న్యూఢిల్లీ, వెలుగు: ప్రపంచంలో నాణ్యమైన తేనెకు కేరాఫ్ గా భారత్ నిలుస్తోంది. తేనె ఉత్పత్తి, ఎగుమతుల్లో మన దేశం ‘తీపి విప్లవం’ సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘నేషనల్ బీ కీపింగ్- హనీ మిషన్’ (ఎన్బీహెచ్ఎం) సక్సెస్ దిశగా సాగుతోంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ అభియాన్‌లో భాగంగా ప్రవేశపెట్టిన ఈ పథకంతో భారత్ నాలుగేళ్లలోనే ప్రపంచ తేనె ఎగుమతుల్లో తొమ్మిదో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది.
2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ స్కీం... 2025–-26 ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం కేంద్రం ఐదేళ్లకు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 2024లో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల సహయ తేనెను భారత్ ఉత్పత్తి చేసింది. 1.07 లక్షల మెట్రిక్ టన్నుల సహజ తేనెను ఎగుమతి చేసింది. తద్వారా సుమారు 1,480 కోట్ల విదేశీ మారకాన్ని ఆర్జించింది. భారత్ నుంచి ప్రధానంగా అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, లిబియా దేశాలకు తేనె ఎగుమతి అవుతోంది.
అలాగే మధుక్రాంతి అనే పోర్టల్ ద్వారా తేనెటీగల పెంపకందారులు, సొసైటీలు, కంపెనీల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తోపాటు తేనె మూలాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది అక్టోబరు నెలాఖరు నాటికి సుమారు 15 వేల మంది పెంపకందారులు ఇందులో రిజిస్టర్ అయ్యారు. నాణ్యతను పరీక్షించడానికి దేశవ్యాప్తంగా 6 ప్రపంచ స్థాయి హనీ టెస్టింగ్ ల్యాబ్‌లు, 47 మినీ ల్యాబ్‌ల ఏర్పాటు జరిగింది. తేనెటీగల పెంపకందారులను ఏకతాటిపైకి తెచ్చేందుకు 100 రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పీఓ) ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 97 ఎఫ్‌పీఓలు రిజిస్టర్ అయ్యాయి
