అబుదాబి: రెండు పెద్ద జట్లపై నిరాశాజనక పెర్ఫామెన్స్‌తో నాకౌట్ ఆశలను క్లిష్టం చేసుకున్న ఇండియా టీమ్.. టీ20 వరల్డ్‌కప్‌లో పసికూనలతో పోరుకు సిద్ధమైంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు మ్యాచ్‌ల మధ్య వారం బ్రేక్ వచ్చినా.. టాలెంటెడ్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నా.. ఇప్పటివరకు కరెక్ట్ ఫైనల్ ఎలెవన్‌ను విరాట్ సెట్ చేసుకోలేకపోయాడు. అయితే రాబోయే మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి, ఇతర మ్యాచ్‌ల రిజల్ట్ అనుకూలంగా వస్తే, సెమీస్ బెర్త్ దక్కే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్న నేపథ్యంలో.. సరైన టీమ్‌ను సెట్ చేసుకోవాలని భావిస్తున్నాడు. అయితే ఇందులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఏం చేస్తాడన్న దానిపైనే ఉత్కంఠ మొదలైంది.
కాంబినేషన్ ఎలా..
కెప్టెన్‌గా విరాట్‌కు మిగిలిన మ్యాచ్‌లు మూడే. ఇందులో అన్ని చిన్న జట్లపైనే ఆడాల్సిన పరిస్థితి. దీంతో అశ్విన్ సత్తాను ఇప్పుడైనా ఉపయోగించుకుంటాడా? లేక పాత టీమ్‌ను కంటిన్యూ చేస్తాడా? అన్నది తేలాల్సి ఉంది. వరల్డ్ క్రికెట్లో బెస్ట్ స్పిన్నర్ అయిన అశ్విన్... దాదాపు నాలుగేళ్ల తర్వాత వైట్‌బాల్ టీమ్‌లోకి వచ్చాడు. కానీ ఫైనల్ ఎలెవన్‌లోకి మాత్రం రాలేకపోతున్నాడు. అయితే రాబోయే మూడు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాల్సిన తరుణంలో అశ్విన్‌ను ఆడిస్తే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రెజర్ సిచ్యువేషన్స్‌ను మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. కాబట్టి అశ్విన్ అనుభవం ఇక్కడ పనికొస్తుందని విశ్లేషిస్తున్నారు. టాలెంట్, స్కిల్స్ పరంగా టీమ్‌లో ఇప్పుడున్న స్పిన్నర్లు అశ్విన్‌కు దారిదాపుల్లోకి రాలేరు. పైగా, అఫ్గాన్ బ్యాటర్లు ఇప్పటివరకు అశ్విన్‌ను ఎదుర్కొలేదు. ఈ మ్యాచ్‌లో ఇండియాకు ఇది పాజిటివ్‌గా మారుతుందని అందరూ భావిస్తున్నారు. అఫ్గాన్ బ్యాటర్లలో చాలా మందికి సరైన ఫుట్‌వర్క్ లేకపోవడం కూడా కలిసొస్తుందని వాదన. దీనికితోడు అశ్విన్‌ను తీసుకుంటే బయట వినిపిస్తున్న విమర్శలు కూడా కాస్త తగ్గుతాయి. మిగతా బౌలర్లలో జడేజా, శార్దూల్, షమీ, బుమ్రా ప్లేస్‌లు ఖాయం. బ్యాటింగ్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కాకపోతే రోహిత్‌కు తోడుగా ఇషాన్‌ను పంపి, రాహుల్‌ను నాలుగో ప్లేస్‌లో దించనున్నారు. హార్దిక్‌పై ఎప్పటిలాగే ప్రెజర్ కంటిన్యూ కానుంది. ఓవరాల్‌గా అఫ్గాన్‌ను పసికూనగా భావిస్తే మాత్రం ఈ మ్యాచ్‌లోనూ ఇండియాకు తలనొప్పులు తప్పవు.
రషీద్‌తో ముప్పు..
టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన అఫ్గాన్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. భారీ షాట్లు కొట్టగల హిట్టర్లు అందుబాటులో ఉన్నారు. కెప్టెన్ నబీతో పాటు జజాయ్, షెజాద్ నిలబడితే భారీ స్కోరు ఖాయం. మిడిలార్డర్లో గుర్బాజ్, షాహిది కూడా సత్తా ఉన్నోళ్లే. బ్యాటింగ్‌తో పోలిస్తే అఫ్గానిస్తాన్ బౌలింగ్ ఇంకాస్త బలంగా కనిపిస్తున్నది. యూఏఈ పిచ్‌లపై స్టార్ స్పిన్నర్ రషీద్‌తో ఏ జట్టుకైనా ముప్పు తప్పదు. మిడిల్ మ్యాచ్‌ను అతను అద్భుతంగా కంట్రోలు చేస్తుంటాడు. అతనికి తోడుగా ముజీబ్ రెహమాన్ సత్తా చాటితే అఫ్గాన్‌కు తిరుగుండదు. ఈ ఇద్దరికి ఇండియా బ్యాటర్లపై ఆడిన అనుభవం ఉండటం అదనపు ప్రయోజనం కానుంది. న్యూ బాల్ బౌలర్లు హమీద్ హసన్, నవీన్ కూడా ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దర్ని దీటుగా ఎదుర్కొవాలంటే ఇండియా టాపార్డర్ బ్యాటర్లు కాస్త శ్రమించాల్సిందే.