ట్రంప్ టార్గెట్ గా మారిన భారత్

ట్రంప్ టార్గెట్ గా మారిన భారత్

భారత్, అమెరికాలు వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగే స్థాయిలో దశాబ్దాలపాటు పరస్పరం కలసి నడిచాయి. ఉమ్మడి ప్రజాస్వామిక విలువలు, పెరుగుతున్న రక్షణ సంబంధాలు, ఇద్దరికీ చైనా విషయంగా ఉన్న ఆందోళనలూ, వృద్ధి చెందుతున్న వాణిజ్యం.. ఇవన్నీ ఈ రెండు దేశాల మధ్య సంబంధం మరింత బలపడుతుందన్నట్టుగా కనిపించేలా చేశాయి. అందుకే తాజాగా, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తూ భారత్​ను లక్ష్యంగా చేసుకోవడం, అందునా భారీ సుంకాలు, బహిరంగ విమర్శలు చేయడం ఢిల్లీ, వాషింగ్టన్  రెండింటికీ ఆశ్చర్యం కలిగించింది. 

సులువుగా వివరించాలంటే, ట్రంప్​ది చంచలమైన, నికరంలేని తత్త్వం. కాస్త కచ్చితంగా, సవివరంగా చెప్పాలంటే, ఆయన వైఖరి ఒక జియో పొలిటికల్ క్రీడ.  ఆ వైఖరి వెనుక కనీసం ఐదు స్పష్టమైన వ్యూహాత్మక కారణాలు నాకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ అతని ‘అమెరికా ఫస్ట్’ సిద్ధాంతంతో ముడిపడి ఉన్నవే. అంతేకాదు, దౌత్యం విషయంలో నీకెంత-నాకెంత వైఖరితోపాటు, ప్రపంచ శక్తుల చదరంగంతో ముడిపడి ఉన్నాయి.

అమెరికాకు ఉద్యోగాలను తిరిగి తీసుకువస్తానని ట్రంప్ హామీ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించారు. అంటే, అమెరికాకు అన్యాయం చేసేలా ఉన్నాయని ఆయన భావించిన వాణిజ్య ఒప్పందాలు, ఆఖరికి అవి చైనా, ఈయూ లేదా భారత్ వంటి దీర్ఘకాలిక భాగస్వాములతో చేసుకున్నవైనప్పటికీ రద్దు చేయడం ఆయన ఉద్దేశం.  ఔషధ, ఐటీ సేవలు, వస్త్రాల రంగాల్లో పెరుగుతోన్న భారత్ ఎగుమతులు ట్రంప్ వాణిజ్య వ్యూహకర్తల కళ్ళ నుంచి తప్పించుకోలేకపోయాయి.  

అమెరికా చాలాకాలంగా అనేక దేశాలతో  వాణిజ్య మిగులును అనుభవించింది.  కానీ,  అమెరికా వాణిజ్యం ద్వారా గణనీయమైన మిగులును సాధిస్తున్న  కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్​ ఒకటి. ట్రంప్ దృష్టిలో భారత వాణిజ్య మిగులు, అమెరికా నష్టం.

జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్  ప్రిఫరెన్సెస్ (జీఎస్​పీ) కింద భారత్​కి ఉన్న ప్రిఫరెన్షియల్ ట్రేడ్ స్టేటస్ వెనక్కు 
తీసుకోవడం హఠాత్తుగా జరిగింది కాదు. ఇది ఒక స్పష్టమైన సందేశం. మిత్రుడా, శత్రువా అనే నిమిత్తం లేకుండా, ఏ దేశమైనా కానీ, అమెరికాకేంటి లాభం? అనే లెక్కవేసి, అమెరికాకు లాభం లేనివి రద్దు చేసుకోవడం..అమెరికా ఫస్ట్ నినాదపు సందేశం ఇది. ఉక్కు, అల్యూమినియం, ఆఖరికి నీషే ఎగుమతులపై కూడా అధిక సుంకాలు వేయడం అనేది, అమెరికా తయారీ రంగ పోటీతత్వాన్ని పెంచడంతోపాటు, భారత్ మార్కెట్లు అమెరికా ఉత్పత్తుల కోసం తెరవడానికి ఒత్తిడి చేయడమే.

