మనం ఏమంత హ్యాపీగా లేం.. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో నేపాల్, పాకిస్తాన్ కంటే వెనకే

మనం ఏమంత హ్యాపీగా లేం.. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో  నేపాల్, పాకిస్తాన్ కంటే వెనకే
  • భారత్కు 116వ స్థానం..
  • వరుసగా 9వ ఏడాది ఫిన్లాండ్ టాప్.. 
  • అమెరికాకు 23వ ర్యాంకు


మన దేశ ప్రజలు ఏమంత హ్యాపీగా లేరు. అలాగని మరీ బాధలోనూ లేరు. సంతోషంగా ఉండడంలో భారత్ గతేడాది కంటే కాస్త మెరుగుపడిందని గురువారం విడుదలైన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. యునైటెడ్ నేషన్ ఆధ్వర్యంలోని ‘సస్టైనబుల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్’ ఏటా మార్చి 20న వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ జాబితాను విడుదల చేస్తుంది. ఈసారి మొత్తం 147 దేశాలతో జాబితా వెలువడింది. అందులో మన దేశం 116వ స్థానంలో నిలిచింది. అయితే నేపాల్ (99), పాకిస్తాన్ (104) కంటే ఇండియా వెనుకబడి ఉండటం చర్చనీయాంశమైంది.

న్యూఢిల్లీ: మన దేశ ప్రజలు ఏమంత హ్యాపీగా లేరు. అలాగని మరీ బాధలోనూ లేరు. ఈ విషయాన్ని గురువారం విడుదలైన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. యునైటేడ్ నేషన్ ఆధ్వర్యంలోని 'సస్టైనబుల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్' ఏటా మార్చి 20న (ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్) వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ జాబితాను విడుదల చేస్తుంది. ఈసారి మొత్తం 147 దేశాలతో జాబితా వెలువడింది. అందులో మన దేశం 116వ ర్యాంకులో ఉంది. 2025లో 118వ స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది రెండు మెట్లు పైకి రావడం సానుకూలాంశం. 

డిజిటల్ విప్లవం వల్ల సామాన్యుడికి సేవల అందుబాటు సులభతరం కావడం, ఆర్థిక వృద్ధి రేటు స్థిరంగా ఉండటం మన దేశ ర్యాంకు మెరుగుపరడటంలో తోడ్పడ్డాయి. గతంతో పోలిస్తే భారతీయులలో దాతృత్వం పెరిగిందని నివేదిక పేర్కొంది. అయితే ఇప్పటికీ పొరుగు దేశాలైన నేపాల్ (99), పాకిస్తాన్ (104) కంటే భారత్ వెనుకబడే ఉంది.

ఫిన్లాండ్ టాప్..ఐస్‌‌‌‌‌‌‌‌లాండ్ సెకండ్

ఈ రిపోర్ట్ ప్రకారం..ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదవ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. దీని తర్వాతి స్థానాల్లో వరుసగా ఐస్‌‌‌‌‌‌‌‌లాండ్(2), డెన్మార్క్(3), కోస్టా రికా(4), స్వీడన్(5), నార్వే(6), నెదర్లాండ్స్(7), ఇజ్రాయెల్(8), లక్సెంబర్గ్(9), స్విట్జర్లాండ్(10) దేశాలు టాప్ ర్యాంకుల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్  వంటి ఇంగ్లీష్ మాట్లాడే సంపన్న దేశాలు 'వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్'లో ఒకే రకమైన ధోరణిని ప్రదర్శించాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన టాప్-10 దేశాల్లో ఇవి ఉండేవి. కానీ, వరుసగా రెండో ఏడాది కూడా ఈ దేశాల్లో ఏ ఒక్కటీ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది. 

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ అమెరికా (23వ స్థానం) సంతోషంలో వెనుకబడటం గమనార్హం. గతంలో టాప్-10లో ఉండే కెనడా (25వ స్థానం) ఇప్పుడు కిందికి పడిపోయింది.ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో బ్రిటన్ (29వ స్థానం) సంతోషం విషయంలో మరింత దిగువకు వెళ్లింది. ఈ దేశాల్లో కనిపిస్తున్న అతిపెద్ద సమస్య యువతలో సంతోషం తగ్గడమేనని రిపోర్ట్ తెలిపింది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరిగి సంతోషం తగ్గుతుంది. కానీ, ఈ దేశాల్లో రివర్స్ జరుగుతోంది. 

