డ్యూక్స్‌‌‌‌ బాల్స్‌‌‌‌ క్వాలిటీపై విచారణ

డ్యూక్స్‌‌‌‌ బాల్స్‌‌‌‌ క్వాలిటీపై విచారణ

లండన్‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌–ఇండియా టెస్టు సిరీస్‌‌‌‌లో వాడుతున్న డ్యూక్స్‌‌‌‌ బాల్ క్వాలిటీపై  విమర్శలు, ఫిర్యాదులు రావడంతో వాటిని తయారు చేసే కంపెనీ విచారణకు ఆదేశించింది. ఈ బాల్స్‌‌‌‌ త్వరగా మెత్తబడి ఆకారం కోల్పోతున్నాయని క్రికెటర్లు, అంపైర్లు చెబుతున్నారు. దాంతో ఆట మధ్యలో అంపైర్లు తరచుగా బంతులను మార్చాల్సి వస్తోంది. ముఖ్యంగా 30 ఓవర్ల తర్వాత బాల్స్‌‌‌‌ పాడైపోతున్నాయి. ఇండియా కెప్టెన్ శుభ్‌‌‌‌మన్ గిల్​తోపాటు ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ వీటి నాణ్యతను ప్రశ్నించారు. ఈనేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ వారం చివరికల్లా వాడిన బంతులను సేకరించి, వాటిని  తయారు చేసే సంస్థ బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్​కు తిరిగి పంపనుంది. ఆ బాల్స్‌‌‌‌ను పరిశీలిస్తామని సదరు కంపెనీ ఓనర్ దిలీప్ జజోడియా తెలిపారు.  

వాటిని తయారు చేయడానికి వాడిన ముడిసరు నుంచి తయారీ విధానం వరకు ప్రతీ అంశాన్ని పూర్తిగా  పరిశీలించి ఏమైనా మార్పులు అవసరం అయితే తప్పకుండా చేస్తామని చెప్పారు.  లార్డ్స్ టెస్టులో రెండో రోజు ఆట మొదలైన కొద్దిసేపటికే కొత్త బంతిని మార్చాల్సి వచ్చింది. జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా ఆ బాల్‌‌‌‌తో మూడు వికెట్లు తీసినా, దాన్ని మార్చిన తర్వాత ఇండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీనిపై శుభ్‌‌‌‌మన్ గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్రాడ్ కూడా మార్చిన బంతి సరిగా లేదని విమర్శించాడు. కాగా, టెస్ట్ మ్యాచ్‌‌‌‌ల్లో ఏ బంతిని వాడాలనేది ఆతిథ్య దేశ క్రికెట్ బోర్డు నిర్ణయిస్తుంది. ఇంగ్లండ్‌‌‌‌లో డ్యూక్స్, ఇండియాలో ఎస్జీ బాల్‌‌‌‌, ఆస్ట్రేలియాలో కూకబురా బంతిని ఉపయోగిస్తారు. 1760 నుంచి డ్యూక్స్ బంతులను తయారు చేస్తున్నప్పటికీ ఈ మధ్యే  టెస్టులు, కౌంటీల్లో వాటి నాణ్యతపై ఫిర్యాదులు 

వస్తున్నాయి.