
- దాయాది తీరును బట్టే ఒప్పందం రద్దుపై నిర్ణయం
- విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి
- ఏం సాధించారని విక్టరీ ర్యాలీలు తీస్తున్నరు?
- ఓటమిని కూడా గ్రాండ్‌గా జరుపుకోవడం పాక్‌కు అలవాటే
- కాశ్మీర్ విషయంలో మా వైఖరి మారదని తేల్చిచెప్పిన జైస్వాల్
న్యూఢిల్లీ: టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచిపోషిస్తున్నంత వరకు సింధు జలాల ఒప్పందంపై సస్పెన్షన్ కొనసాగుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. క్రాస్ బార్డర్ టెర్రరిజానికి పాకిస్తాన్ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనన్నారు. ఆరు దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందం అమలు చేయాలా లేదా అనేది పాకిస్తాన్ వ్యవహార శైలిపైనే ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పారు. పీవోకేను పాకిస్తాన్ వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో పాటు పలు అంశాలపై రణధీర్ జైస్వాల్ మంగళవారం మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. టెర్రరిస్టులకు సాయం చేయడాన్ని వెంటనే ఆపేయాలని పాకిస్తాన్‌కు సూచించారు.
‘‘సింధు జలాల ఒప్పందంపై సస్పెన్షన్ ఎత్తివేత.. పాకిస్తాన్‌పైనే ఆధారపడి ఉన్నది. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తామనుకుంటే సింధూ జలాల ఒప్పందం అమలు గురించి పాకిస్తాన్ మరిచిపోవాలి. ఇండియాపై ఇక నుంచి ఒక్క ఉగ్రదాడి జరిగినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవాలనుకుంటే అంతకంత అనుభవిస్తరు. సింధూ జలాల విషయంలో ఏప్రిల్ 23న కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) తీసుకున్న నిర్ణయం అమల్లోనే ఉంటది. కాల్పుల విరమణపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)ల సమావేశంలో చర్చించాం. మే 10న పాకిస్తాన్ డీజీఎంవో నుంచి ఫోన్ వచ్చింది. ఈ భేటీలో కాల్పుల విరమణపై నిర్ణయం తీసుకున్నాం. సీజ్ ఫైర్ ప్రపోజల్ పాకిస్తాన్ నుంచే వచ్చింది’’ అని జైస్వాల్ తెలిపారు.
కశ్మీర్‌పై ఎవరి మధ్యవర్తిత్వం అక్కర్లేదు
జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ విధానంలో ఎలాంటి మార్పులేదని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ‘‘ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతదని మేము భావిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ద్వైపాక్షిక సమస్యగానే పరిగణిస్తున్నాం. ఈ విషయంలో మధ్యవర్తిత్వం అవసరం లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఖాళీ చేయించాలన్నదే మా తుది నిర్ణయం. రెండు దేశాలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతది.
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న టైమ్‌లో ఇండియా, అమెరికా లీడర్లు మాట్లాడుకున్నారు. ఇందులో వాణిజ్యపరమైన అంశాలపై చర్చ జరగలేదు. ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు జరిగినా అవి టెర్రరిజం, పీవోకేపైనే ఉంటాయి. పహల్గాంలో దాడికి పాల్పడిన టీఆర్ఎఫ్.. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ. దీనిపై అంతర్జాతీయంగా నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆక్రమించిన ఇండియా భూభాగాన్ని వదిలేయడమే పాక్ ముందున్న ఏకైక ఆప్షన్’’ అని జైశ్వాల్ అన్నారు.
ప్రపంచ దేశాల ముందు పరువు తీసుకున్నది
ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పరువు తీసుకున్నదని రణధీర్ జైశ్వాల్ అన్నారు. ‘‘ఏం సాధించారని విక్టరీ ర్యాలీలు తీస్తున్నారు? ఇండియా ముందు మోకరిల్లినా.. బుద్ధి మాత్రం మార్చుకోలేదు. ఇండియాపై గెలిచామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓటమిని కూడా విజయంగా భావించడం పాకిస్తాన్‌కు అలవాటే. ఆపరేషన్ సిందూర్ తో గట్టిగా బుద్ధి చెప్పినా ఇంకా తప్పుడు ప్రచారమే చేస్తోంది. టెర్రరిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా భారత బలగాలు టెర్రరిస్టు క్యాంపులపై దాడులు చేశాయి.
అయితే, పాకిస్తాన్ దుస్సాహసానికి దిగింది. వాళ్లు కాల్పులు నిలిపివేస్తే ఇండియా దాడులు ఆపేస్తది. ఇదే విషయాన్ని ప్రపంచదేశాలకు చెప్పాం. మేము చెప్పిన విషయాన్ని ప్రపంచ దేశాల నాయకులు పాకిస్తాన్‌కు చెప్పి ఉంటారు. ఇండియా ఎంత చెప్పినా.. పాకిస్తాన్ పెడచెవిన పెడ్తున్నది’’ అని జైస్వాల్ అన్నారు. ఆదంపుర్ ఎయిర్‌బేస్‌ను ధ్వంసం చేశామని పాకిస్తాన్ తప్పుడు వార్తలు ప్రచురించిందని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారని, అక్కడి పరిస్థితులు ప్రపంచ దేశాలన్నీ చూశాయన్నారు.