భవిష్యత్ ఆర్థిక పోటీదారును కట్టడి చేయడం

ఆర్థికరంగంలో ట్రంప్ ప్రధాన లక్ష్యం చైనాయే అయినా, భారతదేశ జీడీపీ పెరుగుతోన్న తీరునుబట్టి, మరో రెండు దశాబ్దాలలో భారత్ ఆసియాలో మరో బలమైన ఆర్థిక దిగ్గజంగా మారగలదని ఆయన సలహాదారులు అర్థం చేసుకున్నారు. ప్రత్యర్థి పూర్తి సామర్థ్యాన్ని చేరకముందే కట్టడి చేయడం అనేది ప్రపంచ రాజకీయాల్లో బాగా ప్రాచుర్యం పొందిన వ్యూహం. తన ఆర్థిక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి అమెరికా ముందుగానే కొన్ని చర్యలు తీసుకోవడం అనేది చరిత్రలో అనేకసార్లు జరిగింది. 

వాణిజ్య పరిమితులు, ప్రత్యేక ఆంక్షలు, సాంకేతిక నియంత్రణ ద్వారా ఇలా చేస్తుంది. భారతదేశాన్ని ఇప్పుడు ఒత్తిడిలోకి నెట్టడం ద్వారా ట్రంప్ భవిష్యత్ యూఎస్​ పాలకులకు ఒక సూచన చేస్తున్నాడు. ‘భారత్​తో దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించినా, దాని ఎదుగుదలను అదుపు చేస్తూ ఉంచాలని’ వారికి ఆయన సూచిస్తున్నట్టు.   ట్రంప్ ప్రస్తుతం భారతదేశానికి భయపడుతున్నాడని కాదు. కానీ భారత జనాభా ఉన్న స్థాయిలో, భారత్ ఆర్థిక శక్తిగా కూడా బలపడితే, ముందుజాగ్రత్తగా అప్పుడు జరగబోయే (ఆర్థిక-వాణిజ్య) యుద్ధానికి నిబంధనలు పెడుతున్నారాయన. 

చైనాకు వ్యూహాత్మక సంకేతాలు

ఒకవైపు ఈ రెండు దేశాలూ చైనా విస్తరణవాదం గురించి ఆందోళన చెందుతోన్న వేళ,  భారత్​ను ఒత్తిడి చేయడం అనేది పైకి చూడగానే అసహజంగా, విచిత్రంగా అనిపిస్తుంది.  ముందుగా రెండు దేశాలు చైనా విస్తరణవాదంపై ఆందోళనలు పంచుకున్నప్పుడు భారతదేశంపై ఒత్తిడి తీసుకురావడం విరుద్ధంగా అనిపిస్తుంది. 

కానీ జియోపాలిటిక్స్​లో ట్రంప్ వైఖరి నేరుగా, సరళంగా ఉండడం చాలా అరుదు. భారత్​ను ఆర్థికంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం ద్వారా  ట్రంప్ చైనాకు కూడా ఒక సందేశం ఇస్తున్నాడు. అమెరికా కావాలనుకుంటే చైనా మాత్రమే కాదు, మొత్తం ఆసియా ఆర్థిక వ్యవస్థను తాము ఒత్తిడిలోకి నెట్టగలం అని చైనాకు  చెబుతున్నాడాయన. ఈ ప్రాంతం నుంచి పంపుతోన్న సందేశం ఇది. 

అమెరికా ప్రయోజనాల కోసం, అవసరమైతే ఆసియాలోని ఏ శక్తితో అయినా మా సంబంధాలను పునర్నిర్వచించుకోగలమన్న సందేశం ఇది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో విధానాలు ఎంత ముఖ్యమో, దృష్టికోణం కూడా అంతే ముఖ్యం. అందునా ట్రంప్ వంటి నిలకడలేని తత్త్వం, అతని బేరమాడే గుణాల నేపథ్యంలో అమెరికా భాగస్వామి అయిన భారత్ వంటి దేశం కూడా ఈ ఒత్తిడికి అతీతమైనది కాదని చైనా గమనించి ఉంటుంది.

