కోహ్లీ విజృంభణ.. తొలి వన్డేలో టీమిండియాదే విజయం

కోహ్లీ విజృంభణ..  తొలి వన్డేలో టీమిండియాదే విజయం
  •    4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌‌‌‌ ఓటమి
  •     రాణించిన గిల్‌‌‌‌, శ్రేయస్‌‌‌‌, రాహుల్‌‌‌‌
  •     మిచెల్‌‌‌‌, నికోల్స్‌‌‌‌, కాన్వే శ్రమ వృథా

వడోదరా: కొత్త ఏడాదిని టీమిండియా సరికొత్త విజయంతో ఆరంభించింది. కింగ్‌‌‌‌ కోహ్లీ (91 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 93) తన ఛేజింగ్‌‌‌‌ మార్క్‌‌‌‌ను మరోసారి చూపెట్టడంతో.. ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఇండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌‌‌‌పై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన న్యూజిలాండ్‌‌‌‌ 50 ఓవర్లలో 300/8 స్కోరు చేసింది. డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ (71 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 84), హెన్రీ నికోల్స్‌‌‌‌ (69 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లతో 62), డేవన్‌‌‌‌ కాన్వే (67 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 56) హాఫ్‌‌‌‌ సెంచరీలతో చెలరేగారు. తర్వాత ఇండియా 49 ఓవర్లలో 306/6 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (71 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 56) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కోహ్లీకి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం రాజ్‌‌‌‌కోట్‌‌‌‌లో జరుగుతుంది. కుడి వైపు పొట్ట ప్రాంతంలో నొప్పి కారణంగా రిషబ్​ పంత్​ ఈ సిరీస్​కు దూరమయ్యాడు. అతని ప్లేస్​లో ధ్రువ్​ జురెల్​ను తీసుకున్నారు. 

మిచెల్‌‌‌‌ మెరుపులు..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన న్యూజిలాండ్‌‌‌‌కు ఓపెనర్లు కాన్వే, నికోల్స్‌‌‌‌ మంచి ఆరంభానివ్వగా.. చివర్లో మిచెల్ మంచి స్కోరు అందించాడు. ఆరంభంలో కాన్వే ఫోర్‌‌‌‌తో టచ్‌‌‌‌లోకి రాగా, నికోల్స్‌‌‌‌ మాత్రం కాస్త సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత స్వీప్‌‌‌‌ షాట్‌‌‌‌తో ఫోర్‌‌‌‌ కొట్టాడు. వీరిద్దరు స్వీప్‌‌‌‌, రివర్స్‌‌‌‌ స్వీప్‌‌‌‌లతో ఇండియా బౌలర్లపై పట్టు బిగించారు. స్ట్రయిక్‌‌‌‌ను రొటేట్‌‌‌‌ చేస్తూ పవర్‌‌‌‌ప్లేలో 49/0 స్కోరు చేశారు. ఫీల్డింగ్‌‌‌‌ పెరిగిన తర్వాత కూడా వీరిద్దరు స్వేచ్ఛగా షాట్లు ఆడారు. వీళ్లను విడదీసేందుకు గిల్‌‌‌‌ ప్రయోగించిన బౌలర్లు పెద్దగా సక్సెస్‌‌‌‌ కాలేదు. దాదాపు 21 ఓవర్లు వీళ్లు క్రీజులో పాతుకుపోయారు. చెరో 60 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీలు సాధించారు. అయితే రెండో స్పెల్‌‌‌‌కు దిగిన హర్షిత్‌‌‌‌ రాణా (2/65) తన వరుస ఓవర్లలో డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. 22వ ఓవర్‌‌‌‌లో బ్యాటర్‌‌‌‌కు దూరంగా ఫుల్‌‌‌‌ పేస్‌‌‌‌తో స్వింగ్‌‌‌‌ చేసిన బాల్‌‌‌‌ నికోల్స్‌‌‌‌ బ్యాట్‌‌‌‌ను టచ్‌‌‌‌ చేస్తూ కీపర్‌‌‌‌ రాహుల్‌‌‌‌ చేతుల్లోకి వెళ్లింది. దాంతో తొలి వికెట్‌‌‌‌కు 117 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. 24వ ఓవర్‌‌‌‌లో యాంగిల్‌‌‌‌ బాల్‌‌‌‌తో కాన్వేను క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేశాడు. స్కోరు 126/2గా మారింది. ఇక్కడి నుంచి సిరాజ్‌‌‌‌ (2/40), ప్రసిధ్‌‌‌‌ కృష్ణ (2/60), కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (1/52) జోరు చూపెట్టారు. ఓ ఎండ్‌‌‌‌లో మిచెల్‌‌‌‌ పాతుకుపోయినా.. రెండో ఎండ్‌‌‌‌లో వరుస విరామాల్లో విల్‌‌‌‌ యంగ్‌‌‌‌ (12), గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ (12), మిచెల్‌‌‌‌ హే (18)ను ఔట్‌‌‌‌ చేశారు. దాంతో కివీస్‌‌‌‌ 198/5తో కష్టాల్లో పడింది. లాంగాన్‌‌‌‌ నుంచి శ్రేయస్‌‌‌‌ కొట్టిన డైరెక్ట్‌‌‌‌ త్రోకు కెప్టెన్‌‌‌‌ బ్రేస్‌‌‌‌వెల్‌‌‌‌ (16) రనౌటైనా.. మిచెల్‌‌‌‌తో ఆరో వికెట్‌‌‌‌కు 39 రన్స్‌‌‌‌ జత చేశాడు. ఆ వెంటనే జాక్‌‌‌‌ ఫోక్స్‌‌‌‌ (1)ను సిరాజ్‌‌‌‌ దెబ్బకొట్టాడు. నాలుగు బాల్స్‌‌‌‌ తేడాలో ఈ ఇద్దరు ఔట్‌‌‌‌కావడంతో కివీస్‌‌‌‌ స్కోరు 239/7గా మారింది. ఈ దశలో క్రిస్టియన్‌‌‌‌ క్లార్క్‌‌‌‌ (24 నాటౌట్‌‌‌‌) మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు. మిచెల్‌‌‌‌తో ఎనిమిదో వికెట్‌‌‌‌కు 42 రన్స్‌‌‌‌ జోడించాడు. 

