ప్రభుత్వ రంగ సంస్థలపై 70వేల ఫిర్యాదులు.. బ్యాంకింగ్, రైల్వేలపైనే అవినీతి ఫిర్యాదులెక్కువ

ప్రభుత్వ రంగ సంస్థలపై 70వేల ఫిర్యాదులు.. బ్యాంకింగ్, రైల్వేలపైనే అవినీతి ఫిర్యాదులెక్కువ
  • బ్యాంకులపై 9,933.. రైల్వే శాఖపై 9,381 కంప్లైంట్స్‌‌‌‌
  • అత్యల్పంగా తపాలా శాఖపై 1,003 నమోదు
  • దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలపై 70,500 ఫిర్యాదులు 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో 2025 ఏడాదిలో  ఏకంగా 70,500కి పైగా అవినీతి ఫిర్యాదులు అందాయి. ఇందులో బ్యాంకింగ్ రంగం, రైల్వే శాఖ వరుసగా ఫస్ట్, సెకండ్ ప్లేసుల్లో  నిలిచాయి. ఈ మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)  వార్షిక నివేదికను రిలీజ్ చేసింది.  ఈ రిపోర్టు దేశంలోని ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత లోపాలను, అధికారుల తీరుపై ప్రజల్లో అసంతృప్తిని కళ్లకు కట్టింది. రంగాల వారీగా ఫిర్యాదుల వివరాలివే..

సీవీసీ నివేదిక ప్రకారం 2025 ఏడాదిలో అవినీతి ఫిర్యాదుల వివరాలను పరిశీలిస్తే.. అత్యధికంగా బ్యాంకులకు సంబంధించి 9,933 ఫిర్యాదులు అందగా వాటిలో 9,520 పరిష్కారమై 413 పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. అలాగే రైల్వేలకు సంబంధించి 9,381 ఫిర్యాదులు రాగా 8,754 పరిష్కారమై 627 పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. ఈ రెండు విభాగాలే అవినీతి ఫిర్యాదుల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి.

 వీటితో పాటు గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖపై 6,531 ఫిర్యాదులు.. స్థానిక సంస్థలు (ఢిల్లీ మినహా) 4,834, కోల్ (బొగ్గు) రంగంపై 4,118, ఫైనాన్స్ (ఆర్థిక శాఖ)పై 3,107, ఢిల్లీ ప్రభుత్వంపై 2,804, పెట్రోలియం మంత్రిత్వ శాఖపై 2,722 ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా, ఢిల్లీ పోలీస్‌‌‌‌పై 2,633, రోడ్డు రవాణా, రహదారుల శాఖపై 2,139, హోంమంత్రిత్వ శాఖపై (ఢిల్లీ పోలీసులు కాకుండా) 2,036 , హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌‌‌‌మెంట్ (హెచ్ఆర్డీ)పై 2,030, కార్మిక మంత్రిత్వ శాఖపై 1,894, బీమా కంపెనీలపై 1,536 కంప్లైంట్స్ నమోదయ్యాయి. 

ఇంకా టెలికమ్యూనికేషన్స్ సంబంధించి 1,469 ఫిర్యాదులు, రక్షణ మంత్రిత్వ శాఖ (డిఫెన్స్)పై 1,410, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజా పంపిణీ శాఖపై 1,123, స్టీల్ (ఉక్కు) మంత్రిత్వ శాఖపై 1,023 ఫిర్యాదులు అందగా.. అత్యల్పంగా పోస్టల్ డిపార్ట్‌‌‌‌మెంట్ పై1,003 ఫిర్యాదులు నమోదయ్యాయి. కాగా, డిసెంబర్ 31, 2025 నాటికి సీవీవోలు మొత్తం 70,584 ఫిర్యాదులను స్వీకరించగా.. వాటిలో అత్యధికంగా 64,905 ఫిర్యాదులను విజయవంతంగా పరిష్కరించారు.