దీర్ఘకాలిక చిక్కులు

ట్రంప్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం స్వల్ప కాల సంబంధాలను దెబ్బతీసింది.  ఢిల్లీ ట్రంప్​ సుంకాలను ప్రతిఘటించింది.  డబ్ల్యూటీఓ వద్ద ఫిర్యాదులు చేసింది.  వ్యూహాత్మక భాగస్వామ్యాలను వాణిజ్య ఒత్తిడికి తాకట్టు పెట్టలేమని సూచించింది. అయినప్పటికీ,  అమెరికా-, భారత్ మౌలిక సంబంధాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. రక్షణ సహకారం కొనసాగింది, క్వాడ్ ఊపందుకుంది. తెరవెనుక సంప్రదింపులూ జరుగుతూనే ఉన్నాయి.  ఒక రకంగా ఈ ట్రంప్ ఒత్తిడి, ఈ దేశాల భాగస్వామ్య స్థిరత్వాన్ని పరీక్షించింది. 

భారతదేశం తన స్వంత ప్రయోజనాలను మరింత స్పష్టంగా నొక్కి చెప్పవలసి వచ్చింది. అయితే, ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. అమెరికా భారతదేశాన్ని కలసి ఎదిగే భాగస్వామిగా కాకుండా, పూర్తిగా అదుపులో ఉంచుకోవలసిన పోటీదారుగా భావిస్తే, అది భారతదేశం యూరప్, రష్యాతో తన వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరచుకోవడానికీ, తన దౌత్య బంధాలను వైవిధ్యం చేసుకోవడానికీ, అవసరమైతే, వాణిజ్యపరంగా చైనాతో ఎంపిక చేసిన అవగాహనలను ఏర్పరచుకోవడానికి కూడా దారితీస్తుంది. 

విస్తృత దృక్కోణం

భారతదేశం పట్ల డొనాల్డ్ ట్రంప్ శిక్షాత్మక వైఖరి భావోద్వేగపరమైనది కాదు. ఇది అతను ప్రపంచంపట్ల విస్తృత దృక్పథంలో లెక్కలేసి తీసుకున్న చర్య. పోటీతత్వం, ఇచ్చిపుచ్చుకునేతనం, ఏ మొహమాటమూ లేకుండా అమెరికా ప్రయోజనం మాత్రమే ముఖ్యమైన వైఖరి ఇది. సుంకాలు, జీఎస్​పీ ప్రయోజనాల ఉపసంహరణ, బహిరంగంగా గట్టిగా మాట్లాడడం.. ఇవన్నీ ఒక క్రమంగా జరుగుతున్నాయి. ఆయన భాగస్వాములు నుంచి చాలా ఆశిస్తున్నాడు, రాబట్టుకోవడానికి చూస్తున్నాడు. 

ప్రత్యర్థిగా ఎదుగుతారన్న అనుమానం ఉన్నవారిని, ముందుగానే కట్టడి చేస్తున్నాడు. అందుకే భారత్ ప్రత్యర్థులైన పాక్ తో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. చైనా వంటి ప్రత్యర్థులకు బలమైన సందేశాలను పంపుతున్నాడు. ఈ ఎపిసోడ్ భారతదేశం నుంచి నేర్చుకోవాలి. 

అమెరికా కీలకమైన భాగస్వామిగా ఉంటుంది, భాగస్వామ్యం ఉన్నంత మాత్రాన ఒత్తిడి ఉండదని అనుకోనక్కర్లేదు ఇకపై. స్వతంత్ర్యమైన వ్యూహాత్మక వైఖరి, ఆర్థిక వైవిధ్యం, చర్చల్లో బలంగా నిలబడడం అనేవి రాబోయే దశాబ్దాల్లో భారత్​కు కీలకం. ప్రపంచ శక్తుల మహాక్రీడలో స్నేహాలూ, సెంటిమెంట్ల కంటే వ్యూహాలే కీలకం అవుతాయి. అది ట్రంప్​కి తెలుసు. భారత్ కూడా తెలుసుకోవాలి.