రోహిత్‌‌‌‌ విఫలమైనా..

భారీ ఛేజింగ్‌‌‌‌లో ఇండియాకు సరైన ఆరంభం దక్కలేదు. హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ (26) తొమ్మిదో ఓవర్‌‌‌‌లోనే వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్‌‌‌‌ గిల్‌‌‌‌తో కలిసి విరాట్‌‌‌‌ అద్భుతంగా ఇన్నింగ్స్‌‌‌‌ను నిర్మించాడు. తొలుత సింగిల్స్‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేసి ఆ తర్వాత భారీ షాట్లకు తెరలేపాడు. ఈ క్రమంలో 44 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌‌‌‌లో నిలకడగా ఆడిన గిల్‌‌‌‌ 66 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ మార్క్‌‌‌‌ అందుకున్నాడు. అయితే రెండో వికెట్‌‌‌‌కు 118 రన్స్‌‌‌‌ జోడించి గిల్‌‌‌‌ ఔటైనా.. కోహ్లీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (49)తో కలిసి ఇన్నింగ్స్‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరు పోటీపడి బౌండ్రీలు బాదారు. సునాయసంగా సెంచరీ దిశగా దూసుకుపోయిన కోహ్లీని 40వ ఓవర్‌‌‌‌లో జెమీసన్‌‌‌‌ (4/41) దెబ్బకొట్టాడు. ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌ను భారీ షాట్‌‌‌‌ ఆడబోయిన విరాట్ మిడాఫ్‌‌‌‌లో బ్రేస్‌‌‌‌వెల్‌‌‌‌కు చిక్కాడు. మూడో వికెట్‌‌‌‌కు 77 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. మరో ఐదు రన్స్‌‌‌‌ తర్వాత జడేజా (4), మరో మూడు రన్స్‌‌‌‌ చేసి శ్రేయస్‌‌‌‌  వెనుదిరగడంతో స్కోరు 242/5గా మారింది. ఈ దశలో కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (29 నాటౌట్‌‌‌‌) కీలక ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు. హర్షిత్‌‌‌‌ రాణా (29)తో కలిసి ఆరో వికెట్‌‌‌‌కు 37 రన్స్‌‌‌‌ జత చేశాడు. చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నా సుందర్‌‌‌‌ (7 నాటౌట్‌‌‌‌) వికెట్‌‌‌‌ కాపాడుకోవడంతో మరో ఓవర్‌‌‌‌ మిగిలి ఉండగానే ఇండియా విజయాన్ని అందుకుంది. 

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌‌‌‌: 50 ఓవర్లలో 300/8 (మిచెల్‌‌‌‌ 84, నికోల్స్‌‌‌‌ 62, సిరాజ్‌‌‌‌ 2/40, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ 2/60). ఇండియా: 49 ఓవర్లలో 306/6 (కోహ్లీ 93, గిల్‌‌‌‌ 56, శ్రేయస్‌‌‌‌ 49, జెమీసన్‌‌‌‌ 4/41). 

అన్ని ఫార్మాట్లలో (557 మ్యాచ్‌‌‌‌ల్లో 624 ఇన్నింగ్స్‌‌‌‌) కలిపి అతి వేగంగా 28 వేల రన్స్‌‌‌‌ చేసిన తొలి బ్యాటర్‌‌‌‌గా విరాట్‌‌‌‌ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్‌‌‌‌ (644 ఇన్నింగ్స్‌‌‌‌) ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ రికార్డును బ్రేక్‌‌‌‌ చేశాడు. ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో అత్యధిక రన్స్‌‌‌‌ చేసిన రెండో బ్యాటర్‌‌‌‌గానూ కోహ్లీ (28,068) రికార్డులకెక్కాడు. సంగక్కర (28,016)ను మూడో ప్లేస్‌‌‌‌కు నెట్టాడు. సచిన్‌‌‌‌ (34,357) టాప్‌‌‌‌లో ఉన్నాడు. 

ఇండియా తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఐదో బ్యాటర్‌‌‌‌గా విరాట్‌‌‌‌ కోహ్లీ (309) నిలిచాడు. గంగూలీ (308)ని అధిగమించాడు. సచిన్‌‌‌‌ (463), ధోనీ (347), ద్రవిడ్‌‌‌‌ (340), అజారుద్దీన్‌‌‌‌ (334) ముందున్నారు.