యూఎస్ రిపోర్ట్​ను తీవ్రంగా ఖండించిన ఇండియా

యూఎస్ రిపోర్ట్​ను తీవ్రంగా ఖండించిన ఇండియా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన 2022 రిపోర్ట్ ను మన విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇండియాలో మైనార్టీలకు వ్యతిరేకంగా దాడులు, హేట్ స్పీచ్​లు పెరుగుతున్నాయంటూ రిపోర్ట్ లో తప్పుడు విమర్శలు చేశారని మంగళవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

ఆ రిపోర్ట్ పూర్తిగా లోపభూయిష్టంగా, పక్షపాతంతో, ఏదో మోటివేషన్​తో ఉందన్నారు.  ‘‘అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ సోమవారం విడుదల చేసిన నివేదిక తప్పుడు సమాచారంతో కూడుకుని ఉంది. నివేదికలో కొందరు అమెరికన్ అధికారులు చేసిన కామెంట్లు పక్షపాతంగా ఉండటం చూస్తేనే ఈ రిపోర్ట్ క్రెడిబిలిటీ ఏమిటనేది తెలుస్తోంది. అమెరికాతో సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తాం. అదే సమయంలో మాకు ఆందోళనకరమైన అంశాలపై నిర్భయంగా అభిప్రాయాలను పంచుకుంటాం” అని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ అమెరికా ఇలాంటి రిపోర్ట్ ను విడుదల చేయగా, కేంద్రం తీవ్రంగా ఖండించింది. అయితే, వచ్చే నెలలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో విడుదలైన ఈ రిపోర్ట్ కు ప్రాధాన్యం ఏర్పడింది. 

రిపోర్ట్​లో ఏముంది? 

రష్యా, ఇండియా, చైనా, సౌదీ అరేబియా వంటి అనేక దేశాల్లో మైనార్టీలను టార్గెట్ చేయడం కొనసాగుతోందని రిపోర్ట్​లో అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఇండియాలోనూ మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. అధికార బీజేపీ పేరును 28 సార్లు, వీహెచ్​పీ పేరును 24 సార్లు, బజరంగ్ దళ్ పేరును 7 సార్లు ప్రస్తావించారు.

దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు విద్వేషపూరిత ప్రకటనలు చేశారని పేర్కొంది. మహ్మద్ ప్రవక్తపై కామెంట్లు చేసిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ పేర్లను, వివాదాస్పద ట్వీట్ చేసి అరెస్ట్ అయిన మహ్మద్ జుబేర్ పేరును ప్రస్తావించింది. బిల్కిస్ బానో కేసును కూడా రిపోర్ట్ లో అమెరికా ప్రస్తావించింది. ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లను తొలగిస్తామన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్లను కూడా రిపోర్ట్​లో పేర్కొంది.