​ ఇవాళ సౌతాఫ్రికాతో నాలుగో టీ20

​ ఇవాళ సౌతాఫ్రికాతో నాలుగో టీ20

రాజ్‌‌కోట్‌‌:  వరుసగా రెండు ఓటముల తర్వాత వైజాగ్‌‌లో గెలిచి సిరీస్‌‌లో నిలిచిన టీమిండియా మరో విజయంపై గురి పెట్టింది. ఐదు టీ20ల సిరీస్‌‌లో భాగంగా శుక్రవారం జరిగే నాలుగో మ్యాచ్‌‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌‌ను 2–2తో సమం చేయాలని చూస్తోంది. మొదటి మ్యాచ్‌‌లో బౌలింగ్‌‌లో, రెండో పోరులో బ్యాటింగ్‌‌లో తేలిపోయిన రిషబ్‌‌ పంత్‌‌ కెప్టెన్సీలోని ఇండియా వైజాగ్‌‌లో మాత్రం ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో మెప్పించింది. మరో సారి అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. అయితే, కెప్టెన్‌‌ పంత్‌‌ ఫామ్‌‌ ఒక్కటే టీమ్‌‌ను కలవరపెడుతోంది. మూడు ఇన్నింగ్స్‌‌ల్లో వరుసగా 29, 5, 6 స్కోర్లతో పంత్‌‌ నిరాశపరిచాడు. అతని ఫెయిల్యూర్‌‌ మిడిల్‌‌ ఓవర్లలో టీమ్‌‌ను దెబ్బతీస్తోంది. అయితే, అన్ని ఫార్మాట్లలోనూ ఇలా తడబడ్డ ప్రతీసారి గొప్పగా పుంజుకోవడం పంత్‌‌కు అలవాటు. ఈ నేపథ్యంలో కచ్చితంగా నెగ్గాల్సిన ఈ మ్యాచ్‌‌లో  అతని నుంచి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌‌ను అంతా ఆశిస్తున్నారు.

