగ్జాండర్ బౌల్ట్, గ్రాండ్ హోమ్… భారత టాప్ ఆర్డర్, మిడిలార్డర్ ను కుప్పకూల్చారు. రోహిత్ శర్మ 7, ధావన్ 13, శుభ్ మన్ గిల్ 9, రాయుడు 0, కార్తీక్ 0, కేదార్ జాదవ్ 1, హార్దిక్ పాండ్యా 16, భువనేశ్వర్ 1, కుల్దీప్ యాదవ్ 15, చాహల్ 18*, అహ్మద్ 5 రన్స్ చేశారు. బౌల్ట్ 5 వికెట్లు, గ్రాండ్ హోమ్ 3 వికెట్లు తీసి టీమిండియాను కోలుకోలేని దెబ్బతీశారు. ఆస్టిల్, నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియా 30.5 ఓవర్లలోనే 92 రన్స్ కే ఆలౌట్ అయింది.
93 రన్స్ కొద్ది లక్ష్యాన్ని న్యూజీలాండ్ 14.4 ఓవర్లలో.. 2 వికెట్లు కోల్పోయి ఈజీగా ఛేదించింది. గుప్తిల్ (14), కెప్టెన్ విలియంసన్ (11)ల వికెట్లను భువీ తీశాడు. నికోల్స్ 30, టేలర్ 37 రన్స్ తో కివీస్ కు 8 వికెట్ల తేడాతో భారీ విజయం అందించారు.
ఐదు వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. నాలుగో వన్డే ముగిసేసరికి… భారత్ ఆధిక్యం 3-1కు తగ్గింది. ఫిబ్రవరి 3న వెల్లింగ్టన్ లో ఐదో వన్డే జరగనుంది.