కరోనా డేంజర్ బెల్స్.. 20 శాతం పెరిగిన కేసులు

కరోనా డేంజర్ బెల్స్..  20 శాతం పెరిగిన కేసులు

కాస్త తగ్గుతున్నట్టుగా కనిపించిన  కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏప్రిల్ 19తో పోలిస్తే ఇవాళ ఏప్రిల్ 20 గురువారం రోజున కేసులు 20 శాతం పెరిగాయి. అంటే 2 వేలకు పైగా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి.   గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 12 వేల 591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో  యాక్టివ్  కేసుల సంఖ్య 65,286 కు చేరుకుంది. మరోవైపు 10 వేల 827 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.  

ఇక  చత్తీస్‌గఢ్‌లో నలుగురు, ఢిల్లీలో ఐదుగురు, హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు, కర్ణాటకలో ముగ్గురు, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో ఒక్కొక్కరు, మహారాష్ట్రలో ఆరుగురు, రాజస్థాన్‌, కేరళలో ఇద్దరు మరణించారు. ఒమిక్రాన్ సబ్-వేరియంట్ XBB.1.16 ఎఫెక్ట్ తోనే.. కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.  ఏప్రిల్ నెల చివరి నుంచి క్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అప్పటి వరకు ఇదే రీతిన కరోనా కేసులు పెరుగుతాయని.. జనం ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.

ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని.. నలుగురిలో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా వచ్చినా మరణాలు సంఖ్య చాలా చాలా తక్కువగా ఉందని.. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడే మరణాలు జరుగుతున్నాయని.. కేవలం కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య ఒకటీ, రెండు మాత్రమే ఉంటున్నాయని చెబుతున్నారు అదికారులు.