ఇండియా, సౌతాఫ్రికా జట్లు రెండో వన్డే ఆడుతున్నాయి. బుధవారం (డిసెంబర్ 3) రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా మళ్లీ టాస్ ఓడిపోయింది. టాస్ ఓడిపోవడంలో టీమిండియా రికార్డ్ సృష్టించేలా ఉంది. ఇప్పటికి వరుసగా 20 వన్డేల్లో టీమిండియా టాస్ ఓడిపోవడంతో ఫ్యాన్స్ మనకేంటీ టాస్ గండం అని నిట్టూరుస్తున్నారు. 2023లో అహ్మదాబాద్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నుంచి టీమిండియా వన్డేల్లో టాస్ ఓడిపోతూనే ఉండటం గమనార్హం.
తొలి వన్డేలో గెలిచి ఊపు మీదున్న టీమిండియా రెండో వన్డేలో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. సేమ్ టీంతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికా జట్టులో మూడు మార్పులు చేసింది. తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ బవుమా ఈ వన్డేలో ఆడుతున్నాడు. కేశవ్ మహరాజ్, లుంగీ ఎంగిడీ జట్టులోకి వచ్చారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇండియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో నిలిచింది. నేడు జరగబోయే రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రాహుల్ సేన భావిస్తుంటే.. మరోవైపు సఫారీలు ఈ మ్యాచ్లో భారత్కు షాక్ ఇవ్వాలని కసి మీద ఉన్నారు.
తొలి వన్డేలో సీనియర్ ప్లేయర్స్ కోహ్లీ, రోహిత్ శర్మ సత్తా చాటారు. కోహ్లీ సెంచరీతో దుమ్ములేపితే.. రోహిత్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. యంగ్ ప్లేయర్స్ యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్లో రాణించడం అత్యంత కీలకంగా మారింది. వీరిద్దరికి ఈ మ్యాచ్ డూ ఆర్ డై కానుంది. బౌలింగ్లో కుల్దీప్ అద్భుతంగా రాణిస్తుండగా.. పేసర్లు హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్ మెరుగవ్వాల్సి ఉంది.
