క్రికెట్‌‌కు పాండ్యా లాంటి సూపర్‌స్టార్స్ కావాలి

క్రికెట్‌‌కు పాండ్యా లాంటి సూపర్‌స్టార్స్ కావాలి

సిడ్నీ: టీమిండియా ఆస్ట్రేలియా టూర్ రసవత్తరంగా సాగుతోంది. వన్డే సిరీస్‌‌ను కోల్పోయిన భారత్.. అద్భుత ఆటతీరుతో టీ20 సిరీస్‌‌ను చేజిక్కించుకుంది. పొట్టి ఫార్మాట్‌‌లో తమ ఆటతీరుతో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, నటరాజన్ లాంటి ప్లేయర్లు ఆసీస్‌‌ను కంగారెత్తించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా పించ్ హిట్టింగ్‌తో దుమ్మురేపాడు. పాండ్యా బ్యాటింగ్‌‌పై ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. తదుపరి జరిగే టెస్ట్ సిరీస్‌లో పాండ్యాను టీమిండియా తరఫున ఆడించాలని వార్న్ సూచించాడు.

‘భారత టెస్ట్ జట్టులో హార్దిక్ పాండ్యాను తప్పకుండా ఆడించాలి. సహచర ఆటగాళ్లలో ఉత్సాహం నింపగల సామర్థ్యం పాండ్యాలో ఉంది. తద్వారా మొత్తం జట్టు సానుకూలతో నిండిపోతుంది. క్రికెట్‌‌కు అతడి లాంటి వ్యక్తిత్వం కలిగిన సూపర్‌‌స్టార్ల అవసరం చాలా ఉంది. ఇదే నిజం’ అని వార్న్ ట్వీట్ చేశాడు. టెస్ట్ జట్టులో పాండ్యాను చేర్చాలని టీమిండియా మాజీ బ్యాట్స్‌‌మన్ మహ్మద్ కైఫ్ కూడా చెప్పాడు.