- ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ గురువారం జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో మాట్లాడారు. “రాఫెల్ భారత్‌ను బలోపేతం చేస్తుంది. 114 రాఫెల్ జెట్లు కొనుగోలు చేయాలన్న ఇండియా ప్రతిపాదనలు సరైనవే. ఇది కేవలం ఒప్పందం కాదు. ఇది మేక్ ఇన్ ఇండియా కింద కో-ప్రొడక్షన్, ఉద్యోగాల సృష్టి, సాంకేతిక బదలాయింపు. అంతేగాక, ఫ్రాన్స్, ఇండియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది” అని మాక్రాన్ వివరించారు. ఈ ఒప్పందంపై వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు.
రాఫెల్ భారత్ రక్షణను ఆధునికీకరించడంలో కీలకమని పేర్కొన్నారు. రాఫెల్ జెట్లు ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేస్తుంది. ఈ నెల 12న భారత రక్షణ శాఖకు చెందిన డీఏసీ సుమారు రూ. 3.25 లక్షల కోట్ల విలువైన 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఇందులో 18 జెట్లు నేరుగా ఫ్రాన్స్ నుంచి సప్లై అవుతాయి.మిగిలిన 96 జెట్లు భారత్‌లోనే మేక్ ఇన్ ఇండియా కింద కో-ప్రొడక్షన్‌తో తయారు చేయనున్నారు.
ఏ దేశం చేయలేనిది ఇండియా చేసింది
దేశంలోని డిజిటల్ వ్యవస్థపై మాక్రాన్ ప్రశంసలు కురిపించారు. "భారత్ 140 కోట్ల ప్రజలకు డిజిటల్ గుర్తింపునిచ్చింది. ఇది ప్రపంచంలో మరే దేశం చేయలేదు. ఇప్పుడు ప్రతి నెలా 2,000 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసే చెల్లింపు వ్యవస్థ ఇండియా సొంతం. 50 కోట్ల డిజిటల్ హెల్త్ ఐడీలను జారీ చేసిన ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఇండియాలో ఉన్నాయి" అని ప్రశంసించారు. వేదికపై ‘నమస్తే’తో ప్రసంగం ప్రారంభించి, ‘జై హో’తో ముగించారు.
