సఫారీలతో సై..ఇవాళ తొలి టీ20

సఫారీలతో సై..ఇవాళ తొలి టీ20

ధర్మశాల:  వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌ కోసం సన్నాహకాలు మొదలు పెట్టిన టీమిండియా సొంతగడ్డపై కీలక సవాల్‌‌కు రెడీ అయింది. మూడు టీ20ల సిరీస్‌‌లో భాగంగా సౌతాఫ్రికాతో ఆదివారం ఇక్కడి హెచ్‌‌పీసీఏ మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. స్వదేశంలో సౌతాఫ్రికాపై పొట్టిఫార్మాట్‌‌లో  ఒక్క సిరీస్‌‌ కూడా నెగ్గలేకపోయిన ఇండియా.. ఈసారి ఆ లోటు తీర్చుకోవాలని  భావిస్తోంది. మరోవైపు తమకు అచ్చొచ్చిన ఫార్మాట్‌‌లో సత్తాచాటాలని ప్రొటీస్​ ఆశిస్తోంది.

టీమ్‌‌ కూర్పుపై కసరత్తు

టీ20 వరల్డ్‌‌కప్‌‌కు ఏడాది మాత్రమే సమయముంది. ఈ కాలంలో ఇండియాకు మరో 20 మ్యాచ్‌‌ల్లో మాత్రమే బరిలోకి దిగనుంది. ఈక్రమంలో అత్యుత్తమ తుది జట్టును ఎంచుకోవడంపై  కసరత్తులు చేస్తోంది. టీమ్‌‌లో కొన్ని స్థానాలకు సంబంధించి సమర్థులైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా నాలుగో నంబర్‌‌లో సరైన ఆటగాడు లేక వన్డే వరల్డ్‌‌కప్‌‌లో దెబ్బతిన్న టీమిండియా మరోసారి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తపడుతోంది. మనీష్​ పాండేతో పోటీ ఉన్నా నాలుగో నంబర్‌‌లో విండీస్‌‌ టూర్‌‌లో ఆకట్టుకున్న శ్రేయస్‌‌ అయ్యర్‌‌కే ఓటు పడొచ్చు. ఓపెనర్లలో రోహిత్‌‌ శర్మ ఫస్ట్‌‌ చాయిస్‌‌ కాగా అతనికి జోడీగా శిఖర్‌‌ ధవన్‌‌ బరిలోకి దిగే చాన్సుంది. వరల్డ్‌‌కప్‌‌ తర్వాత రెండునెలల విరామంలో  ఫుల్‌‌ చార్జ్‌‌ అయిన స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా  రీ ఎంట్రీ ఇస్తున్నాడు.  వికెట్‌‌కీపర్‌‌గా రిషబ్‌‌ పంత్‌‌ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది.  విండీస్‌‌ టూర్‌‌లో  పదే పదే నిర్లక్ష్యపు షాట్లకు ఔటైన పంత్‌‌ బాధ్యతాయుతంగా ఆడకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదు. పిచ్‌‌ పరిస్థితిని బట్టి భారీ హిట్టర్‌‌ అయిన స్పిన్‌‌ ఆల్‌‌రౌండర్‌‌  క్రునాల్‌‌ పాండ్యాకు జట్టులో చోటు ఖాయమే. సౌతాఫ్రికా జట్టులో లెఫ్టాండర్లు ఎక్కువ ఉండడంతోపాటు ఇటీవల విండీస్‌‌, సౌతాఫ్రికా–ఎ జట్లపై రాణించిన వాషింగ్టన్‌‌ సుందర్‌‌కు కూడా తుదిజట్టులో చోటు దక్కొచ్చు. ఈ సిరీస్‌‌కు స్టార్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో  యువ పేసర్లపైనే జట్టు భారం ఉంచింది. విండీస్‌‌లో అదరగొట్టిన నవదీప్‌‌ సైనీకి చోటు ఖాయం కాగా.. దీపక్‌‌ చహర్‌‌, ఖలీల్‌‌ అహ్మద్‌‌లో ఒకరు తుదిజట్టులో ఆడనున్నారు.

డికాక్‌‌పైనే భారం

వన్డే వరల్డ్‌‌కప్‌‌లో చెత్తాట తర్వాత సౌతాఫ్రికా కూడా వచ్చే టీ20 ప్రపంచకప్‌‌పై దృష్టి పెట్టింది. ప్రధాన ఆటగాళ్లు రిటైర్‌‌ కావడంతో ప్రస్తుతం సంధి దశలో ఉన్న సౌతాఫ్రికా టీమ్‌‌ భారాన్ని స్టార్‌‌ ప్లేయర్‌‌, కీపర్‌‌ క్వింటన్‌‌ డికాక్‌‌ మోస్తున్నాడు. కెప్టెన్‌‌గా ప్రమోటైన అతను వచ్చే వరల్డ్‌‌కప్‌‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును సిద్ధం చేయాలని చూస్తున్నాడు. అయితే హషీమ్‌‌ ఆమ్లా, జేపీ డుమిని, ఇమ్రాన్‌‌ తాహిర్‌‌  రిటైరవగా..   టెస్టు సిరీస్‌‌కు మాత్రమే అందుబాటులో ఉన్న  డుప్లెసిస్‌‌ అండ కూడా జట్టుకు లేకుండా పోయింది.  ఈక్రమంలో డికాక్‌‌, డేవిడ్‌‌ మిల్లర్‌‌, కగిసో రబాడ పైనే అందరి దృష్టి ఉంది.

