- నేడు ఇంగ్లండ్‌తో టైటిల్ ఫైట్
- రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
హైదరాబాద్, వెలుగు: ఇండియా విమెన్స్ హాకీ టీమ్ హైదరాబాద్ గడ్డపై అద్భుతం సృష్టించింది. ప్రతిష్టాత్మక ఎఫ్ఐహెచ్ విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఫైనల్ చేరుకుంది. దాంతో పాటు వరల్డ్ కప్ బెర్తును కూడా సొంతం చేసుకుంది. శుక్రవారం గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్లో ఇండియా1-0 తేడాతో ఇటలీపై సంచలన విజయం సాధించింది.
40వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను మిడ్ ఫీల్డర్ మనీషా చౌహాన్ పవర్‌ఫుల్ షాట్‌తో గోల్‌గా మలిచి ఆతిథ్య జట్టును గెలిపించింది. శనివారం జరిగే తుది పోరులో ఇంగ్లండ్‌తో తలపడనుంది. మరో సెమీస్‌లో ఇంగ్లండ్ 2–0తో స్కాట్లాండ్‌ను ఓడించి ఫైనల్లో అడుగు పెట్టింది. ఇంగ్లిష్ టీమ్ కూడా వరల్డ్ కప్ బెర్తు సొంతం చేసుకుంది. ఇటలీ, స్కాట్లాండ్ మధ్య శనివారం జరిగే బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టుకు మరో బెర్తు లభిస్తుంది.
హోరాహోరీ పోరు
ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమించాయి. ఫస్ట్ క్వార్టర్‌లో బాల్ ఎక్కువగా మిడ్‌ఫీల్డ్‌లోనే తిరిగింది. ఇండియా ఇటలీ డిఫెన్స్‌ను ఛేదించడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రత్యర్థి జట్టు కూడా గట్టి పోటీని ఇచ్చింది. దాంతో ఇరు జట్లూ ఖాతా తెరవలేకపోయాయి. ఇక రెండో క్వార్టర్ ఆరంభంలోనే ఇండియా తన అటాకింగ్‌ను పెంచింది. మైదానం అంచులను ఉపయోగించుకుంటూ బాల్‌ను ఇటలీ సర్కిల్‌లోకి పదే పదే పంపింది.
ఈ క్రమంలో 18వ నిమిషంలో ఇండియాకు తొలి పెనాల్టీ కార్నర్ లభించినా.. దాన్ని ఇటలీ గోల్ కీపర్ లూసియా అద్భుతంగా అడ్డుకుంది. 27వ నిమిషంలో కెప్టెన్ సలీమా టెటే వ్యూహాత్మకంగా గోల్ చేయడానికి ప్రయత్నించినా, ఇటలీ డిఫెండర్లు గోల్ లైన్ వద్ద బాల్‌ను నిలువరించారు. రెండు నిమిషాల తర్వాత మరో పెనాల్టీ కార్నర్ లభించినా నవనీత్ కౌర్ కొట్టిన షాట్ వైడ్‌గా వెళ్లింది. దాంతో ఫస్టాఫ్ట్ ముగిసేసరికి ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి.
మనీషా మ్యాజిక్
మూడో క్వార్టర్ ఆటలో వేగం పెరిగింది. ఇటలీ కూడా దాడులు ముమ్మరం చేసింది. ఓ దశలో ఆ టీమ్ ప్లేయర్ ఎమిలియా మునిటిస్ గోల్ చేసేలా కనిపించినా ఇండియా గోల్ కీపర్ బిచు దేవి ఖరీబమ్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ ప్రమాదాన్ని తప్పించింది. ఇక, 40వ నిమిషంలో ఇండియాకు లభించిన పెనాల్టీ కార్నర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. మనీషా చౌహాన్ అద్భుతమైన డ్రాగ్ ఫ్లిక్ షాట్‌తో బాల్‌ను నేరుగా నెట్‌లోకి పంపింది.
మనీషా కొట్టిన ఈ గోల్ తర్వాత ఇండియా ఫ్యాన్స్ కేరింతలతో స్టేడియం హోరెత్తిపోయింది. చివరి క్వార్టర్‌లో ఆధిక్యాన్ని పెంచుకోవడానికి హోమ్‌టీమ్ ప్రయత్నించగా, స్కోరును సమం చేయడానికి ఇటలీ సర్వశక్తులూ ఒడ్డింది. ఆతిథ్య జట్టుకు మరో రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా.. గోల్ కొట్టలేకపోయింది. ఇక మరో నిమిషంలో ఆట ముగుస్తుందనగా ఇటలీకి పెనాల్టీ కార్నర్ లభించడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. కానీ, ఇండియా డిఫెండర్లు అడ్డు గోడలా నిలబడి ఇటలీ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. దీంతో ఆతిథ్య జట్టు ఉత్కంఠ విజయం అందుకుంది.
