- నందినికి చోటు.. ప్రతీక, అమన్జ్యోత్కు నిరాశ
ముంబై: జూన్ 12 నుంచి ఇంగ్లాండ్‌లోని వేల్స్ వేదికగా ప్రారంభమయ్యే మహిళల టీ20 ప్రపంచకప్‌కు బీసీసీఐ శనివారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులోకి నందినీ శర్మతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియాను ఎంపిక చేశారు.
బ్యాటర్లు ప్రతీక రావల్, హర్లీన్ డియోల్‌ను తప్పించగా.. గాయాల కారణంగా ఆల్‌రౌండర్ అమన్‌జ్యోత్ కౌర్, కాష్వీ గౌతమ్‌లను ఎంపిక చేయలేదు. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌కాగా స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జులై 10 నుంచి 13 వరకు లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే ఏకైక టెస్టు కోసం ప్రతీక రావల్‌ను ఎంపిక చేశారు.
హర్లీన్ డియోల్ వన్డే సిరీస్‌లో భారత్ -ఎ జట్టుకు నాయకత్వం వహించనుంది. నందినీ శర్మకు తొలిసారి జట్టులో చోటు లభించింది. బౌలింగ్ విభాగంలో రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ ఎంపికయ్యారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న అనుష్క శర్మ, ఉమా చెత్రిలకు ఈసారి చోటు దక్కలేదు. గతేడాది నవంబర్‌లో వన్డే ప్రపంచకప్ గెలిచిన ప్రధాన జట్టునే టీ20లకు కొనసాగించారు. ఈ జట్టు మే 28 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ పాల్గొంటుంది. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫైనల్ మ్యాచ్ జులై 5న లార్డ్స్‌లో జరుగుతుంది.
టీ 20 ప్రపంచకప్‌కు జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోశ్ (కీపర్), శ్రీ చరణి, యస్తికా భాటియా (రెండో కీపర్), నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.
ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టుకు జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, రోడ్రిగ్స్, ప్రతీక రావల్, రిచా ఘోశ్, శ్రీ చరణి, యస్తికా భాటియా, నందిని శర్మ, హర్లీన్ డియోల్, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే, స్నేహ్ రాణా.
