ఇండియా మహా అద్భుతం చేసింది : రైలు బోగీ లాంటి లాంఛర్ నుంచి అగ్ని క్షిపణి ప్రయోగం సక్సెస్

ఇండియా మహా అద్భుతం చేసింది : రైలు బోగీ లాంటి లాంఛర్ నుంచి అగ్ని క్షిపణి ప్రయోగం సక్సెస్

ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి భారత్ తన రక్షణ వ్యవస్థలను మెరుగుపరుచుకోవటమే కాకుండా.. ఇప్పటికే ఉన్న వ్యవస్థలను సమర్థవంతంగా ఎక్కడి నుంచైనా.. ఎలాగైనా వాడేందుకు వీలుగా వాటిని రూపాంతరం చేస్తోంది. దీని ద్వారా అత్యవసర సమయాల్లో వాటిని అవసరమైన స్థానాలకు వేగంగా చేర్చటంతో పాటు వాటిని ఉన్న చోటి నుంచే వినియోగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది భారత్. 

ఈ క్రమంలోనే తాజాగా అగ్ని ప్రైమ్ క్షిపణి వ్యవస్థను రైలు లాంటి ఒక మెుబైల్ లాంచర్ నుంచి విజయవంతంగా గురువారం భారత రక్షణ దళాలు ప్రయోగించాయి. దేశ చరిత్రలో ఇలాంటి ఒక ప్రయోగం నిర్వహించటం ఇదే  తొలిసారి కావటం గమనార్హం. దేశంలోని రైల్వే వ్యవస్థకు అనుసంధానించబడిన ప్రత్యేకంగా తయారు చేసిన రైలు బేస్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించబడింది. 

డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దేశంలో ఇలాంటి ప్రయోగం తొలిసారి అని పోస్టులో వెల్లడించిన రాజ్‌నాథ్.. ఇది పెరుగుతున్న భారత్ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలకు సంకేంతం అని చెప్పారు. ప్రత్యేకంగా రూపొందించిన రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుండి ప్రయోగం విజయవంతం కావటంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని-ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు DRDO , స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, సాయుధ దళాలకు అభినందించారు రక్షణ మంత్రి. 

వాస్తవానికి అగ్ని క్షిపణి వ్యవస్థ అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ. ఇది 2వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సునాయాసంగా చేరుకోగలదు. దీనిని మెుదటగా ఆగస్టులో ఒడిశాలోని చాందీపూర్‌లో క్షిపణి విజయవంతంగా ప్రయోగించిన తర్వాత ప్రస్తుత పరీక్ష జరిగింది. అలాగే భారత్ మార్చి 2024లో 'మిషన్ దివ్యస్త్ర' కింద అగ్ని-5 క్లిపణి వ్యవస్థ పరీక్షను నిర్వహించింది.