
బర్మింగ్‌హామ్: తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఓటమికి ప్రతీకారంతీర్చుకునేందుకు ఇండియా బలమైన పునాది వేసుకుంది. జేమీ స్మిత్ (207 బాల్స్‌లో 21 ఫోర్లు, 4 సిక్సర్లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్ (234 బాల్స్‌లో 17 ఫోర్లు, 1 సిక్స్‌తో 158) భారీ సెంచరీలతో భయపెట్టినా.. బెదరకుండా రెండో టెస్టులో పట్టు బిగించింది. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ (6/70) దెబ్బకు మూడో రోజు (శుక్రవారం) ఆరంభంలో 84/5తో నిలిచిన ఆతిథ్య జట్టును స్మిత్, బ్రూక్ ఆరో వికెట్‌కు 303 రన్స్ జోడించి ఓదశలో 387/5తో పటిష్ట స్థితిలో నిలిపారు. కానీ, పేస్ లీడర్ బమ్రా గైర్హాజరీలో సిరాజ్ ఖతర్నాక్ బౌలింగ్‌తో మరోసారి మ్యాజిక్ చేశాడు.
చివర్లో అతనికి తోడు ఆకాశ్ దీప్ (4/88) కూడా ఆకట్టుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 407 స్కోరుకే ఆలౌటైంది. 20 రన్స్ తేడాతో చివరి ఐదు వికెట్లు పడగొట్టిన పేసర్లు ఇండియాకు 180 రన్స్ భారీ ఆధిక్యం అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 64/1 స్కోరుతో మూడో రోజు ఆట ముగించింది. యశస్వి జైస్వాల్ (28) ఔటైనా.. కేఎల్ రాహుల్ (28 బ్యాటింగ్), కరుణ్ నాయర్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మొత్తంగా 244 రన్స్ ఆధిక్యంలో నిలిచిన ఇండియా నాలుగో రోజు రెండు సెషన్లు ఆడి 400 ప్లస్ టార్గెట్ ఇస్తే విజయావకాశాలు పుష్కలంగా ఉంటాయి.
సిరాజ్ డబుల్ స్ట్రోక్.. స్మిత్ సూపర్ సెంచరీ
ఓవర్‌నైట్ స్కోరు 77/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ డబుల్ షాకిచ్చాడు. మూడో రోజు రెండో ఓవర్లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి ఫాలోఆన్‌పై ఆశలు రేపాడు. సిరాజ్ లెగ్ సైడ్ బాల్‌కు జో రూట్ (22) కీపర్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే వచ్చిన బెన్ స్టోక్స్ (0) అనూహ్యంగా బౌన్స్ అయిన బాల్‌ను వెంటాడి కీపర్‌కు దొరికిపోయాడు. దీంతో ఇంగ్లండ్ 84/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో స్మిత్, బ్రూక్ ఇండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ షార్ట్ బాల్ వ్యూహంతో బరిలోకి దిగినా ఫలితం లేకపోయింది.
లెగ్ సైడ్ ఆరుగురు ఫీల్డర్లను ఉంచినా స్మిత్ అతడిని ధీటుగా ఎదుర్కొన్నాడు. తను టీ20 స్టయిల్లో బ్యాటింగ్ చేశాడు. మార్నింగ్ సెషన్ 12వ ఓవర్లో ప్రసిద్ధ్ బౌలింగ్‌లో నాలుగు ఫోర్లు, సిక్స్‌తో ఏకంగా 23 రన్స్ రాబట్టాడు. ఇంగ్లిష్ బ్యాటర్లలో బ్రూక్ వేగంగా ఆడుతుంటాడు. కానీ, మూడో రోజు ఆటలో స్మిత్ అతడిని మించాడు. ఇండియా బౌలర్లపై నిలకడగా దాడి చేసి రన్స్ రాబట్టాడు. పేసర్లతో పాటు స్పిన్నర్లు జడేజా, సుందర్ బౌలింగ్‌ను ఉతికేశాడు.
సుందర్ తొలి రెండు బాల్స్‌లో స్మిత్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా.. జడేజా వేసిన తర్వాతి ఓవర్లో 6, 4తో ఆకట్టుకున్నాడు. అంతకుముందు జడ్డూ బౌలింగ్‌లో బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో గిల్ వదిలేశాడు. అప్పటికి 63 రన్స్ వద్ద ఉన్న బ్రూక్ ఈ లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. ఇక, లంచ్‌కు ముందు జడేజా బౌలింగ్‌లో వరుస ఫోర్లు కొట్టిన స్మిత్ 80 బాల్స్‌లోనే టెస్టుల్లో తన రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి జోరుకు ఒక్క సెషన్‌లోనే ఇంగ్లండ్ 27 ఓవర్లలో ఏకంగా 172 రన్స్ సాధించడం విశేషం.