పాకిస్తాన్ అంశం, దక్షిణాసియాలో సమతుల్యత

ట్రంప్ హయాంలో అమెరికా-, భారత్ చర్చలెప్పుడూ పాకిస్తాన్ ప్రస్తావన లేకుండా ముగియవు. ఒక దశలో అమెరికా, ఆఫ్ఘనిస్తాన్‌‌ విషయంగా తాలిబన్లతో లోతైన చర్చల్లో నిమగ్నమై ఉంది. చర్చలను సులభతరం చేయడంలో, తాలిబన్లను ప్రభావితం చేయడంలో పాకిస్తాన్ సహకారం ఈ ప్రక్రియకు చాలా అవసరం. 

అప్పటి పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌తో  సమావేశాలు జరిపి, పాకిస్తాన్ పై బహిరంగంగా ప్రేమ ఒలకబోయడం అనేది ట్రంప్ లెక్కలేసి ప్రయోగించిన సామోపాయం. అదే సమయంలో 
భారత్​కి మరీ మేలు జరిగినట్టు చూపకుండా,  దక్షిణాసియాలో సమతుల్యత పాటించడం కోసం ప్రయత్నం దండోపాయం పన్నాడు ట్రంప్. 

యూఎస్-,  పాకిస్తాన్ సంబంధం చారిత్రాత్మకంగా లావాదేవీలపై ఆధారపడ్డప్పటికీ,  ఇస్లామాబాద్​తో  సన్నిహితంగా ఉంటూ,  భారత్ దక్షిణాసియాలో తిరుగులేని శక్తిగా ఎదగకుండా చూశాడు ట్రంప్. ఆ మేరకు ట్రంప్ దౌత్య వ్యూహంలో,  భారత్​పై పెడుతోన్న ఈ వాణిజ్య ఒత్తిడి కూడా ఒక భాగమే.

వ్యూహాత్మక ఒప్పందాల కోసం బేరసారాలు 

ట్రంప్ దౌత్యం పరపతి మీద నిర్మితమైంది. తరచుగా అది ఆర్థిక అసౌకర్యం రూపంలో వస్తుంది.  అధిక సుంకాలు,  వాణిజ్య ప్రాధాన్యతల ఉపసంహరణ,  బహిరంగ  విమర్శలు వంటివి భారతదేశాన్ని ఇతర రంగాలలో రాయితీలు, రక్షణ కొనుగోళ్లు, ఇంధన ఒప్పందాలు, అమెరికా కంపెనీలకు మార్కెట్ తెరవడం వైపు నెట్టడానికి సాధనాలు.  విషయం తేటగా తెలిసిపోతోంది. 

ఒకవైపు గట్టిగా నొక్కితే, ఎదుటి పక్షం కచ్చితంగా దారికి వచ్చి తన మాట విని ఒప్పందాలు చేసుకోవాలి. అదే అతని ఉద్దేశం. ఆ ప్రకారం, ట్రంప్ వేసే శిక్షల్లాంటి సుంకాలు, ప్రస్తుత వాణిజ్య అసమతుల్యత గురించే కాక, భవిష్యత్తులో జరగబోయే చర్చల్లో తమకు బలం ఉండేలా చూసుకునే సాధనాలు కూడా. ఉదాహరణకు ట్రంప్ ఒకవైపు​ సుంకాలను పెంచుతున్న సమయంలోనే… భారతదేశం, అమెరికా నుంచి మరింత ఆయిల్, ఎల్ఎన్జీ కొనేలా, యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల.. రక్షణ ఒప్పందాలు చేసుకునేలా, ఇ–కామర్స్, వ్యవసాయ రంగాల్లో భాగస్వామ్యం పెరిగేలా ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది అమెరికా.

- కె. కృష్ణ సాగర్ రావు,హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సర్టిఫైడ్ స్ట్రేటజిస్ట్-