వృద్ధులు సంతోషంగా ఉంటుండగా.. 25 ఏళ్ల లోపు యువత సోషల్ మీడియాకు బానిసలై తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ముఖ్యంగా ఈ దేశాల్లోని టీనేజ్ అమ్మాయిలు సోషల్ మీడియాకు ఎక్కువగా బానిసలయ్యారు. ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్, టిక్‌‌‌‌‌‌‌‌టాక్ వంటి యాప్‌‌‌‌‌‌‌‌లలో ఇతరుల జీవనశైలిని చూసి, తమ జీవితం బాగోలేదని కుంగుబాటుకు లోనవుతున్నారు. సాంకేతికంగా అందరూ కనెక్ట్ అయి ఉన్నప్పటికీ వ్యక్తిగత బంధాలు, ప్రత్యక్ష పలకరింపులు తగ్గిపోవడం ఈ దేశాల్లో పెద్ద మైనస్ అని రిపోర్ట్ పేర్కొంది.

అఫ్గాన్ లాస్ట్..పేదరికమే కారణం

ఇక సంతోష దేశాల జాబితాలో అఫ్గానిస్తాన్ వరుసగా ఐదో ఏడాది కూడా చివరి స్థానం(147)లో నిలించింది. తాలిబన్ల పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన, ముఖ్యంగా మహిళలు, బాలికలపై ఆంక్షలు, నిరంతర భయం ఇక్కడి ప్రజల సంతోషాన్ని పూర్తిగా హరించేశాయి. ఏండ్ల తరబడి సాగుతున్న అంతర్యుద్ధం వల్ల యెమెన్ (142)లో కనీస మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దాంతో ప్రజలకు సంతోషమనేదే కరువయ్యింది. ఒకప్పుడు 'మిడిల్ ఈస్ట్ పారిస్' అని పిలవబడిన లెబనాన్ (141)ప్రస్తుతం ఆర్థిక పతనం, రాజకీయ సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. సియెర్రా లియోన్ (146), మలావీ (145) దేశాలు తీవ్రమైన పేదరికంతో పోరాడుతున్నాయి. 

కనీస ఆరోగ్య సదుపాయాలు, శుభ్రమైన తాగునీరు అందకపోవడం వల్ల ప్రజల ఆయుర్దాయం చాలా తక్కువగా ఉంది. డిఆర్ కాంగో (140)లో అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ, సాయుధ గ్రూపుల మధ్య పోరాటాలు, అవినీతి వల్ల ఆ సంపద ప్రజలకు అందడం లేదు.జింబాబ్వే (144), బోట్స్వానా (143) దేశాల్లో ధరల పెరుగుదలతో  అక్కడి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది.

 జనాభా పెరుగుదల, నిరుద్యోగం, రాజకీయ అసమ్మతిని అణచివేయడం వల్ల ఈజిప్ట్ (139) ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. టాంజానియా (138)లో ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగవుతున్నప్పటికీ, మానవ హక్కుల విషయంలో వెనుకబడి ఉండటం వల్ల సంతోష సూచీలో దిగువన ఉందని నివేదిక పేర్కొంది. 

ఇండియా ఎందుకు హ్యాపీగా లేదంటే..
భారత్ ఆర్థికంగా అగ్రదేశాల వైపు అడుగులు వేస్తున్నప్పటికీ సంతోష సూచీలో దిగువనే ఉంది. దీనికి ప్రధానంగా ఆరు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది సామాజిక మద్దతు అని నివేదిక తెలిపింది. అంటే కష్టకాలంలో భరోసానిచ్చే సామాజిక వ్యవస్థలు బలహీనపడటం భారత్‌‌‌‌‌‌‌‌కు పెద్ద మైనస్‌‌‌‌‌‌‌‌గా మారింది. పట్టణీకరణ వల్ల ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై, ఒంటరితనం పెరిగిపోయింది. అంతేగాక,  దేశ జీడీపీ పెరుగుతున్నా, అది అందరికీ సమానంగా అందడం లేదు. ఆర్థిక అసమానతలు సామాన్యుడి సంతోషాన్ని హరిస్తున్నాయి.  సగటు ఆయుష్షు మెరుగుపడినప్పటికీ, మానసిక ఒత్తిడి, వర్క్~లైఫ్ బ్యాలెన్స్  లోపించడం కూడా ప్రతికూలంగా మారింది.విద్య, వృత్తి, వ్యక్తిగత జీవితంలో పూర్తి స్వేచ్ఛ లేకపోవడం, సామాజిక ఒత్తిళ్లు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయి. వ్యవస్థల్లో అవినీతి ఉందనే భావన కూడా ప్రజల సంతోష స్థాయిని తగ్గిస్తోంది. భారత్ ఇప్పుడు ఆర్థిక శక్తిగా మారుతోంది. ఇదే వేగంతో సామాజిక భద్రతపై కూడా దృష్టి పెడితే వచ్చే 5 నుంచి10 ఏండ్లలో టాప్-50 సంతోషకరమైన దేశాల జాబితాలోకి చేరడం అసాధ్యమేమీ కాదని నివేదిక పేర్కొంది.