పాక్ తో సాధారణ సంబంధాలే కోరుకుంటున్నం : మోడీ

పాక్ తో  సాధారణ సంబంధాలే కోరుకుంటున్నం : మోడీ
  •     పొరుగు దేశంతో మంచి సంబంధాలనే కోరుకుంటున్నం  
  •     బార్డర్ లో శాంతి ఉంటేనే చైనాతో మంచి రిలేషన్స్   
  •     జపాన్ పత్రిక ‘నిక్కీ ఆసియా’కు ఇంటర్వ్యూలో మోడీ  
  •     జీ7 సమిట్ లో పాల్గొనేందుకు జపాన్ చేరుకున్న ప్రధాని 
  •     ఆరు రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటన

టోక్యో:  పాకిస్తాన్ తో ఇండియా సాధారణ సంబంధాలనే కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే, ముందుగా క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ఆపేసి, టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు ఆ దేశం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బార్డర్ లో శాంతి ఉంటేనే చైనాతోనూ మంచి సంబంధాలు ఉంటాయని ఆయన అన్నారు. హిరోషిమాలో జరుగుతున్న జీ7 దేశాల సమిట్ లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ శుక్రవారం జపాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హిరోషిమాలో జపాన్ పత్రిక ‘నిక్కీ ఆసియా’కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. టెర్రరిజాన్ని అంతం చేసేందుకు అనుకూల వాతావరణం నెలకొనేలా పాక్ చర్యలు తీసుకుంటేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని ఆయన చెప్పారు. చైనాతో సంబంధాలపైనా ఆయన స్పందిస్తూ.. ఇండియా సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్నారు. చైనాతో సాధారణ సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనడం తప్పనిసరని చెప్పారు. రెండు దేశాలూ పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని, పరస్పర ప్రయోజనాల కోసం పని చేయాలన్నారు.  రష్యా, ఉక్రెయిన్ వివాదంలో ఇండియా మధ్యవర్తి పాత్ర పోషిస్తుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఈ విషయంపై ఇప్పటికే స్పష్టమైన వైఖరిని చెప్పామన్నారు. ఇది యుద్ధాల సమయం కాదని, చర్చలు, సహకారం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని మరోసారి స్పష్టం చేశారు. జీ7 సమిట్ లో గ్లోబల్ సౌత్ దేశాల తరఫున గొంతును వినిపిస్తామని మోడీ చెప్పారు. ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, సప్లై చైన్ లలో వచ్చిన మార్పులు, సవాళ్లపైనా చర్చిస్తామని తెలిపారు. 

ఇప్పుడు జీ7కు వెళ్లడంలో ఓ అర్థం ఉంది.. 

ఇండియా తరఫున ఇప్పుడు  జీ7 దేశాల సమిట్ కు హాజరవడంలో ఓ అర్థం ఏర్పడిందని ప్రధాని మోడీ అన్నారు. జీ20 గ్రూప్ కు ఇండియా అధ్యక్షత వహిస్తూ దేశంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని ఈ కామెంట్స్ చేశారు. శుక్రవారం జపాన్ పర్యటనకు బయలుదేరే ముందు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరు రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. ముందుగా జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 సదస్సులో శని, ఆదివారాల్లో జరిగే రెండు సమావేశాల్లో పాల్గొంటానని, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడాతో సమావేశమవుతానని తెలిపారు. ఆ తర్వాత పపువా న్యూగినియా సోమవారం జరిగే 14 పసిఫిక్ ఐల్యాండ్ దేశాల సదస్సుకు హాజరవుతానని, పపువా న్యూగినియా ప్రధానితో భేటీ అవుతానన్నారు. ఈ సదస్సు తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటిస్తానని, తన స్నేహితుడు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ తో భేటీ అవుతానని పేర్కొన్నారు. కాగా, గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7)లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ఏ సభ్య దేశాలుగా, యూరోపియన్ యూనియన్ అదనపు సభ్య దేశంగా ఉన్నాయి. జీ7 దేశాల సమిట్స్ కు ఇండియా 2003 నుంచి గెస్ట్ కంట్రీగా హాజరవుతోంది.  
హిరోషిమా మృతులకు జీ7 లీడర్ల నివాళులు

రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వేసిన అణుబాంబుతో బూడిదైన హిరోషిమా నగరంలో జీ7 సమిట్ ను నిర్వహించడం ద్వారా అణ్వాయుధాల నిర్మూలన అంశాన్ని ప్రపంచం ముందుకు తీసుకెళ్లేలా జపాన్ ప్రయత్నాలు చేస్తోంది. అణుబాంబు పేలుడుతో  దాదాపు 1,40,000 మంది బలైపోయిన హిరోషిమా నగరంలోనే జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడ మూలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జీ7కు జపాన్ అధ్యక్షత వహిస్తున్నందున.. ఈ వేదికను ఉపయోగించుకుని ఆయన అణ్వాయుధాల నిర్మూలన అంశాన్ని తెరపైకి తెచ్చేలా హిరోషిమాలో ఈ సమిట్ ను నిర్వహిస్తున్నారు. శుక్రవారం సమిట్ ప్రారంభం సందర్భంగా హిరోషిమాకు చేరుకున్న జీ7 దేశాల అధినేతలను ఆయన స్వయంగా వెంటబెట్టుకుని పీస్ మెమోరియల్ పార్క్ వద్దకు తీసుకెళ్లారు. అణుబాంబు దాడిలో మరణించిన వారికి 
అందరూ కలిసి నివాళులు అర్పించారు.