- కోహ్లీ, రోహిత్‌పైనే ఫోకస్.. మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
వడోదరా: టీ20 వరల్డ్ కప్‌కు నెల రోజుల సమయమే మిగిలి ఉన్నా.. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు టీమిండియా రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే తొలి వన్డేలో గెలిచి సిరీస్‌కు అదిరిపోయే ఆరంభాన్నివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రాబోయే వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగాలనే ఏకైక లక్ష్యంతో ఆడుతున్న సూపర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ సిరీస్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. విజయ్ హజారే ట్రోఫీలో చెరో రెండు మ్యాచ్‌లు ఆడిన రో–కో ద్వయం మంచి ఫామ్‌లో ఉన్నారు. ఏడు రోజుల వ్యవధిలో మూడు వన్డేలు ఆడనుండటంతో అందరి దృష్టి ఈ ఇద్దరిపైనే నెలకొంది. అయితే టీ20 వరల్డ్ కప్ జట్టుకు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై కూడా ఉత్కంఠ నెలకొంది. గాయాల కారణంగా గతేడాది సౌతాఫ్రికాతో సిరీస్ నుంచి గిల్ ఎక్కువగా రెస్ట్‌లోనే ఉన్నాడు. ఫలితంగా అతని ఫామ్‌పై కూడా ఆందోళన కనిపిస్తోంది. గిల్ రాకతో టాప్ ఆర్డర్‌లో యశస్వి జైస్వాల్‌కు చోటు కష్టంగా మారింది. ప్లీహం గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ నాలుగో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ప్లేస్ ఖాయం కావడంతో రిషబ్ పంత్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. టీ20 వరల్డ్ కప్ కోసం బుమ్రా, హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇవ్వడంతో పేస్ బౌలింగ్ బాధ్యతలను సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణకు వదిలేశారు. కుల్దీప్ యాదవ్, సుందర్, జడేజా స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. మంచు, ఫ్లాట్ పిచ్ కారణంగా వికెట్లు తీయడం కంటే రన్స్ నిరోధించడం పైనే బౌలర్లు ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. కోటంబి స్టేడియంలో మెన్స్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కావడంతో పిచ్ స్వభావాన్ని ఇంకా అంచనా వేయలేకపోతున్నారు.
బ్యాటర్లపైనే భారం..
ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ ద్వితీయ శ్రేణి ప్లేయర్లను పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండియా సంతతికి చెందిన 23 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్‌పై దృష్టి నెలకొంది. టెస్ట్ సిరీస్‌లో 3–0తో ఇండియాను ఓడించిన కివీస్ ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ టీమిండియాపై కివీస్ వన్డే రికార్డు ఏమాత్రం బాగాలేదు. ఇక రకరకాల కారణాలతో మిచెల్ శాంట్నర్, టామ్ లాథమ్, విలియమ్సన్ జట్టుకు దూరం కావడం మైనస్‌గా మారింది. రాచిన్ రవీంద్ర, పేసర్ జాకబ్ డఫీకి రెస్ట్ ఇచ్చారు. శాంట్నర్ ప్లేస్‌లో కెప్టెన్సీ చేపట్టిన బ్రేస్‌వెల్ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. ఆల్‌రౌండర్ జెమీసన్, నిక్ కెల్లీతో పాటు డేవన్ కాన్వే, మిచెల్, నికోల్స్, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్‌పై బ్యాటింగ్ భారం ఆధారపడి ఉంది. వీళ్లు చెలరేగితే భారీ స్కోరు ఖాయం.
జట్ల (అంచనా)
ఇండియా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సుందర్, జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్.
న్యూజిలాండ్: మైకేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), డేవన్ కాన్వే, నిక్ కెల్లీ, విల్ యంగ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, జాక్ ఫౌల్కేస్, జెమీసన్,
మైకేల్ రే, ఆదిత్య అశోక్.