ఈ సిరీస్‌‌లో తన హిట్టింగ్‌‌ జోన్‌‌లోకి బాల్స్‌‌ను కొడుతూ రిషబ్​ డీప్‌‌లో క్యాచ్‌‌లు ఇస్తున్నాడు. సాధారణంగా పంత్‌‌  కౌ కార్నర్‌‌ మీదుగా షాట్లు ఆడేందుకు ఇష్టపడతాడు. కానీ, సఫారీ బౌలర్లు వైడ్‌‌ లైన్‌‌పై బౌలింగ్‌‌ చేస్తూ అతనికి ఆ చాన్స్‌‌ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రిషబ్‌‌ కాస్త ఓపిక పట్టడంతో పాటు తెలివిగా ఆడితే మంచిది. ఇక, తొలి రెండు మ్యాచ్‌‌ల్లో నిరాశపరిచిన ఓపెనర్‌‌ రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ వైజాగ్‌‌లో ఫిఫ్టీ కొట్టి  టీమ్‌‌లో తన ప్లేస్‌‌ను నిలబెట్టుకున్నాడు. మరో ఓపెనర్‌‌ ఇషాన్‌‌ కిషన్‌‌ కూడా ఫామ్‌‌లో ఉన్నాడు కాబట్టి టాపార్డర్‌‌లో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇషాన్‌‌ ఇదే జోరు కొనసాగిస్తే ఈ సిరీస్‌‌లో టీమ్‌‌ను ముందుకు తీసుకెళ్లడంతో  పాటు ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌లో  ఇండియా రిజర్వ్‌‌ ఓపెనర్‌‌  బెర్తు అందుకుంటాడు. రెగ్యులర్‌‌ ఓపెనర్లు తిరిగి వచ్చేముందు ఈ సిరీస్‌‌లో మిగిలిన రెండు మ్యాచ్‌‌లతో పాటు ఐర్లాండ్‌‌ టూర్‌‌లో మరో రెండు టీ20లు ఇషాన్‌‌,  గైక్వాడ్‌‌కు కీలకం కానున్నాయి. ఇక, ఈ సిరీస్‌‌లో సఫారీ బౌలర్ల షార్ట్‌‌ బాల్స్‌‌ పరీక్ష ఎదుర్కొంటున్న వన్​డౌన్​ బ్యాటర్​ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ తన స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్ ఇంకా చేయలేదు. ఈ మ్యాచ్‌‌లో అయినా విన్నింగ్​ రన్స్‌‌ అందించాలని తను కోరుకుంటున్నాడు. శ్రేయస్‌‌, పంత్‌‌ తొందరగా ఔటవడంతో వైజాగ్‌‌లో మిడిల్‌‌ ఓవర్లలో ఇబ్బంది పడ్డ టీమ్‌‌ను హార్దిక్‌‌ పాండ్యా ఆదుకోవడంతో మంచి స్కోరు సాధ్యమైంది. రాజ్​కోట్​లో హార్దిక్‌‌తో పాటు అయ్యర్‌‌, పంత్‌‌ రాణిస్తే మిడిల్‌‌ సమస్యలకు చెక్‌‌ పెట్టొచ్చు. ఐర్లాండ్‌‌ టూర్‌‌కు కెప్టెన్‌‌గా ఎంపికైన సంతోషంలో ఉన్న పాండ్యా మరింత జోరు పెంచితే జట్టు విజయం సులువు అవుతుంది. ఇక, తొలి రెండు మ్యాచ్‌‌ల్లో దెబ్బకొట్టిన స్పిన్నర్లు చహల్‌‌, అక్షర్‌‌ వైజాగ్‌‌లో గాడిలో పడటం జట్టుకు శుభపరిణామం. పేసర్లలో భువనేశ్వర్‌‌ అద్భుతంగా బౌలింగ్‌‌ చేస్తుండగా.. గత పోరులో హర్షల్‌‌ పటేల్‌‌ నాలుగు వికెట్లతో టచ్‌‌లోకి రావడంతో పేస్‌‌ విభాగం కూడా బలంగా మారింది.  అయితే, మరో యువ పేసర్​  అవేశ్‌‌ ఖాన్‌‌ ఎక్కువ రన్స్‌‌ ఇస్తున్నాడు. మరి, మేనేజ్​మెంట్‌‌ అతనిపై  వేటు వేస్తుందో లేదంటే గత మ్యాచ్‌‌ విన్నింగ్‌‌ కాంబినేషన్‌‌ను కొనసాగిస్తుందో చూడాలి. 

బరిలోకి డికాక్‌! 

వైజాగ్‌లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని సౌతాఫ్రికా ఆశిస్తోంది. మూడో టీ20లో ఓడినా 2–1తో ఆధిక్యంలో ఉండటంతో ఆ జట్టు స్వేచ్ఛగా ఆడే చాన్సుంది. ఇక, స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌  మణికట్టు గాయం నుంచి కోలుకోవడం సఫారీలకు ప్లస్‌ పాయింట్‌. గురువారం జరిగిన నెట్‌ సెషన్‌లో డికాక్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. తను ఫిట్‌గా ఉంటే రీజా హెండ్రిక్స్‌ ప్లేస్‌లో తిరిగి టీమ్‌లోకి వస్తాడు. అప్పుడు సౌతాఫ్రికా బలం మరింత పెరుగుతుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన పర్యాటక జట్టు గత పోరులో బ్యాటింగ్‌లో తేలిపోయి... బౌలింగ్‌లోనూ నిరాశ పరిచింది. స్పిన్నర్లు షంసి, కేశవ్‌ ఓవర్‌కు పది రన్స్‌ ఇవ్వడం దెబ్బకొట్టింది. క్యాచింగ్‌ విషయంలోనూ సఫారీ టీమ్‌ మెరుగవ్వాలి.