IND Vs SL: అభిషేక్ జోరు.. తిలక్ హోరు: ఇండియా బ్యాటింగ్ ధాటికి టోర్నీలో తొలిసారి 200 దాటిన స్కోర్

IND Vs SL: అభిషేక్ జోరు.. తిలక్ హోరు: ఇండియా బ్యాటింగ్ ధాటికి టోర్నీలో తొలిసారి 200 దాటిన స్కోర్

ఆసియా కప్ లో శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో అదరగొట్టింది. శుక్రవారం (సెప్టెంబర్ 26) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో లంక బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61: 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఎప్పటిలాగే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా.. మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్ (39), తిలక్ వర్మ (49) కీలక ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో దసున్ షనక, వనిందు హసరంగా, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, అసలంక తలో వికెట్ తీసుకున్నారు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు మంచి ఆరంభం లభించలేదు. రెండో ఓవర్లోనే తీక్షణ బౌలింగ్ లో గిల్ (4) ఔటయ్యాడు. ఈ దశలో సూర్యతో కలిసి అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. ఒక పక్క సూర్య ఆచితూచి ఆడితే మరోవైపు అభిషేక్ తగ్గేదే లేదన్నట్టు తనదైన శైలిలో రెచ్చిపోయి ఆడాడు. దీంతో పవర్ ప్లే లోనే ఇండియా వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. పవర్ ప్లే లోనే అభిషేక్ కేవలం 22 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకోవడం విశేషం. ధాటిగా ఆడుతున్న వీరిద్దరి వీరిద్దరూ  స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు.   

ఈ టోర్నమెంట్ లో ఘోరంగా విఫలమవుతున్న సూర్య మరోసారి నిరాశపరిచాడు. 13 బంతుల్లోనే కేవలం 12 పరుగులే చేసి ఔటయ్యాడు. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అభిషేక్ శర్మ కూడా ఔట్ కావడంతో 92 పరుగుల వద్ద ఇండియా మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో తిలక్ వర్మ, సంజు శాంసన్ జట్టును ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ మూడో వికెట్ కు 66 పరుగులు జోడించి జట్టు భారీ స్కోర్ కు బాటలు వేశారు. శాంసన్ (39), పాండ్య (2) స్వల్ప వ్యవధిలో ఔటైనా.. తిలక్ వర్మ (49*), అక్షర్ పటేల్ (21) చివరి ఓవర్లలో మెరుపులు మెరిపించి జట్టుకు భారీ స్కోర్ అందించారు.