
గ్వాంగ్జూ (సౌత్ కొరియా): వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఇండియా కొత్త చరిత్ర సృష్టించింది. మెన్స్ కాంపౌండ్ టీమ్ తొలిసారి స్వర్ణం సాధించి రికార్డుకెక్కింది. ఇంకోవైపు తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతో కూడిన మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్ రజతం గెలిచింది. రిషభ్ యాదవ్, అమన్ సైనీ, ప్రథమేష్ ఫుగేతో కూడిన ఇండియా ఆదివారం (సెప్టెంబర్ 07) జరిగిన మెన్స్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో 235–233 స్కోరుతో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది.
టైటిల్ ఫైట్‌లో ఫ్రాన్స్ జట్టు నుంచి ఇండియాకు గట్టి పోటీ ఎదురైంది. తొలి రౌండ్‌లో 57–-59తో వెనుకంజ వేసినా పుంజుకున్న ఇండియా ఆర్చర్లు రెండో రౌండ్‌లో వరుసగా ఆరు పర్ఫెక్ట్ 10 పాయింట్లు సాధించి స్కోరును 117–-117తో సమం చేశారు. మూడో రౌండ్‌లోనూ ఇరు జట్లు సమాన పాయింట్లు సాధించడంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ, చివరి రౌండ్‌లో ఫ్రాన్స్ జట్టు ఒత్తిడికి గురై తడబడింది. ఈ అవకాశాన్ని ఇండియన్స్ సద్వినియోగం చేసుకున్నారు.
యంగ్ ఆర్చర్ ప్రథమేష్ తన చివరి బాణాన్ని పర్ఫెక్ట్ 10కి గురిపెట్టి చారిత్రక విజయాన్ని ఖాయం చేశాడు. ఇక, హోరాహోరీగా సాగిన మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో జ్యోతి సురేఖ –రిషభ్ 155–-157తో వరల్డ్ నంబర్ వన్ మైక్ ష్లోసర్– సన్నె డి లాట్‌తో కూడిన నెదర్లాండ్స్ ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది.