మే12న పాక్ తో చర్చలు.. ఏం చేద్దాం..ఎలా చేద్దాం.. మరోసారి మోదీ హైలెవల్ మీటింగ్..

మే12న పాక్ తో చర్చలు..  ఏం చేద్దాం..ఎలా చేద్దాం.. మరోసారి మోదీ హైలెవల్ మీటింగ్..

భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ మరోసారి కీలక సమావేశం అయ్యారు.  మోదీ తన నివాసంలో  రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్,సిడిఎస్ అనిల్ చౌహాన్,  త్రివిధ దళాధిపతులు, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ తో భేటీ అయ్యారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన, ప్రస్తుతం పరిస్థితులపై చర్చిస్తున్నారు. అలాగే మే 12న భారత్, పాకిస్తాన్ సైన్యం జరిపే చర్చలో లేవనెత్తాల్సిన అంశాలపై డిస్కస్ చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ తో పాటు సరిహద్దులో భద్రతపై చర్చిస్తున్నారు. 

మే 10న సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. అయితే పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించి కొన్ని గంటలు కూడా గడవకముందే ఒప్పందానికి తూట్లు పొడిచి మళ్లీ దాడులకు తెగబడింది. పాక్ బలగాలు సాధారణ పౌరులనే టార్గెట్​గా చేసుకుని రాత్రిపూట ఎల్ఓసీ నుంచి పెద్ద ఎత్తున కాల్పులు జరిపాయి. శనివారం సాయంత్రం కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ప్రకటన చేసిన పాక్.. ఆ తర్వాత కొన్ని గంటలకే మళ్లీ కుక్కతోక వంకర అన్నట్టుగా సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతూ, డ్రోన్ దాడులకు పాల్పడింది. దాదాపు మూడు గంటలపాటు జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలపై మళ్లీ కాల్పులు, డ్రోన్ దాడులు చేసింది. జమ్మూకాశ్మీర్​లోని శ్రీనగర్​తోపాటు పంజాబ్​లోని అమృత్​సర్, రాజస్థాన్​లోని జైసల్మేర్, పోఖ్రాన్ పైకి పాక్ డ్రోన్​లు రాగా, వాటిని మన బలగాలు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ తో పేల్చేశాయి. శ్రీనగర్ లో మళ్లీ సైరన్ మోతలు మోగాయి. సిటీ అంతా బ్లాకౌట్ విధించారు. వైష్ణోదేవి యాత్ర బేస్ క్యాంప్ వద్ద కూడా డ్రోన్ యాక్టివిటీ కనిపించడంతో ఆ ప్రాంతంలో బ్లాకౌట్ ప్రకటించారు. 

చైనా తమకు పూర్తి మద్దతు ప్రకటించిందని శనివారం రాత్రి కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ వెల్లడించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఫోన్ లో మాట్లాడారని, తాజా పరిస్థితిని వివరించారని ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఆఫీస్ తెలిపింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు పాక్ చేస్తున్న పోరాటంలో చైనా పూర్తి అండగా ఉంటుందని ఈ సందర్భంగా వాంగ్ యీ హామీ ఇచ్చారని పేర్కొంది.