భారీ వర్షాలు మహారాష్ట్రను వణికిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రవాహానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో 29 గ్రామాలకు చెందిన 3 వేల మందిని ముందు జాగ్రత్తచర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ జిల్లాలో గోదావరి, కాళేశ్వరం, ఇంద్రావతి నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. పెన్ గంగా, ప్రాణహిత నదులు ప్రమాద స్థాయికి చేరువలో ఉన్నాయని అధికారులు తెలిపారు. పాల్ఘర్ జిల్లాలో వైతర్న నదిలో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడారు. ఇరై డ్యాంలో నీటి మట్టం భారీగా పెరగడంతో.. గేట్లు తెరిచారు అధికారులు. వరద నీటితో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడి నుంచి 9 వందల మందిని వేరే చోటికి తరలించారు. భారీ వర్షాలు కురవడంతో వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.
