సిగరేట్ సీక్రెట్ గా మొదలయ్యే ఒక వ్యసనం. అంతే సీక్రెట్ గా లోపల శరీరాన్ని మింగేస్తుంది. యువతే ఎక్కువగా పొగాకుకి బానిసలవుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ధూమపాన వ్యాప్తి కలిగిన ప్రపంచ దేశాల్లో భారతదేశం మూడో స్ధానంలో ఉంది.ది గ్లోబల్ యూత్ టోబాకో సర్వే ఆధ్వర్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ 2019లో సర్వే చేసింది. దేశంలో 987 స్కూళ్ళ నుంచి 97 వేల 302 మంది విద్యార్ధులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీళ్ళల్లో 80 వేల 772 మంది... 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న వారే. పాల్గొన్న వారిలో 96.9 శాతం మంది సమాధానాలిచ్చారు. దేశ వ్యాప్తంగా 18 శాతం పైగా విద్యార్ధులు పాగాకు వాడుతున్నట్టు సర్వేలో తేలింది. తెలంగాణలో 5.2 శాతం, ఏపీలో 2.6 శాతం పొగాకు వాడుతున్నట్లు సంస్థ తెలిపింది.
ఇంట్లోనే పొగ తాగడాన్ని మొదటిసారిగా అలవాటు చేసుకున్న విద్యార్ధులు 11.2 శాతం మంది ఉన్నట్లు సర్వేలో తేలింది. చిన్నప్పుడు సిగరెట్ సంగతి తెలుసుకొని... యవ్వనంలో ఒక్కసారి తాగి చూద్దామనుకుంటున్నారు. కానీ అదే అలవాటుగా మారుతోంది. తల్లిదండ్రులు పొగ తాగుతుంటే... పిల్లలకు కూడా అలవాటయ్యే అవకాశమున్నట్టు సర్వేలో తేలింది. పొగాకుతో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. అందులో నికోటిన్ వల్ల టెంపరరీ అడిక్షన్ అయ్యేందుకు అవకాశముంటుంది. సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఉపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. లైఫ్ టైమ్ లో తప్పకుండా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. గర్భిణి స్త్రీలకు ఈ సిగరేట్ అలవాటు ఉంటే మరింత ప్రమాదమంటున్నారు. పొగాకుకు దూరంగా ఉండాలంటుని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.
యువత వ్యసనాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు పర్యావరణ నిపుణులు నరసింహారెడ్డి. పొగ తాగితే ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా... బాలురతో పాటు బాలికలు కూడా తాగుతున్నట్టు చెప్పారు. స్కూళ్ళ దగ్గర, దారిలో, వీధి చివర నిబంధనలను ఉల్లంఘించి చిన్న వయస్సుల వారికి పొగాకు ఉతృత్తులను అమ్ముతున్నారన్నారు. వీటిని అడ్డుకోకపోతే యువత పనికిరాకుండా పోవడంతో పాటు నేరాలు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
టీనేజ్ పిల్లల్లో పొగాకు వాడకం ఈ మధ్యకాలంలో చాలా మందిని చూసినట్టు సైకాలజిస్ట్ లు చెబుతున్నారు. పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం, ఫ్రెండ్స్ వల్ల కూడా వాటికి అడిక్ట్ అవుతున్నారు. పేరెంట్స్ పిల్లల బిహేవియర్ గమనిస్తూ .. వారిని పర్యవేక్షించాలంటున్నారు సైకాలజిస్టులు. సిగరెట్ తాగితే ఎలాంటి నష్టమో చెబుతూనే... అందుకు ఆల్టర్నేట్ గా వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చే పనులు అలవాటు చేయాలని సూచిస్తున్నారు. పిల్లలు వినకుండా సిగరేట్ తాగుతుంటే సైకాలజిస్ట్ లతో కౌన్సెలింగ్ చేయించాలంటున్నారు. 18 ఏళ్ళ లోపు పిల్లలు పొగ తాగకూడదనీ... వారికి పొగాకు ఉతృత్తులు అమ్మొద్దని చట్టాలు ఉన్నాయి. కానీ అవి అమల్లో కనిపించడం లేదు. అందుకే పిల్లలు ధూమపానానికి అడిక్ట్ అవుతున్నారన్న వాదనలు బలంగానే వినబడుతున్నాయి.
