2026 ఆగస్టులోగా ఫస్ట్ బుల్లెట్​ ట్రెయిన్​ : : అశ్వినీ వైష్ణవ్

2026 ఆగస్టులోగా ఫస్ట్ బుల్లెట్​ ట్రెయిన్​ : : అశ్వినీ వైష్ణవ్
  •     గుజరాత్​లోని బిలిమోర, సూరత్ మధ్య ట్రాక్ పనులు వేగవంతం
  •     2022-23లో రైల్వే ప్యాసింజర్లు 640 కోట్లు: అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ : దేశంలో ఫస్ట్ బుల్లెట్ ట్రెయిన్ 2026 ఆగస్టులోగా పరుగులు పెట్టనుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్​లోని బిలిమోర, సూరత్ మధ్య 50 కిలోమీటర్ల పొడవున ఫస్ట్ బుల్లెట్ ట్రెయిన్ సెక్షన్ అందుబాటులోకి రానుందని, దీనికి సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయని మంత్రి తెలిపారు. రైల్వేలో పలు ప్రాజెక్టులపై బుధవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. 

రైల్వే ట్రాకులపై రైళ్లు ఢీకొనకుండా రూపొందించిన కవచ్ సిస్టమ్ ఏర్పాటుకూ పనులు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే ట్రెయిన్ లు ఢీకొని ఏనుగులు చనిపోతున్న ఘటనలను నివారించడానికి ప్రత్యేకంగా గజ్ రాజ్ సిస్టం పేరుతో కొత్త టెక్నాలజీని రూపొందిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేందుకు మరిన్ని కొత్త ట్రాకులు కూడా నిర్మిస్తున్నామన్నారు.

 కరోనా విపత్తుకు ముందు దేశంలో 1,768 మెయిల్/ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ సర్వీసులు నడుస్తుండగా, ఇప్పుడు అవి 2,214కు పెరిగాయన్నారు. అలాగే సబ్ అర్బన్ సర్వీసులు 5,626 నుంచి 5,774కు పెరిగాయని చెప్పారు. ఇక ప్యాసింజర్ ట్రెయిన్ లు 2,792 నుంచి 2,856కు పెంచామన్నారు. 2022–23లో దేశవ్యాప్తంగా రైల్వే శాఖ మొత్తం 640 కోట్ల మంది ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చిందని మంత్రి వివరించారు. 2023–24లో ప్యాసింజర్ల సంఖ్యను 750 కోట్లకు పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు.