ద్రవ్యోల్బణం పక్కా లెక్కకు..డబ్ల్యూపీఐకి బదులు పీపీఐ

ద్రవ్యోల్బణం పక్కా లెక్కకు..డబ్ల్యూపీఐకి బదులు పీపీఐ

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని మరింత వాస్తవికంగా అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) స్థానంలో క్రమంగా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (పీపీఐ) ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త సూచీ ఉత్పత్తి, ఇన్​పుట్, సేవల ధరలను పరిశీలిస్తుంది.  కేంద్ర పరిశ్రమల ప్రోత్సాక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఈనెల 15న కొత్త బేస్ ఇయర్ 2022-23 తో సవరించిన డబ్ల్యూపీఐ సిరీస్‌‌‌‌ను విడుదల చేయనుంది. 

ఇది ప్రస్తుత 2011-12 బేస్ ఇయర్ సిరీస్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. దీనితో పాటు ఔట్‌‌‌‌పుట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (ఓపీపీఐ), ట్రయల్ ఇన్‌‌‌‌పుట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (ఐపీపీఐ) సిరీస్‌‌‌‌లను విడుదల చేయనున్నారు. బ్యాంకింగ్, సెక్యూరిటీల లావాదేవీలు, ఇన్సూరెన్స్, పెన్షన్ ఫండ్స్ మేనేజ్‌‌‌‌మెంట్, రైల్వేలు, విమానయానం, టెలికాం వంటి ఏడు సేవల సర్వీస్ పీపీఐ కొత్త సిరీస్‌‌‌‌ను కూడా 15న విడుదల చేస్తారు. 

ధరల పెరుగుదల క్లాజులలో (ప్రైస్​ ఎస్కలేషన్​ క్లాజ్) డబ్ల్యూపీఐని విస్తృతంగా వాడుతున్నందున, సవరించిన సిరీస్ విడుదల తేదీ నుంచి ఐదేళ్ల పాటు ఈ సూచీని ప్రచురిస్తారు. ఆ తర్వాత పూర్తిగా నిలిపివేస్తారు. ఈ ఐదేళ్లలో వినియోగదారులు డబ్ల్యూపీఐ నుంచి పీపీఐ కి మారడానికి తగిన సమయాన్ని ఇస్తుంది.  ఐఎంఎఫ్ సిఫార్సులకు అనుగుణంగా ఈ మార్పులు చేస్తున్నారు. 

భవిష్యత్తులో ముడిసరుకుల ధరలు లేదా లేబర్ ఖర్చులు పెరిగితే, దానికి అనుగుణంగా కాంట్రాక్ట్ ధరను కూడా పెంచడానికి ఇరుపక్షాలు అంగీకరించే చట్టపరమైన ఫార్ములాను ప్రైస్​ ఎస్కలేషన్​ క్లాజ్​అంటారు.