వాండర్‌‌ డుసేన్‌‌ , పెహుల్‌‌క్వాయో రాణించాలని టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కోరుకుంటోంది. టెంబా బవూమ, ఆన్రిచ్‌‌ నోర్జ్‌‌ లాంటి ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌‌లో అరంగేట్రం చేయనున్నారు. ఇక గతంలో రోహిత్‌‌ను  ఏడు బంతుల్లో మూడు సార్లు ఔట్​ చేసిన సీమర్‌‌ జూనియర్‌‌ డలా నుంచి మరోసారి అలాంటి ఆటతీరునే టీమ్‌‌ ఆశిస్తోంది. ఈ టూర్‌‌కు ముందు కొంతమంది ఆటగాళ్ల కోసం బెంగళూరులో గత నెలలో స్పిన్‌‌ క్యాంప్‌‌ ఏర్పాటు చేసింది. ఈ టూర్‌‌ కోసమే ఇండియా మాజీ ప్లేయర్‌‌ అమోల్‌‌ ముజుందార్‌‌ను బ్యాటింగ్‌‌ కోచ్‌‌గా నియమించుకుంది. ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలితాన్నిస్తాయో.. అనుభవంలేని  జట్టుతో డికాక్‌‌ ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.

వెస్టిండీస్‌‌ టూర్‌‌లో అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టి  వన్డే వరల్డ్‌‌కప్‌‌ ఓటమి నుంచి తేరుకున్న టీమిండియా ఇప్పుడు హోమ్‌‌ సీజన్‌‌లో అదరగొట్టేందుకు సిద్ధమైంది.  సౌతాఫ్రికాతో  మూడు టీ20ల సిరీస్‌‌కి సమరోత్సాహంతో బరిలో దిగుతోంది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌పై దృష్టి పెట్టిన కోహ్లీసేన ఇప్పటికే సన్నాహం మొదలు పెట్టింది. విండీస్‌‌పై విజయ జోరును హోమ్‌‌గ్రౌండ్‌‌లోనూ కొనసాగించడంతో పాటు   కుర్రాళ్లను పరీక్షిస్తూ.. జట్టులో లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టింది. ఇక, వరల్డ్‌‌కప్‌‌లో దారుణమైన పెర్ఫామెన్స్‌‌ చేసిన సఫారీలు ఆ మెగా టోర్నీ తర్వాత తొలిసారి బరిలోకి దిగుతున్నారు.  పలువురు కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయి  కొత్త కెప్టెన్‌‌ డికాక్‌‌ సారథ్యంలో  కోహ్లీసేనతో కుస్తీ పట్టనున్నారు..!  ఈ ఫార్మాట్‌‌లో ఇండియాపై తమ మెరుగైన రికార్డును కొనసాగించాలని కోరుకుంటున్నారు!  అయితే, ధర్మశాలలో ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌‌కు వర్షం ముప్పు ఉండడం ఇరు జట్లను ఆందోళన కలిగిస్తోంది.

పిచ్‌‌,వాతావరణం

ఈ  మ్యాచ్‌‌కు వాన ముప్పు ఉంది. శనివారం సాయంత్రం భారీ వర్షం పడడంతో  కోహ్లీసేన ఇండోర్‌‌ నెట్స్​లో ప్రాక్టీస్‌‌ చేసింది. అప్పటికే మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచగా.. అవి వాన నీటితో నిండిపోయాయి. ఆదివారం కూడా వర్షం పడే చాన్సుంది. ధర్మశాల పిచ్‌‌ పేసర్లకు సహకరిస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పేసర్లు మరింత ప్రభావం చూపొచ్చు. ఇరు జట్ల మధ్య 2015లో ఇక్కడ జరిగిన హైస్కోరింగ్​ మ్యాచ్​లో రోహిత్​ సెంచరీ చేసినా ఇండియా ఓడింది.

జట్లు (అంచనా)

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌), రోహిత్‌‌, ధవన్‌‌, శ్రేయస్‌‌, పంత్‌‌, హార్దిక్‌‌, క్రునాల్‌‌, జడేజా/రాహుల్‌‌ చహర్‌‌, సుందర్‌‌,  సైనీ, దీపక్‌‌/ఖలీల్‌‌.

సౌతాఫ్రికా: డికాక్‌‌ (కెప్టెన్‌‌), హెండ్రిక్స్‌‌, బవూమ, వాండర్‌‌ డుసేన్‌‌,  మిల్లర్‌‌, పెహుల్‌‌క్వాయో,  ప్రెటోరియస్‌‌, బ్యోర్న్‌‌ ఫార్టుయిన్‌‌/లిండే, రబాడ, డలా, షమ్సీ.