బ్రూక్, స్మిత్‌దే పైచేయి
లంచ్ తర్వాత కూడా స్మిత్, బ్రూక్ హవానే నడించింది. మార్నింగ్ సెషన్‌లో భారీగా రన్స్ సమర్పించుకున్న ఇండియా బౌలర్లు రెండో సెషన్‌లో ఆ వేగాన్ని మాత్రమే తగ్గించగలిగారు. బ్రూక్, స్మిత్‌ను పార్ట్‌నర్‌షిప్ విడదీయలేకపోయారు. తొలిసెషన్‌లో షార్ట్ బాల్ వ్యూహం బెడిసికొట్టడంతో ఇండియా పేసర్లు తమ ప్లాన్ మార్చి బ్రూక్‌కు వైడ్ లైన్ బాల్స్ వేశారు. అయితే, దీన్ని ఎక్కువసేపు కొనసాగించలేదు.
ప్రసిధ్ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ వైపు ఫోర్ కొట్టిన బ్రూక్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే నితీష్ రెడ్డి బౌలింగ్‌లో స్మిత్ ఇచ్చిన కష్టమైన క్యాచ్‌ను పంత్ రైట్ సైడ్ డైవ్ చేసినా అందుకోలేకపోయాడు. అప్పటికి స్మిత్ 121 రన్స్‌తో ఉన్నాడు. మరోవైపు పాత బంతితోనూ స్పిన్నర్లు జడేజా, సుందర్ పెద్దగా ప్రభావం చూపలేదు. సెషన్ చివర్లో బ్రూక్ రివర్స్ స్వీప్‌తో రెండు ఫోర్లతో వేగం పెంచాడు. రెండో సెషన్‌లో ఇంగ్లండ్ 106 రన్స్ రాబట్టి 355/5తో టీ బ్రేక్‌కు వెళ్లింది.
20 రన్స్.. ఐదు వికెట్లు
చివరి సెషన్ ఆరంభంలోనూ స్మిత్, బ్రూక్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. దాంతో ఇంగ్లిష్ టీమ్ ఫాలో ఆన్ మార్కు (387) చేరింది. ఈ ఇద్దరి జోరు చూస్తుంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇండియాకు ఆధిక్యం దక్కడం కష్టమే అనిపించింది. కానీ, కొత్త బాల్‌తో ఇండియా పేసర్లు అదరగొట్టారు. అదే స్కోరు వద్ద బ్రూక్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన ఆకాశ్‌దీప్ ఆటను మలుపు తిప్పాడు. కాసేపటికే క్రిస్ వోక్స్ (5)ను కరుణ్ నాయర్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఆపై, సిరాజ్ హవా మొదలైంది. ఖతర్నాక్ బాల్స్ వేసిన అతను బ్రైడన్ కార్స్ (0), జోష్ టంగ్ (0)ను ఎల్బీ.. బషీర్ (0)ను బౌల్డ్ చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగించాడు.
20 రన్స్ తేడాతో ఇంగ్లండ్ చివరి ఐదు వికెట్లు కోల్పోయి ఆలౌటవగా.. మస్మిత్ డబుల్ సెంచరీకి 16 రన్స్ దూరంలో నిలిచిపోయాడు. ఆపై, భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన ఇండియాకు ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ మెరుపు ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ వన్డే స్టయిల్లో వరుస బౌండ్రీలతో వేగంగా ఆడటంతో ఎనిమిదో ఓవర్లోనే స్కోరు 50 దాటింది. కానీ, అదే ఓవర్లో జోష్ టంగ్ బౌలింగ్‌లో లైన్ మిస్సయి జైస్వాల్ ఎల్బీ అయ్యాడు. ఈ దశలో కేఎల్‌కు తోడైన కరుణ్ మరో వికెట్ పడకుండా రోజు ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు:
ఇండియా తొలి ఇన్నింగ్స్: 587 ఆలౌట్;
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 89.3 ఓవర్లలో 407 ఆలౌట్ (జేమీ స్మిత్ 184 నాటౌట్, బ్రూక్ 158, సిరాజ్ 6/70, ఆకాశ్‌దీప్ 4/88).
ఇండియా రెండో ఇన్నింగ్స్: 13 ఓవర్లలో 64/1 (జైస్వాల్ 28, రాహుల్28 బ్యాటింగ్, టంగ్ 1/12).