- అమెరికాతో ట్రేడ్ డీల్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
- ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మన రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
- ఎప్‌స్టీన్ ఫైల్స్ బయటపడొద్దని ప్రధాని మోదీ లొంగిపోయారుతన ఇమేజ్ దెబ్బతింటుందని భయపడిపోతున్నారు
- అందుకే ఆగమేఘాల మీద డీల్‌పై సంతకం చేశారు
- 4 నెలలుగా నిలిచిన ఒప్పందం.. అకస్మాత్తుగా ఎలా ఖరారైందని ప్రశ్న
న్యూఢిల్లీ: ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా ఒత్తిడికి ప్రధాని నరేంద్ర మోదీ తలొగ్గారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని రాజీపడ్డారని, ఈ ఒప్పందం ద్వారా మన రైతుల ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శించారు. చైనా అంశం, ఆర్మీ మాజీ చీఫ్ నరవణె పుస్తకంలోని అంశాలపై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో మంగళవారం రాహుల్ గాంధీ పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు.
అమెరికా ఒత్తిడితోనే ట్రేడ్ డీల్‌పై సంతకం చేశారని, తన ఇమేజ్ దెబ్బతింటుందని ప్రధాని భయపడుతున్నారని అన్నారు. ‘‘మోదీ కంగారుపడుతున్నారు. 4 నెలలుగా నిలిచిపోయిన (భారత్ –-అమెరికా) వాణిజ్య ఒప్పందంపై నరేంద్ర మోదీ సోమవారం రాత్రి ఆగమేఘాల మీద సంతకం చేశారు. ఆయనపై విపరీతమైన ఒత్తిడి ఉంది. మోదీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది” అని వ్యాఖ్యానించారు. అమెరికాలో వ్యాపారవేత్త అదానీపై కేసులాంటి వ్యవహారాలు దీనికి కారణమని పేర్కొన్నారు. ‘‘మోదీ భయపడుతున్నారు.. ఎందుకంటే ఎవరైతే ఆయన ఇమేజ్‌ను నిర్మించారో, వారే ఇప్పుడు ఆ ఇమేజ్‌ను కూల్చేస్తున్నారు. అమెరికాలో అదానీపై ఉన్న కేసు, నిజానికి అది మోదీపై ఉన్న కేసే.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అమెరికా ఇంకా బయటపెట్టని అంశాలు చాలా ఉన్నాయి. దానివల్ల కూడా మోదీపై ఒత్తిడి ఉంది. ఇవే ఆ రెండు ఒత్తిడి పాయింట్లు. దేశం దీనిని అర్థం చేసుకోవాలి” అని అన్నారు.
లోక్ సభలో ప్రతిపక్షనేతను అడ్డుకోవడందేశ చరిత్రలో ఇదే మొదటిసారి..
ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె రాసిన ఆత్మకథలోని అంశాలపై లోక్‌సభలో రెండో రోజూ గందరగోళం కొనసాగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కూడా రాహుల్ స్పందించారు. ప్రభుత్వం తనను మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు ఓ ప్రతిపక్ష నేతకు అనుమతి ఇవ్వకపోవడం చరిత్రలోనే ఇది మొదటిసారి అని అన్నారు. నరవణె రాసిన ఆత్మకథను ఉటంకిస్తూ తాను ప్రస్తావించిన అంశాలతో కూడిన కథనం ప్రతిని అథెంటికేట్ చేసినట్లు చెప్పారు. ఎంపీలు ఏదైనా డాక్యుమెంట్‌ను ధ్రువీకరించాలంటే.. తమకు తెలిసినంత వరకు అందులోని విషయాలు సరైనవేనని పేర్కొంటూ సంతకం చేసిన కాపీని సమర్పించాల్సి ఉంటుందన్నారు. అయినా.. తనకు మాట్లాడేందుకు పర్మిషన్ ఇవ్వలేదని మండిపడ్డారు.
